వారి పోరాటం ఫలించాలంటే...

30 Nov, 2022 02:21 IST|Sakshi

విశ్లేషణ

పోలీసుల కస్టడీలో మాసా అమీనీ మరణించిన ఘటన అనంతరం పెల్లుబికిన నిరసనలు ఇరాన్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులు, యువతులు కీలక పాత్ర పోషిస్తుండగా, ఇరాన్‌ సమాజంలోని సకల వర్గాల ప్రజలు ఈ నిరసన ప్రదర్శనల్లో చేరుతున్నారు. మరోవైపు వేలాదిమంది నిరసనకారులను అరెస్టు చేయడంతోపాటు జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు వంటివారిపై కూడా ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఇరాన్‌ భద్రతా బలగాల చేతిలో ఇప్పటివరకూ 326 మంది చనిపోయారు. నిరసనకారులకు క్షమాభిక్ష పెట్టరాదని పార్లమెంట్‌ తీర్మానం చేసింది. ఇరాన్‌ సమాజం మొత్తం ఏకమై సాగిస్తున్న ఈ చిరస్మరణీయ పోరాటానికి భారత్‌తో సహా ప్రపంచ దేశాల సంఘీభావం అవసరం.

సెప్టెంబర్‌ 16న మాసా అమీనీ అనే 22 ఏళ్ల కుర్దిష్‌ ఇరానియన్‌ యువతి పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన ఇరాన్‌లో రగిలించిన ప్రదర్శనలు పదో వారంలోకి ప్రవేశించాయి. నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ మానవ హక్కుల ఎన్జీవో (ఐహెచ్‌ఆర్‌ఎన్‌జీఓ) ప్రకారం, పట్టణాల్లో దీనిపై తిరుగుబాటు ప్రారంభమైనప్పటినుంచి ఇరాన్‌ భద్రతా బలగాల చేతిలో 326 మంది చనిపోయారు. ఇందులో 40 మంది పిల్లలు. వీరు కారులో ఉండటమో, దారిపక్కన నిలుచుని ఉండటమో జరిగింది. 

పోలీసులచే హత్యకు గురైన పిల్లల జాబితాలో ఇటీవల చేరిన అబ్బాయి పేరు కియాన్‌ పిర్‌ఫాలక్‌. తొమ్మిదేళ్ల కియాన్‌ ఇరాన్‌లోని ఐజేహ్‌ నగరానికి చెందినవాడు. అనేక ఇతర కేసుల్లో జరిగిన విధం గానే భద్రతా బలగాలు తమ కుమారుడిని లాక్కెళ్తారనే  భయంతో అతడి దేహాన్ని ఐసుతో కప్పి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఇరాన్‌ వ్యాప్తంగా పౌరుల హత్యలు జరుగుతున్నప్పటికీ, షియా సంప్ర దాయం ప్రకారం 40వ రోజున చనిపోయినవారి స్మృతిలో ప్రదర్శన కారులు తిరిగి వీధుల్లోకి వచ్చారు. 

ఒకవైపు ప్రజాగ్రహం, ఆందోళనలు కొనసాగుతుండగానే, ఇంత వరకూ అరెస్టయిన 13,000 మంది నిరసనకారులకు దేశ న్యాయ వ్యవస్థ ఎలాంటి క్షమాభిక్ష పెట్టరాదని ఇరాన్‌ పార్లమెంటులోని 290 మంది ఎంపీల్లో 227 మంది డిమాండ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానియన్‌ మానవ హక్కుల కార్యకర్తల ప్రయత్నాలు, నిరసన కారులకు మద్దతుగా కెనడా, బ్రిటన్, యూరోపియన్‌ కౌన్సిల్‌ సంకేతా త్మకంగా ఆంక్షలు అమలు చేసినప్పటికీ ఇవేవీ ఇరాన్‌ అధికారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగించలేదు. ఇరాన్‌ ప్రజల తలరాత పట్ల భారతీయులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పూర్తిగా ఉదాసీనంగా ఉంటున్నారు. ప్రతిరోజూ మృతి చెందుతున్న నిరసన కారుల సంఖ్య పెరుగుతూ వస్తూండగా, అరెస్టయిన వారిని సామూ హికంగా విచారించడం వేగవంతమవుతోంది.

గత కొన్ని నెలలుగా వేలాదిమంది నిరసనకారులను అరెస్టు చేయడంతోపాటు ఇరాన్‌ ప్రభుత్వం దేశంలోని జర్నలిస్టులు, విద్యా ర్థులు, పాఠశాలలు, డాక్టర్లు, లాయర్లు వంటివారిపై కూడా నిర్బంధం విధించింది. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ అంచనా ప్రకారం ఇరాన్‌లో గత 10 వారాల్లో 51 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు.

నిరసన ప్రదర్శనలు ప్రారంభమై నప్పటినుంచి అక్టోబర్‌ 30వ తేదీ వరకు 308 మంది యూనివర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ బలగాలు అరెస్టు చేశాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ అంచనా. ఇరాన్‌లో పనిచేస్తున్న కొందరు మానవ హక్కుల కార్య కర్తల అభిప్రాయం ప్రకారం, 2022 నవంబర్‌ ప్రారంభం నాటికి 130 మంది మానవ హక్కుల సమర్థకులను, 38 మంది మహిళా హక్కుల సమర్థకులను, 36 మంది రాజకీయ కార్యకర్తలను, 19 మంది లాయర్లను ఇరాన్‌ నిఘా సంస్థలు అరెస్టు చేశాయి.

ఇరానియన్‌ న్యాయవ్యవస్థకు చెందిన న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం, వివిధ ప్రావిన్సుల్లో నిరసనకారులపై నేరారోపణ అభియోగాలు మోపటం మొదలైపోయింది. అల్‌బోర్జ్‌ ప్రావిన్స్‌లో 201, జంజీన్‌లో 119, కుర్దిస్తాన్‌లో 110, ఖుజెస్తాన్‌లో 105, సెమ్‌నన్‌లో 89, ఖజ్విన్‌లో 55, కెర్మన్‌లో 25 చార్జిషీట్‌లను మోపగా, రాజధాని నగరమైన తెహ్రాన్‌లో వెయ్యిమంది నిరసనకారులపై చార్జిషీట్‌ మోపారు. దీనికితోడుగా, అక్టోబర్‌ 30న తెహ్రాన్‌లోని రివల్యూషనరీ కోర్టు 15వ బ్రాంచ్‌... ఆరుగురు నిరనసకారులపై యుద్ధం చేస్తున్నారనీ, వీరు అత్యంత అవినీతిపరులనీ, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుమ్మక్క య్యారనీ అభియోగాలు మోపింది.

దేశంలో కొనసాగుతున్న నిరనస ప్రదర్శనల్లో విద్యార్థులు, యువతులు కీలక పాత్ర పోషిస్తుండగా, ఇరాన్‌ సమాజంలోని సకల వర్గాల ప్రజలు నిరసనల్లో చేరుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2009, 2017లో జరిగిన సామాజిక ఉద్యమాల్లా ప్రస్తుత నిరసన ప్రదర్శనలు చల్లారేట్టు కనిపించడం లేదు. దీనికి రెండు కారణాలు తోడయ్యాయి. మొదటిది: ఇరానియన్‌ టీనేజర్లు, విద్యా ర్థులు తమ తల్లిదండ్రుల కంటే మరింత సాహసవంతులుగా, పోరాట కారులుగా మారారు. ఎందుకంటే వారికి ఇకపై భవిష్యత్తు అనేది కనిపించడం లేదు. రెండు: ఇరాన్‌ ప్రభుత్వ నైతికస్థైర్యం∙ఎంత బల హీనపడిందంటే, దాని సైనిక, రాజకీయ సంస్థలు ఎలాంటి విశ్వస నీయతనూ కలిగించడం లేదు.

గత రెండు నెలల్లో, ఇరాన్‌ కళాకారులు, మేధావులు, క్రీడాకారులు మొత్తంగా ప్రదర్శనకారుల పట్ల సంఘీభావం తెలిపారు. ఇలాంటి ఐక్యతా ప్రదర్శనకు తాజా ఉదహరణగా ఇరాన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ నిలబడింది. నవంబర్‌ 21న ఇంగ్లండ్‌పై ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరగ డానికి ముందు సాంప్రదాయికంగా తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఇరాన్‌ జట్టు తిరస్కరించింది. ఇరాన్‌ ప్రభుత్వం దేశంలో పిల్లలను, యువతను కాల్చి చంపుతున్నందుకు తీవ్ర నిరస నను జాతీయ గీతం ఆలపించకపోవడం ద్వారా ప్రదర్శించిన ఇరాన్‌ పుట్‌బాల్‌ జట్టు బహిరంగంగానే దేశీయ నిరసనకారులకు  సంఘీ భావం తెలిపింది.

దేశ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరాన్‌ అధికా రులు ఒక అడుగు వెనక్కు వేసి తాము ఎక్కడ నిలిచామో అంచనా వేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన అంచుకు చేరినట్లు కనబడుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇస్లామిక్‌ పాలనకు ముగింపు పలకడానికి చేతులు కలుపుతున్నారు. మరోవైపున యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్, అమెరికాలు ఇరాన్‌ వీధుల్లో స్కూలు పిల్లలను, టీనేజర్లను కాల్చి చంపుతున్న వ్యవస్థతో సజావుగా వ్యాపారాన్ని సాగించలేరు. అందుకే పశ్చిమదేశాలు, తూర్పుదేశాలు కూడా తమ ప్రజాస్వామ్య విధిని పరిపూర్తి చేయడం కోసం ఇరాన్‌ ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల మద్దతు లేకుండా ఇరానియన్లు స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని సాధించలేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అత్యంత ప్రధానమైన శక్తి ఏదంటే, ఇస్లామిక్‌ పాలనలోని అణిచివేతకు లోబడిపోవడానికి తిరస్కరిస్తున్న ఇరానియన్లు మాత్రమే. అదే సమయంలో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించే విషయంలో తమ తమ ప్రభుత్వాలతో లాబీయింగ్‌ చేయడం, క్రీడలు, సాంస్కృతిక అంశాలను బహిష్కరిం చడం, ఇరాన్‌లో పౌర ప్రతిఘటనా ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతుకోసం ప్రజలను కూడగట్టడం వంటి చర్యల ద్వారా అంతర్జాతీయ మిత్రుల సహాయం చాలా కీలకమని మనం మర్చిపోకూడాదు.

1980లలో దక్షిణాఫ్రికాలోని వర్ణవివక్షా పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఉదాహరణ అలాంటి ప్రయత్నానికి స్ఫూర్తి దాయకంగా నిలబడవచ్చు. ఈ సందర్భంగా 2005లో జోహాన్స్‌బర్గ్‌లో నెల్సన్‌ మండేలా చెప్పిన మాటలను మనం మర్చిపోకూడదు. ‘‘మేం నిర్బంధంలో మగ్గుతున్నప్పుడు మాపై అణచివేతకు వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇచ్చిన మద్దతును మేం ఎన్నడూ మర్చిపోము.

ఆ ప్రయత్నాలు ఫలించాయి. అందువల్లే పేదరికం నుంచి విముక్తి కోసం మద్దతునివ్వడంలో ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలతో మేము భుజం కలిపి నిలబడగలుగుతున్నాం.’’ ఆ విధంగానే ఈరోజు కోట్లాది ఇరాన్‌ ప్రజలు సగర్వంగా లేచి నిలబడుతున్నారు. భారత్‌తో పాటు, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సంఘీభావం కోసం వారు వేచి చూస్తున్నారు.
వ్యాసకర్త ఇరానియన్‌ పొలిటికల్‌ ఫిలాసఫర్‌

రామిన్‌ జహాన్‌బెగ్లూ 
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు