గొంతెత్తడం ప్రజల రాజకీయ కర్తవ్యం

28 Mar, 2023 00:45 IST|Sakshi

రెండో మాట

అభిప్రాయ ప్రకటనకు వీలులేని స్వాతంత్య్రం నిరర్థకం. పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ దేనికి? అలా లేనప్పుడు దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి అంతకన్నా పెద్ద ప్రమాదం మరొకటి లేదు. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదని శతాబ్దం క్రితమే సుప్రసిద్ధ అమెరికన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లూయీ బ్రాండీస్‌ అన్నారు.

పౌరులకు భారత రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా పాలక పక్షాలు అడ్డుకుంటూనే వస్తున్నాయి. పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలిగిన పాలకులే ప్రజల మన్నన పొందగలరు. పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలిగినవారే పౌరస్వేచ్ఛకు హామీ ఇవ్వగలరు.

‘‘స్వాతంత్య్రం పొందిన దేశంలో రాజ్య పాలనా వ్యవస్థ అంతిమ లక్ష్యం– దేశ పౌరులు స్వేచ్ఛగా తమ శక్తియుక్తుల్ని వృద్ధి చేసుకునేటట్లు వారికి అండదండలుగా నిలవగల్గడం. ప్రభుత్వంలో నిరంకుశ ధోరణులు ప్రబలి నప్పుడు బుద్ధిగల పాలకులు వాటిని అణచివేయాలి. అలాంటి పాల కులు మాత్రమే ప్రజల మన్ననలు పొందగల్గుతారు. అలాంటి పాలకులు మాత్రమే పౌర స్వేచ్ఛకు ‘శ్రీరామరక్ష’గా నిలబడగలరు.

అలాంటి వారు మాత్రమే పౌరుల సుఖ సంతోషాలే తమ సుఖసంతోషాలని విశ్వసించగలరు. పౌరులు స్వేచ్ఛగా ఆలోచించగల్గి, స్వేచ్ఛగా మాట్లాడగల్గడం అనే లక్షణం– రాజకీయ సత్యాల్ని స్వేచ్ఛగా అన్వేషించి కనుగొనడానికి అనివార్యమైన లక్షణమని గుర్తించాలి. స్వేచ్ఛగా అభిప్రాయ ప్రకటనకు, పౌరుల సమావేశ స్వేచ్ఛకు, చర్చలకు అవకాశం కల్పించని వ్యవస్థ నిరర్థకం.

ఒక దేశ పౌరులు తమ సమస్యలపై స్పందించడానికి స్వేచ్ఛ లేని దేశ స్వాతంత్య్రం అనర్థం, ప్రమాదకరం. బహిరంగ చర్చలు, నిర్ణయాలు ప్రజల రాజకీయ కర్తవ్యమని మరచిపోరాదు.’’
– సుప్రసిద్ధ అమెరికన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లూయీ బ్రాండీస్‌

‘‘వచ్చే సాధారణ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే, 2024 పోరాటం ఎవరో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగే పోరుగా కాకుండా దేశంలో ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికీ మధ్య జరగ వలసిన సంకుల సమరంగా అన్ని ప్రతిపక్షాలూ భావించి ఉమ్మడిగా రంగంలోకి దిగేందుకు నడుం కట్టాలి.’’
– ప్రొఫెసర్‌ హర్బన్స్‌ ముఖియా, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్రాధ్యాపకులు (27 మార్చ్‌ 2023)

జస్టిస్‌ బ్రాండీస్‌ శతాబ్దం క్రితం చేసిన చరిత్రాత్మక హెచ్చరిక పౌర సమాజాలకు అరమరికలు లేని బహిరంగ చర్చలు నిరంతర రాజకీయ కర్తవ్యంగా కొనసాగవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. దేశ రాజ కీయ పాలనా వ్యవస్థను ఒక వైపు నుంచి స్వాతంత్య్రానంతరం గాడి తప్పిన కాంగ్రెస్‌ (ఐక్య సంఘటన పాలన మినహా) పాలకులు, మరొకవైపు నుంచి బీజేపీ నడిపిస్తూ వచ్చాయి.

రాజ్యాంగ మౌలిక సూత్రాలను తమ ఇష్టానుసారం తారుమారు చేసి, భారత పౌరులకు రాజ్యాంగం హామీపడిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అక్షరసత్యంగా అమలు జరగకుండా ఇవి అడ్డుకుంటూనే వచ్చాయి. వ్యక్తిగత ఎజెండా లతో పాలనా పద్ధతుల్ని భ్రష్టు పట్టిస్తూనే వచ్చాయి.

ఇక నేటి బీజేపీ పాలకవర్గం ప్రేమించే ఇజ్రాయెల్‌లో ఒక సరికొత్త పరిణామం తలెత్తింది. ఆ దేశ ప్రధానమంత్రిని ఏ పరిస్థితుల్లోనూ పాలనకు తగడని పదవి నుంచి తొలగించడానికి వీలు లేకుండా ఇజ్రా యెల్‌ తాజాగా చట్టం చేసింది. దీన్ని ‘ఇజ్రాయెలీ రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థలోనే సరికొత్త విపత్కర పరిణామం’గా బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూ ట్‌లో మధ్యప్రాచ్య విధాన నిర్ణయ కేంద్రం డైరెక్టర్‌ నతన్‌ సాక్స్‌ అభివర్ణించాడు.

ఇజ్రాయెల్‌ కొత్త శాసనం ప్రకారం ఆ దేశపు సుప్రీంకోర్టుకు ఇజ్రాయెల్‌ పాలకవర్గంపైగానీ, దేశ శాసనాలపైగానీ అవసర మైన అదుపాజ్ఞలను జారీ చేసే హక్కు ఉండదు. ఈ తాజా పరిణామం ప్రభావం భారత పాలనా వ్యవస్థకు విస్తరించకుండా ఉండాలని మాత్రమే మనం కోరుకోగలం.

విచ్చలవిడిగా దేశ ఏకైక కుబేర వర్గంగా బలిసినవారి గురించి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తన పాదయాత్రలో ప్రస్తావించి, విమర్శిస్తే పాలకులకు అంత ‘గుర్రెందు’కు? ఏ మాటకామాటే చెప్పు కోవాలి. కాంగ్రెస్‌ హయాంలోనూ, వారు ఈ వర్గంతో అంటకాగుతూ వారి దోపిడీ యథేచ్ఛగా సాగడానికి అనుమతించిన వారేనని మరచి పోరాదు! దీనికి భిన్నంగా తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసిన ప్రజల కడగండ్ల దృష్ట్యా రూపొందించిన ‘నవరత్న’ ప్రణాళికను ఆ ప్రజలకు జీవశక్తిగా మలిచారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. కోవిడ్‌ ఒడుదొడుకుల ఫలితంగా రాష్ట్రం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురైనా జగన్‌ తట్టుకోగల్గడం ప్రశంసనీయ పరిణామంగా భావించాలి. అందుకే వేమన అన్నాడేమో:

‘‘భూమిలోన పుణ్యపురుషులు లేకున్న జగములేల నిల్చు పొగులు లేక (కుమిలిపోక)’’
రాహుల్‌ ఇవాళ ఇన్ని కబుర్లు చెబుతున్నారుగానీ, జగన్‌కన్నా ముందు ఉన్నత స్థాయికి ఎందుకు దూసుకురాలేక పోయారు? ‘అసూయ’ అనలేంగానీ, తనపై బనాయించిన అక్రమ కేసుల్ని జగన్‌ ఎదుర్కొంటూ పదహారు మాసాలకు పైగా జైళ్లలో మగ్గుతున్న ఘడియలలో ఒక్కసారైనా రాహుల్‌ సానుభూతిని ప్రకటించగలిగాడా? ఇవాళ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్లను సుప్రీంకోర్టు హెచ్చరికలను సహితం లెక్క చేయకుండా స్వార్థ రాజకీయాలకు బీజేపీ పాలకవర్గం వినియోగిస్తున్న తీరు అభ్యంతరకరమే కాదు, పరమ హాస్యాస్పదం! ‘ఉపా’ చట్టాన్ని తమ మనుగడకు బీజేపీ పాల కులు ‘ఉపాహారం’గా మలుచుకోవడం దారుణ పరిణామం! ప్రస్తుత సుప్రీంకోర్టు చైతన్యంతో నిర్ణయాలు చేస్తూండటం ఒక్కటే జస్టిస్‌ బ్రాండీస్‌ సంప్రదాయానికి నేడూ, రేపూ ‘శ్రీరామరక్ష’గా భావించాలి! ఇంతకూ మనం కనీసం కోరుకోదగిందల్లా – సుప్రీంకోర్టు అధికారాలను ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ తగ్గించినట్టుగా 2024 ఎన్నికలకు ముందే అలాంటి పరిణామం భారత్‌లో రాకూడదనే!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాకులు 
abkprasad2006@yahoo.co.in 

>
మరిన్ని వార్తలు