‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం

16 Mar, 2023 01:02 IST|Sakshi

విశ్లేషణ

ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే.

ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్‌ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి.

భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని  రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు.     

ఎంఎన్‌ రాయ్‌ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్‌ను దళితులు కనిపెట్టారు.

అంబేడ్కర్‌ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్‌ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ.

భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది.

గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది.

అంబేడ్కర్‌ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న  అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్‌ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.

దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని  జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్‌ చెప్పారు. 

మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంలో ప్రధానమైన  అంశం. నిజానికి  మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్‌ఎస్‌ శర్మ, బిపిన్‌ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్‌ చెప్పారు.

ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు.

అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు.  మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే...  ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. 

మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు.

ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ  శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార  పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. 

సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ  వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్‌: రోడ్‌మ్యాప్స్‌ ఫర్‌ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.

ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి.

ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్‌ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు  వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695

మరిన్ని వార్తలు