ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?

5 Dec, 2022 00:33 IST|Sakshi

కామెంట్‌

ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు భావిస్తుండవచ్చు. దీనికి మంచి సాక్ష్యం కశ్మీర్‌లో తీవ్రవాదుల సంఖ్య గురించిన సమాచారం. కశ్మీర్‌ లోయలో ఇప్పుడు 81 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులనీ డీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

అంత కచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు? వాళ్లు ఏమైనా వస్తూపోతున్నప్పుడు ఒక రిజిస్టర్‌లో సంతకాలు ఏమైనా పెడుతున్నారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా? వీళ్ల ఆనుపానులు కూడా ఇంత కచ్చితంగా తెలిసినప్పుడు మరి వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదు? ఉగ్రవాదుల గురించిన వివరాలపై మనం ఇలాంటి మామూలు ప్రశ్నలు కూడా వేయలేమా? పైగా వాటిని నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా భావిస్తుండటం మరీ విషాదం.

ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులకు చాలావరకు మనలాంటి సాధారణ ప్రజలు ఏది చెప్పినా సరే మందమతుల్లాగ తలా డించేస్తుంటారని గట్టినమ్మకం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా లేక ఆఫీసులో ఉంటున్న ఏ అధికారి విషయంలోనైనా ఇది నిజమనే చెప్పాలి. కానీ అప్పుడప్పుడూ వాళ్లు ఇచ్చే సమాచారం ప్రతిదీ నమ్మేసేవాళ్లను కూడా ఆలోచనలో పడేస్తుంది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినంత వరకూ ఇది చాలా తరచుగా నిజమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. 

గత శనివారం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) విజయ్‌ కుమార్‌ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రికకు నివ్వెరపరచే వివరాలు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో 81 మంది యాక్టివ్‌ ఉగ్రవాదులు ఉన్నారు. వీరిలో 29 మంది స్థానికులు కాగా, 52 మంది విదేశీ ఉగ్రవాదులు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? ఉగ్రవాదులు వచ్చి సంతకాలు పెట్టిపోయేలా మనం ఏమైనా ఒక రిజిస్టర్‌ నిర్వ హిస్తున్నామా? పైగా వారి మూలం, నేపథ్యం గురించి మనకేమైనా చెప్పారా? లేక వారి గురించిన సమస్త వివరాలనూ వాసన పట్టేసే మార్గాలు అక్షరాలా మనవద్ద ఉన్నాయా?

అంకెలు సరిపోతున్నాయా?
అంతమాత్రమే కాదు. డీజీపీ ఇంకా చాలా నిర్దిష్టంగా ఉన్నారు. ‘‘బందీపుర్, కుప్వారా, గాందర్‌బల్‌ జిల్లాల్లో స్థానిక ఉగ్రవాదులు అసలు లేరు. కాగా అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా, బడ్‌గావ్‌ జిల్లాల్లో ఒక్కో ఉగ్రవాది మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల సంఖ్య విషయంలో ఆయన అంత నిర్దిష్టంగా, కచ్చితంగా ఎలా చెప్పగలిగారు అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడదాం.

ఇప్పుడు విదేశీ ఉగ్రవాదుల అంశం ముందుకు తెద్దాం. తొలి మూడు జిల్లాల్లోనే విదేశీ తీవ్రవాదులు పనిచేస్తున్నారని డీజీపీ సూచిస్తున్నారా? రెండవది, ఆయన పేర్కొన్న చివరి నాలుగు జిల్లాల్లో ఒకే ఒక స్థానిక ఉగ్రవాది ఉంటున్నాడా? వారి ఉనికిని ఇంత కచ్చితంగా మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే వారు ఉన్న ప్రదేశం కూడా మనకు తెలిసిపోయినప్పుడు వారిని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?

వాస్తవానికి ఈ ప్రశ్నలు డీజీపీ విజయ్‌ కుమార్‌ని ఇబ్బంది పెట్టవు. ఆయన్ని తన మార్గం నుంచి వైదొలిగేలా చేయవు కూడా! పైగా ప్రతి సంవత్సరం ఎంతమంది స్థానిక కశ్మీరీలు తీవ్రవాదుల్లో చేరుతున్నారు అనేది కూడా ఆయనకు తెలిసినట్లే కనబడుతోంది. బహశా వారు తమ వివరాలు ఆయనకు తెలిపి ఉండవచ్చు లేదా వారికి అత్యంత విశ్వసనీయమైనవారు, సన్నిహితమైనవారు డీజీపీ చెవిలో ఊది ఉండవచ్చు.

2018లో 201 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఈ సంవత్సరం వారి సంఖ్య 99కి పడిపోయిందని డీజీపీ ప్రకటించారు. ఇంత కచ్చితమైన వివరాలు ఆయనకు ఎలా తెలిశాయి అని ఎవరూ డీజీపీని అడగలేరు. లేదా ఆయన బహుశా చెప్పరు కూడా! నిజానికి తనను వైరుద్ధ్యాల్లోకి లాగుతున్న ఈ 99 సంఖ్యను తాను బయటపెట్టినప్పటికీ తనను ఎవరూ నిలదీయరని ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నట్లున్నారు.

ఈ సంవత్సరం కశ్మీర్‌ లోయలో 99 మంది స్థానికులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో 64 మంది హతమై పోయారనీ, 17 మందిని అరెస్టు చేయగా 18 మంది ఉగ్రవాదులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారనీ డీజీపీ వివరించి చెప్పారు. అయితే పైన చెప్పిన వివరాలకేసి చూస్తే, 29 మంది స్థానిక ఉగ్రవాదులు మాత్రమే లోయలో ఉన్నారని ఆయన చెప్పి ఉన్నారు. మరి మిగతా 11 మంది ఉగ్రవాదులు ఎక్కడ తప్పిపోయారు?

ఇవి కేవలం వివరాలు మాత్రమే కాబట్టి వీటికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే డీజీపీ మరింత ముఖ్యమైన విషయం ప్రకటించారు.

అదేమిటంటే, చనిపోయిన 64 మంది ఉగ్రవాదుల్లో 57 మంది వారు చనిపోవడానికి సరిగ్గా నెల ముందే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్న సంగతి! ఈ విషయం కూడా ఆయనకు ఎలా తెలుసు? వారు ఎప్పుడు చేరిందీ ఆయనకు తెలిసి ఉంటే, వారిని ఎందుకు ఆపలేకపోయారు లేదా కనీసం వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అయితే ఈ ప్రశ్నలను నేను అడగలేదు.

మొత్తం మీద ఉగ్రవాదులకు చెందిన ఇంత సున్నితమైన వివరాలు డీజీపీ చేతివేళ్లపై అంత కచ్చితంగా ఆడుతున్నప్పుడు నాకు ఒకే సందేహం ఉంది. కొంప దీసి డీజీపీ విజయ్‌ కుమార్‌ ఈ ఉగ్ర వాదుల జీవిత చరిత్రలు త్వరలో రాసినా నేనేమీ ఆశ్చర్యపోను.

ప్రశ్నించరనే ధీమానా?
ఇప్పుడు, కశ్మీర్‌ లోయలో పోలీసుల కచ్చితత్వం గురించి మూగ పోయేవారిలో నేనే మొదటివాణ్ణి కాదు. 2000 సంవత్సరపు ప్రారంభంలోకి వెళ్లి చూద్దాం. పాకిస్తాన్‌ నుంచి నెలకు ఎంతమంది జిహాదీలు వాస్తవాధీన రేఖను దాటి వస్తున్నారో నాటి పోలీసులు మాకు నిత్యం వివరాలు చెబుతున్నప్పుడు, ఈజిప్ట్‌ రాయబారి గెహాద్‌ మాది తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయారు. ‘‘ఈ నెలలో 241 మంది వాస్తవాధీన రేఖను దాటి వచ్చారు.

గత నెలలో 225 మంది, అంతకు ముందు నెలలో 230 మంది భారత్‌ భూభూగంలోకి వచ్చారు అని చెబుతున్నారు. ఇంత కచ్చితంగా వారు ఎలా చెప్పగలరు? వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి అడుగుపెట్టే ముందు జిహాదీలు రిజిస్టర్‌లో సంతకం పెట్టివచ్చే కార్యాలయం ఏమైనా ఉందా?’’ అని ఈజిప్టు రాయబారి వ్యంగ్యంగా ప్రశ్నించారు.

గెహాద్‌ తన దౌత్య పరిధులను దాటి బహిరంగంగా తన సందేహాలను లేవనెత్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయన సంధించిన ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇచ్చి ఉండరు. కానీ ఇప్పుడు ఉగ్రవాదుల గురించి డీజీపీ విజయ్‌ కుమార్‌ చెప్పిన వివరాలపై కొన్ని మామూలు ప్రశ్నలు కూడా మనం వేయలేమా? డీజీపీ ఎవరి వద్దనయితే ఈ వివరాలు చెప్పారో ఆ జర్నలిస్టులు ఆయనను ఏమాత్రం ప్రశ్నించకపోవడం విషాదకరమైన విషయం. వారు ఏమీ అడగలేరని ఆయనకు తెలియడమూ, పైగా ఆయన చెప్పిన వివరాలు నిలదీయడానికి వీల్లేని పరమ సత్యాలుగా మనం కూడా ఆమోదిం చాలని డీజీపీ భావిస్తుండటమూ మరింత విషాదం.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు