దివ్య కాశీ – భవ్య కాశీ

13 Dec, 2021 00:49 IST|Sakshi

గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమైన పవిత్ర కాశీ నగరాన్ని పునరుజ్జీవింపచేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విశేష కృషి చేస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, చేపట్టారు. కాశీని సందర్శించే భక్తులకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి ప్రధాని గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు. ధార్మిక విశ్వాసాలకు కాశీ నెలవు. బౌద్ధ, జైనుల పవిత్ర గ్రంథాలలో కూడా కాశీ విశిష్టతను వివరించారు. హిందువుల ఆరాధ్య దైవం పరమ శివుడు కొలువుదీరిన క్షేత్రంగానే కాదు, బుద్ధ భగవానుడు తొలి ఉపన్యాసాన్ని ఇచ్చిన వైశిష్ట్యమూ ఈ కాశీ సొంతం. పురాతన కాశీ నగరాన్ని ఆధునికంగా, చైతన్యవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రధాని చేసిన కృషి నేడు ఫలిస్తోంది. ‘‘దివ్య కాశీ, భవ్య కాశీ’’ నినాదం మాత్రమే కాదు, దాని వెనుక స్పష్టమైన లక్ష్యం, దీర్ఘకాలిక వ్యూహం, మంచి ఆలోచనతో కూడిన కార్యాచరణ ఉన్నాయి.

2014 ఎన్నికలలో కాశీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నరేంద్రమోదీ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ‘‘ఇక్కడ పోటీ చేయమని నన్ను ఎవరూ పంపలేదు, నాకు నేనుగానూ ఇక్కడ పోటీ చేయాలని అనుకోలేదు, నన్ను రమ్మని గంగమ్మ తల్లి పిలిచింది, ఆ పిలుపునకే నేను స్పందిస్తున్నాను’’ అని అన్నారు. తల్లి ఒడికి చేరుకునే బిడ్డ పొందే అనుభూతిని అనుభవిస్తున్నానంటూ కాశీతో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని ప్రధాని అనేక వేదికలపై వెల్లడించారు. గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రమైన పవిత్ర కాశీ నగరాన్ని పునరుజ్జీవింపచేయడానికి ప్రధాని విశేష కృషి చేస్తున్నారు. ఇందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, చేపట్టారు. కాశీని సందర్శించే భక్తులకు సుసంపన్నమైన ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా కాశీని తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గొప్ప యజ్ఞానికి పూనుకున్నారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన కాశీ హిందువులకు పవిత్రమైన ధార్మిక క్షేత్రం. ప్రతి హిందువూ తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథుడిని దర్శించాలని కోరుకుంటాడు. జీవిత చరమాంకంలో చివరి గడియలను కాశీ విశ్వనాథుడి చెంత, గంగమ్మ ఒడిలో గడపాలని ఆకాంక్షిస్తాడు. ధార్మిక విశ్వాసాలకు కాశీ నెలవు. వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారత తదితర ఇతిహాసాల్లో కాశీ ప్రస్తావన ఉంది. బౌద్ధ, జైనుల పవిత్ర గ్రంథాలలో కూడా కాశీ విశిష్టతను వివరించారు. హిందువుల ఆరాధ్య దైవం పరమ శివుడు కొలువుదీరిన క్షేత్రంగానే కాదు, బుద్ధ భగవానుడు తొలి ఉపన్యాసాన్ని ఇచ్చిన వైశిష్ట్యమూ ఈ కాశీ సొంతం. కాశీ దగ్గరలోని సారనాథ్‌లో బుద్ధ భగవానుడు తన తొలి ఉపన్యాసం ఇచ్చారు. జైన మతానికి చెందిన తీర్థంకరులలో సుపర్శ్వనాథ్‌ (7 వ), చంద్రప్రభు (8వ), శ్రేయాన్సనాథ్‌ (11 వ), పార్శ్వనాథ్‌ (23 వ) వంటి వారికి జన్మనిచ్చిన నగరం కాశీ. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మాధవాచార్యులు, గోరక్షనాథ్‌ వంటి ఆధ్యాత్మికవేత్తలకు సైతం కాశీతో విశిష్ట అనుబంధం  ఉంది. భారతీయ సాహిత్యంలోనూ కాశీకి విశిష్ట స్థానం. కబీర్‌ దాస్, తులసీదాస్, రవిదాస్, మున్షి ప్రేమ్‌చంద్, భర్తెందు హరిశ్చంద్ర, జై శంకర్‌ వంటి వారు తమ రచనలు, పద్యాలు, కవితలు, కథల ద్వారా కాశీ ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు. భారతదేశంలోని ప్రతి పెద్ద సామ్రాజ్యానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు పవిత్రమైన కాశీ నగరంలో ఉన్నాయనడానికి ఇది నిదర్శనం. 14–18వ శతాబ్దం కాలంలో ధ్వంసమైన కాశీ నగరాన్ని 1777 – 80 కాలంలో రాణి అహల్యాబాయి హోల్కర్‌ పునః నిర్మించారు.

మన జాతిపిత మహాత్మాగాంధీ కాశీలోని దుర్బర స్థితిని చూసి తీవ్ర ఆవేదన చెందారు. గాంధీజీ ఆత్మకథ ‘మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌‘ పుస్తకంలో 1916 కాశీ సందర్శనను ఉటంకిస్తూ ఇలా రాశారు, ‘‘నేను కాశీ విశ్వనాథుడి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే చాలా బాధ కలిగింది. ఈ బాధ మాటల్లో చెప్పినదాని కన్నా చాలా ఎక్కువ. అక్కడ ప్రశాంతత లేదు. గుంపులు గుంపులుగా ముసురుకున్న ఈగల శబ్దాలు, వ్యాపారుల అరుపుల ద్వారా భక్తులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ధ్యానం చేద్దామని ప్రశాంత వాతావరణం ఆశించి వచ్చే వారికి అక్కడ విరుద్ధమైన వాతావరణమే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ, ప్రశాంతతను ఎవరికి వారు సొంతంగా వెతుక్కోవాల్సి ఉంటుంది.’’ అని గాంధీ తన అనుభవాలను పంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చినా కాశీలోని పరి స్థితులు పెద్దగా మారలేదు. అందుకే పవిత్ర కాశీ నగరాన్ని అభివృద్ధి చేయాలని నరేంద్రమోదీ సంకల్పించారు. ఈ ఆలోచన ఆయన క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టక ముందునుంచీ ఉంది.

రాణి అహల్యాబాయి అభివృద్ధి  చేసిన 240 సంవత్సరాల తరువాత కాశీ నగరం ఇవాళ ఒక గొప్ప మార్పును చూస్తున్నది. ఈ మార్పు గొప్ప సంకల్పం, సృజనాత్మకత, ఏకాభిప్రాయంతో కూడుకున్నది. ఆలయం చుట్టూ ఉన్న నిర్మాణాలకు సంబంధించిన అసలు యాజమానులను గుర్తించి, వారితో అనేకసార్లు చర్చలు జరిపి, వారిని ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయటానికి సిద్ధం చేశారు. ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం ద్వారా అక్కడున్న వ్యాపారులు, ధర్మశాలలు, మఠాలు, పాఠశాలలకు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసి, వారి జీవనానికి అవసరమైన ప్రత్యామ్నాయాలను చూపించారు. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నివసిస్తున్న వారిలో చాలా మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారే. మార్కెట్‌ ధర కన్నా నాలుగు రెట్లు వారి ఆస్తులకు చెల్లించారు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని పెద్ద కుటుంబాలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారం చూపించారు.

కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 40 వరకు అతి పురాతనమైన ఆలయాలు బయటపడ్డాయి. వివిధ నిర్మాణాలతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ పురాతన ఆలయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వాటిని సంరక్షించి, భక్తులు సందర్శించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాణి అహల్యాబాయి ఊహించిన విధంగానే కాశీ విశ్వనాథుని ఆలయం నేడు మణికర్ణిక, లలిత ఘాట్ల ద్వారా గంగానదికి చేరువగా ఉంది. 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో కూడిన చదును చేసిన మార్గం ఆలయాన్ని, గంగానది ఘాట్లను కలుపుతుంది. ఎటువంటి ఆంక్షలు లేని ఈ మార్గం ద్వారా సాయం సంధ్యా సమయంలో ఇచ్చే మహా హారతిని భక్తులు దర్శించుకోవచ్చు. వసతి సముదాయం, మరుగుదొడ్లు, లైబ్రరీ, మ్యూజియం, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రం వంటి అనేక సదుపాయాలను యాత్రికుల కోసం ఏర్పాటు చేశారు.3500 చదరపు మీటర్లలో కొలువుదీరిన ఆలయ పరిసరాలు, నీలకంఠుడి మంటపం, గంగానది కనిపించేలా ఉన్న కేఫ్‌లు, గొప్పగా అలంకరించిన 7 ద్వారాలు కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ మరిన్ని ప్రత్యేకలు.

భారతదేశంలోని రెండు రాజధానులు నేడు పునరుజ్జీవనాన్ని సంతరించుకుంటున్నాయి. పరిపాలన రాజధాని న్యూఢిల్లీ వలసవాద సంకెళ్లను తెంచుకొని, నాణ్యతారాహిత్య నిర్మాణాల నుంచి బయటపడుతోంది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న స్థలాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని 21వ శతాబ్దానికి తగిన విధంగా మన పార్లమెంటు సభ్యులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా, కాశీ నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ సందర్శించే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మెరుగుపరచటంతో పాటు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సహకరిస్తాయి. కేవలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనంతోనే సరిపెట్టకుండా, కాశీకి అనుబంధంగా ఉన్న రోడ్డు, రైలు, విమాన మార్గాలనూ అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సంకల్పించారు. 7 సంవత్సరాల తరువాత ఈ నిర్మాణాత్మక మార్పు నేడు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పురాతన కాశీ నగరాన్ని ఆధునికంగా, చైతన్యవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దటానికి చేసిన కృషి నేడు ఫలిస్తోంది. ‘‘దివ్య కాశీ, భవ్య కాశీ’’ నినాదం మాత్రమే కాదు, దాని వెనుక స్పష్టమైన లక్ష్యం, దీర్ఘకాలిక వ్యూహం, మంచి ఆలోచనతో కూడిన కార్యాచరణ ఉన్నాయి.

జి.కిషన్‌ రెడ్డి
– వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలమంత్రి 
(గౌరవ ప్రధాని నరేంద్రమోదీ నేడు నవీకరించిన కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ను జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా)  

మరిన్ని వార్తలు