ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే శరణ్యమా?

11 May, 2021 00:00 IST|Sakshi

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ముఖ్యంగా యుద్ధంలో వినాశకరమైన ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడానికి, వారి అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడానికి, వారి ఆర్థిక వ్యవస్థలను మహా మాంద్యం నుండి కాపాడటానికి ప్రభుత్వ రంగ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు ఉనికిలోకి వచ్చాయి.  భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి సుదీర్ఘకాలం బ్రిటిష్‌ సామ్రాజ్య బానిసత్వంలో ఉండటం, ఆదాయ అసమానతలు,  ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో అసమతుల్యత, పేదరికం,  నిరుద్యోగం,  నిరక్షరాస్యత వంటి తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యలతో  సతమతమవుతోంది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చాలా వెనుకబడి ఉండటం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి విషయాలలో చాలా వెనుకబాటుతనం భారతదేశ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు.

ఈ సమయంలో, ప్రభుత్వ రంగం స్వావలంబన, స్థిరమైన ఆర్థిక వృద్ధికి అభివృద్ధి సాధనంగా భావించారు. అందువల్ల,  దేశం ఒక ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి విధానాన్ని అనుసరించింది, దీనిలో పీఎస్‌యూలకు పెద్ద పాత్ర ఉంది.  ఆర్థికంగా లాభం పొందలేనటువంటి రంగాలలోనూ, వివిధ ప్రాంతాలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి సంతులిత అభివృద్ధే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునాదులను నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. 

క్రమక్రమంగా ప్రజల ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలలో పెరుగుదల కారణంగా, ప్రజల ఆకాంక్షలు కూడా గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ శాతం ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి కేంద్ర బిందువుగా పనిచేశాయి. సంక్షేమ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడంతో సంస్థ లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు చూపించడం జరిగింది. 1990లో అంతర్జాతీయ చెల్లింపుల విషయంలో వచ్చిన లోటు కారణంగా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోరడం జరిగింది. ఆ సంస్థ నిబంధనల ప్రకారం దేశంలో ప్రైవేటీకరణను వేగవంతం చేసి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. సరళీకరణ ప్రభావంతో ప్రభుత్వ రంగ సంస్థలకు దేశీయంగా, అంతర్జాతీయ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సిరావడంతో, అవి ఒత్తిడికి లోనై నష్టాల బారిన పడ్డాయి.

ఇకపోతే 1991 సరళీకృత విధానంతో ప్రజలకు చేరవేసే పథకాల అమలులో కూడా సరికొత్త విధానాలకి గీటురాయి ఏర్పడింది. 2019 ఫారూచ్యన్‌ 500 కంపెనీలలో 7 పీఎస్‌యూలు స్థానం సంపాదించుకున్నప్పటికీ, 70 ఇతర పీఎస్‌యూలు తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏకస్వామ్యం ఉన్న టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, ఓడరేవులు, విమానాశ్రయాలు,  విమానయాన సంస్థలతో సహా అనేక రంగాలను క్రమంగా ప్రైవేటీకరణకు దశలవారీగా తెరిచేశారు. ఇటీవల, రక్షణ వంటి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్‌ పెట్టుబడులు అనుమతించారు. అంతేకాకుండా ఓఎన్‌జీసీ, ఐఓసీ, గెయిల్, ఎన్‌టీపీసీలతో సహా పలు ’మహారత్న’.. ’నవరత్న’ కంపెనీలు ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గడంతో ప్రైవేట్‌ కంపెనీలుగా మారే అవకాశం ఉంది. 

ఇటీవల రాజ్యసభలో మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వీటిలో, 2018–19 ఆర్థిక సంవత్సరంలో నష్టపోతున్న మొదటి మూడు పీఎస్‌యూలలో ప్రభుత్వ క్యారియర్‌ ఎయిర్‌ ఇండియా, టెలికాం కంపెనీలు భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహా నగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎమ్‌టీఎన్‌ఎల్‌), ఉన్నాయని  పేర్కొన్నారు. వీటిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 14,904 కోట్లు కోల్పోయింది; ఎయిర్‌ ఇండియా నష్టాలు రూ. 8,474 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ నష్టాలు రూ. 3,390 కోట్లు ఉన్నట్లుగా కూడా తెలిపారు. భారతదేశంలో, 31 మార్చి 2019 నాటికి 70 ప్రభుత్వ రంగ యూనిట్లు (పీఎస్‌యూ) నష్టాల్లో ఉన్నాయి. వీటి మొత్తం భారం రూ. 31,000 కోట్లకు పైగా ఉంది. ఈ పీఎస్‌యూలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజల సంక్షేమం కోసం ఈ రంగాలను పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్షిప్‌ భాగస్వామ్యంతో పునరుద్ధరించినట్లయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల సంస్థల్లో జవాబుదారీతనాన్ని కూడా తీసుకో వచ్చినట్లయితే ఈ సంస్థలు ఉద్యోగ కల్పనతో పాటు,  దేశ అవసరాలకు సరిపోయే విధంగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి.

డాక్టర్‌ చిట్టేడి కృష్ణారెడ్డి,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

డాక్టర్‌ మారం శ్రీకాంత్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఎన్‌ఐఆర్‌డీ, హైదరాబాద్‌

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు