డెల్టా స్ట్రెయిన్‌ ఎంత ప్రమాదకరమంటే...!

20 Jun, 2021 08:21 IST|Sakshi

సందర్భం

కోవిడ్‌–19 వైరస్‌ని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాల్లో భాగంగా పలు వ్యాక్సిన్ల తయారీకి దేశాలు పరుగెడుతున్న తరుణంలోనే ప్రమాదకరమైన వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్నాయి. భారత్‌లో తొలిసారిగా గుర్తించిన డెల్టా వేరియంట్‌ బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి అధికారులు ఉన్నçపళంగా మిలటరీని ఆసుపత్రులకు పంపించి, జూన్‌ 21న కోవిడ్‌ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని హెచ్చరిం చారు. ఈ సందర్భంగా ఫార్మాసూటికల్‌ పరిశ్రమపై పట్టు ఉన్న ఒపీనియన్‌ కంట్రిబ్యూటర్‌ సామ్‌ ఫజెలి ఈ డెల్టా వేరియంట్‌ తదితర వైరస్‌ రకాలద్వారా ఉత్పన్నమవుతున్న భవిష్యత్‌ ప్రమాదాలను వివరించారు. వాటిని సాక్షి పాఠకుల కోసం సంక్షిప్తంగా అందిస్తున్నాం.

ఇతర వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియెంట్‌ చాలా ఆందోళన కలిగిస్తోంది. సార్స్‌–కోవి–2 డెల్టా వేరియంట్‌కి బి.1.617.2 రకం అని మరో పేరుంది. ఈరోజువరకు బయటపడిన కరోనా వైరస్‌ రకాల్లో ఈ డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా మారడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఇప్పటికే బ్రిటన్‌లో కనుగొన్న అల్ఫా రకంతో పోలిస్తే ఇది 40 శాతం అధిక రేటుతో పరివర్తన చెందుతోంది. వైరస్‌ ఒరిజనల్‌ రకంతో పోలిస్తే ఇది 50 శాతం అధికంగా పరివర్తన చెందుతున్నట్లు కనుగొన్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలో ఒక్క శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులుగా బయటపడగా మే నెల మధ్యనాటికి బ్రిట న్‌లోని మొత్తం కేసుల్లో 70 శాతం డెల్టా వేరియంట్‌ కేసులేనని నిర్ధారించారు. ఇలాగే విస్తరిస్తే జూన్‌ చివరినాటికి ఇది అల్పా వేరియంట్‌ స్థానాన్ని పూర్తిగా ఆక్రమిస్తుందని చెబుతున్నారు. రెండు, ఇది అల్ఫా వైరస్‌ రకం కంటే ప్రమాదకరమైనదని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో చేర్చవలసిన పాజిటివ్‌ కేసుల శాతాన్ని ఈ వైరస్‌ రకం అమాంతంగా పెంచేస్తోంది. పైగా ఈ వైరస్‌ రకం ఇన్ఫెక్షన్లు ప్రధానంగా యువతలో అధికంగా ఏర్పడుతున్నాయి. ఇది మరింత తీవ్రంగా విస్తరిస్తోంది.

డెల్టా వేరియంట్‌.. వ్యాక్సిన్లకు ప్రభావితం అవుతుందా అంటే సమాధానం క్లిష్టమే. ఇంగ్లండ్‌ ప్రజారోగ్య శాఖ చెబుతున్న దానిప్రకారం ఫైజర్, బయోన్‌ టెక్, అస్ట్రాజెనెకా కంపెనీల వ్యాక్సిన్లు తొలి డోస్‌ తీసుకున్నవారికి డెల్టా వేరియంట్‌ నుంచి 30 శాతం రక్షణ మాత్రమే లభించిందని తెలుస్తోంది. అయితే ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నవారిలో 88 శాతం మందికి అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్నవారిలో 60 శాతం మందికి ఈ వైరస్‌ రకం నుంచి రక్షణ లభించిందని తేలింది. ఈ రకమైన రక్షణ అల్పా, బీటా వేరియంట్లలో చాలా తక్కువ. జనాభాలో ఎక్కువమంది వ్యాక్సిన్‌ ఇంకా తీసుకోనప్పుడు, లేదా ఇంతవరకు ఒక డోస్‌ మాత్రమే తీసుకున్నప్పుడు డెల్టా వేరియంట్‌ కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

బ్రిటన్‌లో ఇప్పటికే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి అదుపు తప్పింది. అమెరికాలో, యూరోపియన్‌ యూనియన్‌లోని ఇతర దేశాల్లో ఇది ప్రాథమిక దశలో ఉంది. ఈ వైరస్‌ రకం ఇప్పటికే కనిపించిన దేశాలు దీని నివారణకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వ్యాక్సిన్‌ను వీలైనంత ఎక్కువమందికి అందించడం, అదే సమయంలో పరీక్షలు, జన్యుపరమైన నిఘాను పెంచడాన్ని కూడా రెట్టింపు చేయాలి. మొత్తం జనాభాలో సగంమందికి వ్యాక్సిన్‌ ఇప్పించిన ఇజ్రాయెల్‌ డెల్టా వేరియంట్‌ని కూడా బాగానే అదుపు చేయగలిగింది. అయితే ఇంతవరకు జనాభాలో 42.3 శాతం మందికి టీకా వేయించిన బ్రిటన్‌లో ముందుగానే లాక్‌డౌన్‌ సడలించడం, డెల్టా వేరియంట్‌ వ్యాప్తి కావడంతో కేసులు అధికమవుతున్నాయి. అమెరికాలో కూడా యూకే తరహాలోనే వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతుండటంతో అక్కడా డెల్టా వేరియంట్‌ ప్రమాదం పొంచుకుని ఉంది.

ఇంతవరకు కోవిడ్‌–19 వైరస్‌ బారిన పడకుండా పిల్లలు చాలావరకు తప్పించుకున్నారు. అలాగని వీరికి వైరస్‌తో ఎలాంటి ప్రమాదం లేదని అర్థం కాదు. పెద్దవారికైతే ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి, అది ఇంకా అందనివారికి మందులతో పనిలేని నివారణ పద్ధతులు అంటే మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటివి ఉపయోగంలో ఉంటున్నాయి. వైరస్‌ కాంట్రాక్ట్‌ ప్రమాదం తక్కువగా ఉండి కమ్యూనిటీ కేసులు పరిమితంగా ఉన్నం తవరకు ఇవి పనిచేస్తాయి. అయితే డెల్టా వేరియంట్‌ కానీ, ఇతర వైరస్‌ రకాలు కానీ చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తేలినప్పుడు నష్టం భయం గురించిన మన అంచనాలను పూర్తిగా పునఃపరిశీలించుకోవలిసి ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్‌లో యువతలో చాలామంది ఆసుపత్రుల పాలైన నేపథ్యంలో సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ మనకంటే కాస్త ముందే ఉందని గ్రహించాలి. వ్యాక్సినేషన్‌ని అధికస్థాయికి తీసుకుపోవడం, పరీక్షలను కొనసాగించడం ద్వారా కరోనాపై పోరులో మన చొరవను ద్విగుణీకృతం చేసుకోవాలి.

సామ్‌ ఫజెలి
వ్యాసకర్త సీనియర్‌ ఫార్మాసూటికల్స్‌ విశ్లేషకులు,
బ్లూమ్‌బెర్గ్‌ ఇంటెలిజెన్స్‌ (ఎన్డీటీవీ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు