AP: స్కూల్‌ ఫీజుల చరిత్రలో చారిత్రక ఘట్టం

6 Sep, 2021 14:32 IST|Sakshi

ఫీజుల విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇంతకుముందు కూడా ఫీజులపై పలు విధానాలను గత ప్రభుత్వాలు ప్రకటించాయి. అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఉదాహరణకు ప్రతి విద్యాసంస్థకు ఒక గవర్నింగ్‌ బాడీ ఉండాలి. ఇందులో యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఆ పాఠశాల/కళాశాలకు ఈ కమిటీయే ఫీజులను నిర్ణయించాలి. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అసలు గవర్నింగ్‌ బాడీ అనేది ఉంటుందని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్, డీఈఓ తదితరులతో కూడిన బృందం ఫీజుల నిర్ణయం, వాటి పెంపుదల చేసేలా ఓ విధానం వచ్చింది. అదీ అమలు కాలేదు. దాంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయించుకున్నాయి, పెంచుకున్నాయి. (చదవండి: అట్టడుగు వర్గాలకు అక్షర కాంతులు)

ఇప్పుడు హేతుబద్ధంగా ఫీజులు ఖరారు అవుతాయి. అన్ని పాఠశాలలు, కళాశాలలను ఒకటే గాటన కట్టి వేయడం లేదు. నాణ్యమైన విద్య, మంచి వసతులు అందిస్తున్నవీ ఉన్నాయి. వాటికి తప్పకుండా అందుకు సరిపడా ఫీజు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఫీజులను గట్టిగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో, అంతకు రెట్టింపు తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ ఫీజులు అమలు అవుతున్నాయో లేదో ప్రత్యక్షంగా తెలుసుకునేది  తల్లిదండ్రులే. 

గతాన్ని వదిలేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఎంతో నిబద్ధత ఉంది. ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ వంతు సహకారాన్ని అందిస్తే విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయవచ్చు. ఐఐటీ, మెడిసిన్‌ భ్రమల్లో పడిన తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా బలవంతంగా కార్పొరేట్‌ కళాశాలలో చేర్పిస్తున్నారు. మార్కుల పరుగులో అలసిపోయిన పిల్లల కన్నీళ్లను తల్లిదండ్రులు గుర్తించలేక, వారు అఘాయిత్యానికి పాల్పడ్డాక జీవితమంతా కన్నీళ్లను మోస్తున్నారు. (తెలుగు నేర్చుకో, ఆంగ్లంలో చదువుకో!)

మీరు గమనించారా? ఐఐటీ, మెడిసిన్‌ ర్యాంకులన్నీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌లలో మాత్రమే వస్తాయి. పిల్లల్లో మెరికల్ని గుర్తించడానికి మాత్రమే జిల్లా కేంద్రాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐటీ, మెడిసిన్‌ కోసం 5 నుంచి 10 వేల రూపాయలతో కొనిపించిన ప్రత్యేక మెటీరియల్‌ను చాలా క్యాంపసుల్లో అసలు ఓపెన్‌ చేయరని మీకు తెలుసా? (ఆంధ్రప్రదేశ్‌ విద్యావిధానం దేశానికే ఆదర్శం)

మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు వసూలు చేసి, ఒక పూట తిండి లేదా వసతి సరిగ్గా కల్పించకపోతే  ఎంత బాధపడతారు? మరి లక్షలాది ఫీజులు కట్టి, ఉండటానికి రూమ్‌ సరిగా లేదు, తగినన్ని బాత్రూంలు లేవు, బాత్రూం వెళ్లాల్సి వస్తుందని నీళ్లు తాగడం లేదు, సరైన భోజనం పెట్టడం లేదు అని పిల్లలు ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకుంటున్నారా? మీరు చదవడానికి వచ్చారా, తినడానికి వచ్చారా? అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. రెండేళ్ల పాటు ఆ నరకంలో సర్దుకొమ్మని చెబుతున్నారు. అసలు మీ దృష్టికి తీసుకురాలేని ఎన్నో సమస్యల మధ్య పిల్లలు మానసికంగా కుమిలిపోతూ చదువుకుంటున్నారు. ఉదాహరణకు కాలకృత్యాలకు, స్నానానికి ఐదు నిమిషాలు సమయం ఇస్తారు. ఒకవేళ ఆ గడువు దాటితే బాత్రూం డోర్‌కు వేలాడదీసిన బట్టల్ని బయటనుంచి లాగేస్తారు. ఒక కాలేజీ విజిట్‌లో అమ్మాయిలు కన్నీళ్ళతో చేసిన ఫిర్యాదు ఇది. 

తల్లిదండ్రులను యాజమాన్యాలు హాస్టల్‌ లోపలికి అడుగు పెట్టనీయడం లేదు. పిల్లల్ని వదిలిన మొదటి రోజు, కోర్సు అయిపోయిన చివరి రోజు మాత్రమే హాస్టల్లోకి అనుమతిస్తున్నారు. ఈ దాపరికం ఎందుకని ఏ రోజైనా ప్రశ్నించారా? అడ్మిషన్‌ సమయంలో ఫీజు తగ్గిస్తామని చెప్పి టీసీ తీసుకునే సమయంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రోజూ మా గ్రీవెన్స్‌కు ఎన్నో కాల్స్‌ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా మోసం చేశారని యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారా?

నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రశ్నించండి. ఫీజుకు తగ్గ విద్య, వసతులు కల్పించకపోతే ప్రశ్నించండి. ఓ పది రూపాయల వస్తువులో లోపం కనిపిస్తే దుకాణదారుతో గొడవపడే మనం, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేక పోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. నేటి సమస్త మానవాళి అభివృద్ధి పథానికి మూలం సైన్స్‌. ఆ సైన్స్‌ అభివృద్ధికి మూలం, ప్రశ్న. 

తల్లిదండ్రులుగా మీ గళాన్ని విప్పండి. మీకు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. (మా గ్రీవెన్స్‌ ఫోన్‌ నంబర్‌: 9150381111) ఈ చారిత్రక సందర్భంలో మీరు, మేము, మనందరం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలసికట్టుగా పని చేద్దాం.


- సాంబశివారెడ్డి ఆలూరు 

వ్యాసకర్త సీఈఓ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ 

మరిన్ని వార్తలు