Nethanna Nestham Scheme: నేతన్నలకు భరోసా!

24 Aug, 2022 13:07 IST|Sakshi

చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు పెద్ద పీట వేస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గాల కార్మికులకు బతుకునిస్తూనే, ప్రతి సోమవారం అధికారులంతా నేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చి చేనేతకు చేయూతనిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ వీవర్స్‌ థ్రిప్ట్‌ ఫండ్‌ సేవింగ్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీమ్‌ (టీఎఫ్‌ఎస్‌ఎస్‌)ను 2017లో ప్రవేశపెట్టింది. అలాగే నేత కార్మికులకు పొదుపు పథకాలనూ అమలు చేస్తోంది. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులందరినీ ‘త్రిఫ్ట్‌’ పథకంలో చేర్పించాలని చేనేత జౌళి శాఖ అధికారులను ఆదేశించింది. గతంలో రూ. 12 కోట్లతో ప్రారం భించిన ఈ పథకానికి ఈ ఏడాది రూ. 30 కోట్లు విడుదల చేయించారు.  కార్మికుడిని యజమానిని చేయాలన్న ఉద్దేశంతో ‘వర్కర్‌ టూ ఓనర్‌’ పథ కాన్ని ప్రవేశపెట్టింది. 

బతుకమ్మ చీరల తయారీకి ఇప్పటి వరకు రూ. 2,000 కోట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చింది. చేతి నిండా పని, పనికి తగ్గ వేతనం సంపాదిస్తున్న కార్మికులకు పొదుపు (త్రిప్టు) పథకాన్ని ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నది. లాక్‌డౌన్‌ నేప థ్యంలో పరిశ్రమలు బంద్‌ అయ్యాయి. ఫలితంగా కార్మి కులు ఉపాధి కోల్పోయారు. కార్మికులు జమ చేసిన నగదుతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులు మూడేండ్లకు ఇవ్వాల్సి ఉండగా, రెండేళ్లకే తిరిగి చెల్లించి వారి కుటుం బాలకు చేయూత నిచ్చింది. ఈ పథకం ఈ ఏడాది నుంచి పునః ప్రారంభిస్తున్నందున కార్మికులు చేరేందుకు ఆసక్తి చూపు తున్నారు. 

దేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆగస్టు 7న నుంచి రైతు బీమా తరహాలో ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వార్షిక ప్రీమియం కింద చేనేత, పవర్‌ లూం కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కోసం 50 కోట్లు కేటాయించి... ఇప్పటికే 25 కోట్లు విడుదల చేసింది. (క్లిక్‌: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!)

60 ఏళ్ల లోపు వయసున్న అర్హులైన సుమారు 80 వేల మంది కార్మికులకు ‘నేతన్న బీమా’ పథకం అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కార్యా చరణ మొద లెట్టినారు. ఈ నేపథ్యంలో బీమా కాలంలో లబ్ధిదారులైన... చేనేత, మర మగ్గాల కార్మికులు ప్రమాద వశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగ వైకల్యం కలిగినా...  కుటుంబానికి ఆర్థిక భరోసాగా 10 రోజుల్లో నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఇలా నేతన్నలకు చేయూతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సేవలు అభినందనీయం. ‘ఇంటింటికీ త్రివర్ణ పతాకం’ కార్యక్రమం కోసం 33 లక్షల మీటర్ల నేత వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేయటం నేతన్నలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోంది.

– డాక్టర్‌ సంగని మల్లేశ్వర్
 కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి

మరిన్ని వార్తలు