కాంగ్రెస్‌ను పెంచగలిగే పంచాక్షరి!

29 Nov, 2021 03:14 IST|Sakshi

చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కాబట్టి సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్‌ ఆ విషయాన్ని మరోసారి ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని మౌలిక ప్రశ్నలతో ఎండగట్టాలి. అదే ఆ పార్టీని తిరిగి దేశ ప్రజలకు చేరువ చేస్తుంది. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండా కాంగ్రెస్‌ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగేది కాదని గుర్తించాలి. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) హిందుత్వ అన్న పదం వినపడిన వెంటనే ఇంతెత్తున లేస్తూంటాయి. మరీ ముఖ్యంగా వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ హిందుత్వ పోకడలను దునుమాడిననప్పుడల్లా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కోపతాపాలు మరింత భగ్గుమంటూంటాయి. ఈ పోకడలను బట్టి వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే, స్థిమితంగా ఆలోచించగలిగితే అంత ఆశ్చర్యమేమీ కలగదు.

ఎందుకంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండూ మతం పునాదులపైనే నిర్మింపబడ్డాయి కాబట్టి! నూటా నలభై కోట్ల భారత జనాభాలో 79 శాతం మంది ఉన్న హిందువులు వీరి టార్గెట్‌. ఇతరులు తమకు అణిగిమణిగి ఉండాలన్నదే వీటి రాజకీయ సిద్ధాంతం. లోపభూయిష్ఠమైన, పాత వాసనలున్న విధానం ఇది. కానీ బీజేపీకి ఓట్లూ, నిధుల రూపంలో కోట్లూ రాల్చిందీ ఈ విధానమే అన్నది గుర్తుపెట్టుకోవాలి. 

బలమైన ఆయుధాన్ని అందించిన సల్మాన్‌ ఖుర్షీద్‌
రాజకీయ లాభాలు మోసుకొచ్చిన విధానాన్ని మరింత బలపరుచుకోవాలని భావిస్తున్న తరుణంలో బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ‘సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య – నేషన్‌హుడ్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌’ పేరుతో రాసిన పుస్తకం ద్వారా బలమైన ఆయుధాన్ని, అవకాశాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురణకర్తలు మినహా ఇంకెవరైనా చదివారంటే నేను నమ్మను. కానీ ఇందులోని ఒక్క వాక్యం ‘‘హిందుత్వ అనేది ఐసిస్, బోకోహరాం వంటి వాటితో సరిపోలేది’’ అనేది మాత్రం పెద్ద దుమారమే లేపింది. ఐసిస్‌ తన వద్ద బందీలుగా ఉన్న వారిని చంపి వారి వీడియోలు తీసే నీచానికి పాల్పడే సంస్థ.  

అలాంటి సంస్థలతో హిందుత్వను పోల్చిన సల్మాన్‌ రాతలను నేనూ ఖండిస్తాను. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఖుర్షీద్‌కు ఉందనుకన్నా ఆ పోలిక మాత్రం అసంబద్ధం. ఇంకేముంది... బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నింటినీ ఖుర్షీద్‌ పైకి ఎక్కుపెట్టింది. పుస్తకం అమ్ముకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టించారని నేనైతే అనుకోవడం లేదు. (ఓ ఛానల్‌లో సల్మాన్‌ దీనంగా మన్నించమని కోరిన దృశ్యాలను చూసిన తరువాత వ్యక్తిగతంగానూ నేను లాభాల కోసం చేశారని నమ్మడం లేదు)  ఒకవేళ అదే నిజమైతే చాలా అనైతికమైన విషయం. 

ఒకపక్క ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఇదేమంత మంచి పరిణామం కాదు. సల్మాన్‌ ఖుర్షీద్‌ ఉద్దేశాలు వేరైతే మాత్రం అతడి తప్పుడు అంచనా విస్మయపరుస్తుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ విభాగాన్ని మరింత ఇబ్బంది పెట్టినట్లు అయింది. సల్మాన్‌ రాతలపై ఇప్పటికే కొన్ని పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. భారతీయ న్యాయ వ్యవస్థ ఆయన వ్యాఖ్యల్లోని తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. 
కాంగ్రెస్‌ లేవనెత్తగలిగిన అంశాలు... ఐదు!

ఖుర్షీద్‌ పుస్తకం నేపథ్యంలో చెలరేగిన వివాదాన్ని బీజేపీ పతాక శీర్షికలకు చేర్చడమే కాకుండా కాంగ్రెస్‌ను హిందూ వ్యతిరేకిగా ముద్రవేసే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లోనూ ఈ అంశంతోపాటు... ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ జిన్నాను నెహ్రూతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పోల్చడాన్ని పదే పదే లేవనెత్తి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తుంది. 

ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ మరింత మెరుగైన పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. బీజేపీ హిందుత్వ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టేందుకు మౌలిక ప్రశ్నలను ఎక్కుపెట్టాల్సిన అవసరముంది. సున్నిత అంశమైన హిందూత్వపై తనదైన కథనాలను ప్రచారంలోకి పెట్టిన విషయాలపై ప్రజల అంతఃచేతనను మేలుకొల్పాల్సి ఉంది. ఈ పని చేయాలంటే.. కాంగ్రెస్‌ ఐదు అంశాలను లేవనెత్తవచ్చు. 

1.    రెచ్చగొట్టే పోలికలు చేసేందుకు బదులు సల్మాన్‌ ఖుర్షీద్‌... ∙మోదీ అధికారం చేపట్టిన తరువాత దేశం మొత్తమ్మీద ప్రబలిన మతఛాందస వాదంపై తన విమర్శలు ఎక్కుపెట్టడం మేలు. మరీ ముఖ్యంగా 2015లో యూపీలోని దాద్రిలో ముహమ్మద్‌ అఖ్లాక్‌తో మొదలైన మూక హత్యల గురించి ప్రస్తావించాలి. 
2.    హిందూయిజానికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉంది. సర్వమానవ సౌభ్రాతృత్వం, అందరినీ సమాదరించే అద్భుత లక్షణం హిందూయిజం సొంతం. ‘‘హిందూయిజం అటు సహనానికి, ఇటు వసుధైక కుటుంబం అన్న భావనలకు ప్రతీక’’ అని స్వామి వివేకానంద లాంటివారు ఎప్పుడో విస్పష్టంగా చెప్పారు. దీనికీ ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం బీజేపీ ప్రచారంలోకి తెచ్చిన హిందూత్వకూ ఏమాత్రం పొంతన లేదు. హిందుత్వ పేరుతో బీజేపీ మైనార్టీలు తమ సొంత దేశంలోనే రెండో తరగతి పౌరులుగా భావించే స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ హిందూత్వానికి ఊతమివ్వడం ద్వారా బీజేపీ సెక్యులరిజం అన్న రాజకీయ పద్ధతిని ఉల్లంఘిస్తోంది. సెక్యులరిజం భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమన్నది తెలిసిందే.  
3.    మెనార్టీల హక్కులను కాపాడి తప్పు చేశామన్న భావనను కాంగ్రెస్‌ వదులుకోవాలి. ఎల్‌కే అద్వానీ ‘సూడో సెక్యులర్లు’ అన్న పదాన్ని వాడినప్పుడే ఖండించకుండా కాంగ్రెస్‌ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ తగురీతిలో తిప్పికొట్టలేదు. మెజార్టీ హిందువుల మద్దతు లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించగలిగిందా? ఇప్పటివరకూ 17 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్‌ ఎలా గెలవగలిగింది? కాబట్టే మైనార్టీ రాజకీయం చేస్తోందన్న బీజేపీ ఆరోపణలను వదిలించుకునేందుకు గట్టి ప్రయత్నం జరగాలి. సామాజిక మాధ్యమాలు, ఫేక్‌న్యూస్‌లు, ప్రధాన స్రవంతిలోని ఒక వర్గం మీడియా అధికార పార్టీ పెద్దలను సంతోషంగా ఉంచేందుకు హిందూ – ముస్లిం విభేదాలు కొనసాగేందుకు ప్రయత్నిస్తాయన్న విషయాన్ని కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. 
4.    ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను హిందు ధర్మ సంరక్షకులుగా ఎవరు నియమించారని కాంగ్రెస్‌ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. భారతీయులు ఎవరు దేశభక్తులో, ఎవరో సెక్యులరో నిర్ణయించే అధికారం, సర్టిఫికెట్లు పంచే బాధ్యత బీజేపీకి ఎవరిచ్చారో కూడా కాంగ్రెస్‌ ప్రశ్నించాలి. 
5.    బీజేపీ హిందుత్వ జాతీయభావానికి ప్రతిగా కాంగ్రెస్‌ ‘భారత జాతీయ భావం’ అన్న అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ పాత్రను చెప్పడమే కాకుండా... బీజేపీ పాత్రను ప్రశ్నించే తెగువ చూపించాలి. 

సల్మాన్‌ ఖుర్షీద్‌ తన పుస్తకాన్ని అమ్ముకోగలిగాడో లేదో నాకు తెలియదు కానీ... కాంగ్రెస్‌ తన రాజకీయ సిద్ధాంతాలను మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు వచ్చింది. నిర్లక్ష్యానికి, నిష్క్రియాపరత్వానికి కాలం చెల్లిందని ఆ పార్టీ గుర్తించాలి. చైతన్యవంతమైన సమాజంలో మెజార్టీ వర్గం... సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న మైనార్టీ వర్గాలకు రక్షణగా నిలవాలి. భారతీయ విలువలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి.

సెక్యులరిజం విషయంలో సాధికారత కలిగిన కాంగ్రెస్‌ ఇంకోసారి ఆ విషయాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నెహ్రూకు మించిన స్ఫూర్తి ఇంకోటి ఉండదేమో! ముస్లింలపై భారీ ఎత్తున దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిన ఒకానొక సందర్భంలో నెహ్రూ... ‘‘ఒక్క ముస్లిం వ్యక్తి వెంట్రుకకు హాని చేసినా నేను ఓ యుద్ధ ట్యాంక్‌పంపి... నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను’’ అని వ్యాఖ్యానించినట్లు చెబుతారు. ఆ తరువాత కూడా నెహ్రూకు హిందువులు ఓట్లేయడం మానేయలేదు. భారత్‌లో ప్రస్తుతం ఉన్నది హిందూ–ముస్లిం సమస్య కాదు. మానవత్వానికి సంబంధించినది! – సంజయ్‌ ఝా, కాంగ్రెస్‌పార్టీ మాజీ అధికార ప్రతినిధి    

మరిన్ని వార్తలు