పొలిటికల్‌ తిట్లలో పోషకాలెక్కువ...

26 Nov, 2022 09:12 IST|Sakshi

సారాంశం 

ఇప్పుడు ఓ చందమామ కథ చెప్పుకుందాం,. 
అనగనగా ఓ ఊర్లో ఓ గయ్యాళి గంగమ్మ ఉండేది. ఆమె నోటికి ఊరంతా హడలిపోయేది. ఇంట్లో ఉన్న భర్తను, పిల్లలను నానా తిట్లు తిడుతుండేది. ఆమె ఇంటి ముందు నుంచి ఊరివారెవరైనా వెళ్లడానికే భయపడేవారు. ఆమె తిట్లు అంత ఘాటుగా ఉండేవి. ఆమె నోటికి దడిచి  కొడుకుకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి అతని పరిíస్థితి అర్థం చేసుకుని, ప్రేమించిన  తెలివైన  అమ్మాయి ఓ సాధువును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సాధువు గంగమ్మను మార్చాలని ఆ ఇంటికి  వెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన సాధువు ఆమె నోటితీరుకు, ఆమె తిట్లకు అవాక్కయ్యాడు. కాసింత తేరుకుని.. ఆమె మారదని నిర్ణయించుకుని, కాసింత మంత్ర జలం తీసి..

‘‘ఇక నుంచి ఎప్పడు ఎవరు ఎవరిని తిట్టినా తిట్ల దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. తిట్లు  సమంజసమే అయితే  ఇబ్బంది పెట్టిన వారిని, లేకుంటే అకారణంగా తిట్టిన వారిని తిట్ల దయ్యం ఏడిపిస్తుంది లేదా తినేస్తుంది’’ అని శపించి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణం తిట్లభూతం ప్రత్యక్షమై గంగమ్మ ఇంట్లో వీరంగం వేసింది. గంగమ్మ నోరు మూతపడి... పిల్లల ప్రేమ పెళ్లికి వెళ్లింది... కథ కంచికి వెళ్లింది. 

ఇప్పుడా తిట్ల భూతాలు రాజకీయ నాయకుల  ఇంటివద్ద.. పార్టీ ఆఫీసుల వద్దా తిరుగుతున్నాయట. మొన్న మునుగోడు ఎన్నికల సమయంలో  వీధుల్లో వీరంగం వేసినవి కూడా ఇవేనట! ఈ మధ్య తిండిపై బాగా ధ్యాస పెరిగింది. తినేది ఆర్గానికా, కాదా... క్యాలరీ ఫుడ్డా కాదా... ఇలా తర్జన భర్జనలు బాగా పెరిగాయి. ఏంతింటే మంచిదో డైటీషియన్లను, మంతెన సత్యనారాయణ రాజు లాంటి వారిని అడగడం ఎక్కువ యింది. నిజానికి ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో, శక్తి వస్తుందో మన ప్రధానిని అడిగితే తెలుస్తుంది.

రోజూ రెండుమూడు కేజీల తిట్లు..
‘‘మోదీజీ మీరు అలసిపోరా.. అని ఇటీవల కొంతమంది నన్ను అడిగారు. వారికి నేనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా, రోజూ నేను 2, 3 కేజీల తిట్లు తింటున్నా. అవన్నీ ప్రొటీన్‌గా మారేలా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. మనను తిట్టే తిట్ల గురించి మనం పట్టించుకోవద్దు. కార్యకర్తలు మజా చెయ్యాలి. 20–22 ఏళ్లుగా రాత్రీ పగలు తేడా లేకుండా నన్ను తిడుతూనే ఉన్నారు... వాటిలో చిత్ర విచిత్రమైన తిట్లు ఉన్నాయి. వాటివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ’’ హైదరాబాద్‌లో సభాముఖంగా ప్రధాని చెప్పిన చిట్కా ఇది. అందరూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు పాటించదగ్గది. 

నడక నుంచి పరుగులు..
రాహుల్‌ గాంధీ చలో జోడో యాత్ర అంటూ నడక  మొదలు పెట్టి,  దేశమంతా తిరుగుతూ మన రాష్ట్రంలోకి వచ్చే సరికి ఏకంగా పరుగులు మొదలు పెట్టారు. మిగతా వారంతా ఆయనతో పరుగెత్తలేక అలసిపోయారు. మిగతా పరుగులు మహారాష్ట్రలో చేసుకోండి అంటూ ఆయాస పడి చెతులేత్తేశారట.. అంటే  మోదీ భాషలో  చెప్పాలంటే రాహుల్‌ గాంధీకి  తిట్లు బాగానే వంటబట్టినట్టున్నాయి. తనీ స్థాయికి రావడానికి చిత్రవిచిత్రమైన తిట్లే అంటున్న ప్రధాని మాటలు విన్నారా రాహుల్‌ జీ! తిట్లకు వెరవకండి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన తిట్లు, రకరకాల రుచుల్లో ఉంటాయి. హాయిగా తినండి. మీరు కూడా ఏనాడో ఒకనాడు మోదీ స్థాయికి చేరతారు.

ప్రొటీన్‌ ఫార్ములా...
కొద్ది నెలలుగా  రాష్ట్ర రాజకీయాల్లో వేడి.. అకస్మాత్తుగా బీజేపీలో పోరాటపటిమ పెరిగాయి. దీనికి ఇంత శక్తి రావడానికి టీఆర్‌ఎస్‌ అందునా కేసీఆర్‌  పవర్‌ఫుల్‌ తిట్లే కార ణంగా తోస్తోంది. వీళ్ల తిట్లలో బాగా పోషకాలు ఉన్నట్టున్నాయి. రోజురోజుకూ బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుంటున్నారు. ‘‘ ..పిస్సగాడిద  కొడుకు, రండ మంత్రి, చేవ లేని దద్దమ్మ, బుట్టాచోర్, కిరికిరి గాళ్లు...’’ మోదీ అన్నట్టు ఇట్లాంటి చిత్ర విచిత్ర తిట్లలో ఎన్ని పోషకాలుంటాయి మరి!.. అందుకే బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుని విజృంభించేస్తున్నారు.

ఈ ప్రొటీన్‌ ఫార్ములా అన్ని పార్టీలకు వర్తిస్తుందని బీజేపీ నాయకులు విస్మరించి నోరు జారు తున్నట్టున్నారు. అలా నోరు జారడం వల్ల మొన్న ఓ ఎంపీ ఇంటిముందు తిట్ల భూతాలు ఎలా వీరంగం చేశాయో చూశాం కదా. పైన  మనం చెప్పుకున్న కథలోలాగా తిట్ల భూతాలు తప్పెవరిదైనా వదలవు. తిట్లతో పోషకాలే కాదు. ప్రాబ్లెమ్స్‌ తప్పవన్న మాట. ఇక ఏం పర్లేదు అనుకుని రిలాక్సయిన  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులూ ఒక్కసారిగా  మేల్కోని యాక్టివయ్యింది, బలపడుతోంది, నోరు జాడిస్తోంది... నేషనల్‌ లెవల్‌ ఇంపోర్టెడ్‌ తిట్లనుంచి, లోకల్‌ నేతల నాటు తిట్ల నుంచీ గ్రహించిన పోషకాలతోనేనని బీజేపీ నాయకులు కూడా గుర్తించి జాగ్రత్త పడాలి.

ప్రజల తిట్లు మరింత పవర్‌ఫుల్‌..
ఇప్పడు ముఖ్యమంత్రి, ప్రధానితో సహా, అన్ని కేంద్ర, రాష్ట్ర  మంత్రులు,  నాయకుల నోటి నుంచి వస్తోన్న సేమ్‌ విమర్శ.. ‘ఊరికే నోరు పారేసుకోవడం, తిట్టడం తప్ప, మేం చేస్తున్న డెవలప్‌మెంట్‌ను చూసేదేలేదు...’ అని. నిజమే, రాజకీయ నాయకులు డెవలప్‌మెంట్‌ చూడరు, తిట్లు తిడతారు, తింటారు కానీ, డెవలప్‌మెంట్‌ చూసే సెక్షన్‌ కూడా ఉంది. వాళ్లే కామన్‌పీపుల్‌. ‘‘రోడ్డు వేయించే మొహాల్లేవు కానీ, ఓటు వెయ్యాలట ఓటు! ఐదొందలు, వెయ్యి  చేతుల పెట్టి, సిగ్గు శరం లేదా ఓటడగడానికి. గెలిపియ్యుర్రి డబ్బులు తీసుకుని. మన  బతుకులు నాశనమైతయి..’’ ‘మా గల్లీకి ఏ పార్టోల్లూ ప్రచారానికి రాకండి...మేం ఓట్లేయం. మీకు ఎప్పటికీ బుద్ది అస్తలేదు..’’

ఎలక్షన్‌ టైంలో ఇలాటి తిట్లు వింటుంటాం. ఇవి డెవలప్‌మెంట్‌ చూస్తున్న  జనం.. నాయకులకు కంచాల నిండా పెడుతున్న తిట్లు.. తినలేనంతగా, అరిగించుకోలేనంతగా. ఈ తిట్లకూ పోషక విలువలు ఉంటాయంటారా?... మోదీ భాషలో ఉండవచ్చు కానీ, ప్రజల తిట్లతో బలం రాజకీయ నాయకులకు రాదు ప్రజాస్వామ్యానికి వస్తుంది. పైగా, పైన కథలో..సాధువు క్రియేట్‌ చేసిన తిట్లభూతం... న్యాయం వైపు ఉంటదని, అన్యాయం చేస్తే తింటదని చెప్పుకున్నాం కదా! ... సో తిట్లు జాగ్రత్తగా ఎంచుకొని తినండి.
-సరికొండ చలపతి 

మరిన్ని వార్తలు