సరైన మార్గదర్శనం చేయాలి!

11 May, 2022 12:28 IST|Sakshi
అస్రీన్‌ సుల్తానా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడి బొడ్డున ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు అనే దళిత యువకుని దారుణ హత్య... మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో స్పష్టం చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన అస్రీన్‌ సుల్తానా అనే యువతి, వికారాబాద్‌కు చెందిన నాగరాజు ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీన్ని సహించలేకపోయిన సుల్తానా సోదరుడు, అతడి స్నేహితులు హైదరాబాద్‌లో నాగరాజుపై దాడి చేసి, హత్య చేశారు. 

నాగరాజుపై పదిహేను నిముషాల పాటు వరుసగా రాడ్లతో దాడి చేసారనీ... జనం చూస్తూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదనీ, తాను ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకొచ్చి సాయపడలేదనీ, వాళ్ళను వేడుకొంటూ తాను సమ యాన్ని వృథా చేసాననీ సుల్తానా మీడియా ముందు వాపోయింది.  

గతంలోనే తన సోదరుడు ఈ పెళ్ళి చేసు కోవద్దని తనను బాగా కొట్టాడనీ, ఉరివేసి చంపడానికి ప్రయత్నించాడనీ, తనను ఉరి వేసుకుని చనిపొమ్మని ఆదేశించాడనీ కూడా తెలిపింది. గతంలో రెండుసార్లు తాము పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కలిగించాలనీ విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆమె తెలియజేసింది.

ఇక్కడ అనేక విషయాలు మనల్ని ఆలోచింప జేస్తున్నాయి. మన వ్యవస్థలన్నీ ఇంత నిర్వీర్యం అయిపోయాయా? మనం ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా? వీటిని నిరోధించే అవకాశమే లేదా? మనలో కూడా తెలిసిగానీ తెలియకుండా గానీ ఇలాంటి అమానుషత్వం దాగి ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇంకా ఈ అంశం ఇవ్వాళ ఎన్నో రకాల చర్చలకు, సమాలోచనలకు కేంద్రంగా నిలిచింది. సాధారణంగానే దళిత సంఘాలు ముస్లిం సంఘాల మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలపై హిందూత్వ శక్తులు దాడులు చేసిన ఎన్నో సందర్భాలలో ఆ బాధ తెలిసిన దళితులుగా తాము ముస్లింలకు మద్ధతుగా నిలిచామనీ, ఇప్పుడు ముస్లింల చేతిలో దళిత యువకుడు హత్యకు గురికావడం తట్టు కోలేనిదిగా ఉందనీ అభిప్రాయాలు వచ్చాయి. పలు ముస్లిం సంఘాలు కూడా తమకు దళితులపై గౌరవం ఉందనీ, ఈ హత్యను ఖండిస్తున్నామనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ప్రకటనలు చేశాయి. ఈ హత్యను వ్యక్తిగతంగానే చూడాలనీ, ఇది రాజకీయమైనది కాదనీ కొందర న్నారు. (ఆ హత్యను ఖండిస్తున్నాం)

పైకి ఇది పరువు హత్యగా కనిపిస్తుంది. కానీ దీని వెనక సమాజంలో వేళ్ళూనుకు పోయి ఉన్న మౌఢ్యాల చరిత్ర, కొత్త తరాలకు సరైన విలువలు, ఆదర్శాల్ని ఇవ్వలేకపోతున్న ఆధునికతా వైఫల్యాలు దాగి ఉన్నాయి.

– జి. కళావతి
‘అధ్యాపక జ్వాల’ సహాయ సంపాదకులు

మరిన్ని వార్తలు