Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు

2 May, 2022 14:02 IST|Sakshi
సత్యజిత్‌ రే

‘‘ఏమున్నది సార్‌ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్‌ రే ‘పథేర్‌ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత  కరీంనగర్‌ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం.

భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్‌ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్‌’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 

1921లో మే 2న జన్మించిన సత్యజిత్‌ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్‌గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్‌ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్‌ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు.

సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ్, తారాశంకర్‌ బంధోపాధ్యాయ్, ప్రేమ్‌ చంద్, నరేంద్రనాథ్‌ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!)
   
1956లో ‘పథేర్‌ పాంచాలి’ కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘బెస్ట్‌ హ్యూమన్‌ డాక్యుమెంట్‌’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్‌ జంగా’, ‘చారులత’, ‘తీన్‌ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్‌’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్‌ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ‘లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’, అలాగే ‘ఆస్కార్‌ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. 

భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్‌ రే 1992 ఏప్రిల్‌ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్‌ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్‌’ నినాదకర్త మనోడే!)

– వారాల ఆనంద్‌
(మే 2న సత్యజిత్‌ రే జయంతి)

మరిన్ని వార్తలు