తగని వసతులు లేని చదువులా?

17 Nov, 2022 00:36 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మారతాయని ఆశించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించింది మాత్రం అణగారిన కులాల ప్రజలు. అలాగే విద్యార్థుల పాత్రా మరువ రానిది. అయితే ఉద్యమంలో  కేవలం యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే పాల్గొన్నట్లు చెబుతూ ఇతర విద్యార్థుల పాత్రను ప్రస్తావించరు చాలామంది. తెలంగాణలోని  స్కూల్స్, జూనియర్‌ కాలేజీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారూ సొంత రాష్ట్ర సాధనలో స్వార్థంలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సిద్ధించినా పాఠశాలల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉందని చెప్పడానికే విద్యార్థుల త్యాగాలను ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తున్నది. ఇటీవల కేంద్ర  విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూడీఐఎస్‌ఏ 2021– 22 నివేదిక మన పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్న సంగ తిని వెల్లడించింది. 

తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు కలిపి  సుమారు 43,083 ఉన్నాయి. అందులో మొత్తం 69,15,241 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 3,20,894 ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ లెక్కల వల్ల సగటున ఒక పాఠశాలకు కేవలం 7గురు టీచర్స్‌ మాత్రమే ఉన్నారన్న ఆందోళనకరమైన సంగతి స్పష్టమవుతున్నది. రాష్ట్రంలో కేవలం 31,716 పాఠశాలలకే పిల్లలు ఆటలు ఆడుకునే మైదానాలు ఉన్నాయి. కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ వరల్డ్‌ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.

మన విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్స్‌ విషయానికి వస్తే... కేవలం 33,428 పాఠశాలల్లో మాత్రమే బాలికలకు అత్యవసరమైన టాయిలెట్స్‌ సదుపాయాలు ఉన్నాయి. సుమారు 10 వేల పాఠశాలల్లో కనీసం టాయిలెట్స్‌ లేవు. మగపిల్లలకు కేవలం 29,137 పాఠశాలల్లో  టాయిలెట్స్‌ సదుపాయాలు ఉన్నాయి. తాగునీరు అందుబాటులో లేని పాఠశాలలు 6 వేలకు పైగా ఉన్నాయి.  మొన్నటి వరకు కరోనా వ్యాధి కారణంగా మన పిల్లలు ఆన్‌లైన్‌లో అరకొర విద్యాభ్యాసాన్ని కొన సాగించారు. అయితే అందులో కూసింత ఆర్థికంగా బలంగా ఉన్నవారు మంచి వసతులతోనే చదువుకున్నారు. అయితే ప్రధానంగా నష్ట పోయింది మాత్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను కొనసాగిస్తున్న అణగారిన గ్రామీణ, పట్టణ పేదల పిల్లలే. వీరికి కంప్యూటర్లు, వైఫైవ్‌ లేదా ఇంటర్నెట్‌ వంటివి అందుబాటులో లేకపోవడం వల్లనే నష్టపోయారు.

టాయిలెట్, స్కూల్‌ లైబ్రరీలు, పిల్లలు ఆడే మైదానాలు, సరిపడా టీచర్స్, స్కూల్‌లో ఆన్‌లైన్‌ సదుపాయం, డిజిటల్‌ లైబ్రరీలు, ఇతర సరి పడా నైపుణ్యాలు నేర్పే పరికరాలు లేకుంటే ఏ విధంగా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాగలరు? ప్రత్యామ్నాయ వసతులు లేకపోతే కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన కాలంలో  పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను ఎలా ఉప యోగించుకోగలరు?

ఒక పక్క చిన్న చిన్న ఉప ఎన్ని కల్లోనూ పార్టీలు వందల, వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గెలవడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ... అవే పార్టీలు అధికారంలో ఉన్నా దేశానికి ఎంతో అవసరమైన విద్యకు బడ్జెట్‌ను తగిన మొత్తంలో కేటాయించక పోవడం విషాదం. ఇప్పటికీ వేలాది పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగు దొడ్లు లేవంటే బాలికా విద్య పట్ల మన ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

కనీస మరుగుదొడ్లు లేని పాఠశాలల వల్లే అనేకమంది తల్లి దండ్రులు ఆడపిల్లలను బడులకు పంపించడం లేదనే కఠోర వాస్తవం ప్రభుత్వాలకు తెలియదా? ‘బంగారు తెలంగాణ’, ‘వెండి తెలంగాణ’ అనే కబుర్లు మాని... తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఆరు వేల ప్రభుత్వ పాఠశాలల్లో  కనీసం తాగడానికి ఇప్పటికీ మంచి నీటి వసతి లేదంటే పిల్లలు ఎలా చదువుకోవాలి? మౌలిక సదుపాయాల కల్పన జరిగినప్పుడే స్వరాష్ట్రం కొరకు విద్యార్థులు చేసిన త్యాగాలకు ఫలితం దక్కేలా చేసినట్లు అవుతుంది.

అశోక్‌ ధనావత్‌, వ్యాసకర్త ఎం.ఏ. డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ విద్యార్థి
ది హేగ్, నెదర్లాండ్స్‌ 

మరిన్ని వార్తలు