యూపీలో బీజేపీ విజయ రహస్యం

18 Mar, 2022 13:49 IST|Sakshi

దేశ ప్రజల్లో ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక పంజాబ్‌ రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ 117 సీట్లకు 92 సీట్లు సాధించి, దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించాలనుకున్న సోకాల్డ్‌ సెక్యులర్‌ పార్టీలు చతికిల పడ్డాయి. బీజేపీ కూటమి 403 సీట్లకుగానూ 273 సీట్లు సాధించడం ఆషామాషీ విషయం కాదు. 

అఖిలేష్‌ యాదవ్‌ పన్నిన యాదవులు ప్లస్‌ ముస్లింలు ప్లస్‌ జాట్లు వ్యూహం వికటించింది. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో జాట్‌ తెగ హిందువులు నరేంద్ర మోదీపై గుర్రుగా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణ విషయంలో బీజేపీ వైపు నిలబడాలని దృఢ నిశ్చయానికి వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక జాట్లు, కొంతమంది ముస్లింలు బీజేపీ వైపు నిలబడడానికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలేనని చెప్పాలి. పైగా సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో యోగి దృఢనిశ్చయంతో ఉంటాడని 54 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 

సమాజ్‌వాదీ ముస్లింల పార్టీ కాదు. అయినప్పటికీ దాదాపు 80 శాతం ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేశారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ పార్టీ చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం అభ్యర్థులను నిలిపి, హిందూ సమాజంలోని యాదవులను చీల్చి ముస్లిం అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయోగం బాగా వర్కౌట్‌ అయింది. అందుకే ఆ పార్టీ తరఫున 31 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ముస్లిం ఓటు బీఎస్పీకి, కాంగ్రెస్‌ పార్టీకి, ఎంఐఎం పార్టీలకు చీలి పోకుండా ముస్లిం మత పెద్దలు చేసిన ప్రయత్నాలు కొంత సఫలమైనట్లే.

మొత్తం మీద యూపీలో ప్రజలు యోగీ చేసిన సుపరిపాలనకు, ఆయన అందించిన శాంతి భద్రతలకు ఓటేశారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. (క్లిక్‌: ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం)

– ఉల్లి బాల రంగయ్య
రాజకీయ, సామాజిక విశ్లేషకులు 

మరిన్ని వార్తలు