బైడెన్‌ గెలుస్తాడు, కానీ ట్రంపిజం ఓడినట్టా?

8 Nov, 2020 01:06 IST|Sakshi

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైనట్టే. కానీ అంతకంటేముందు పోటాపోటీ రాష్ట్రాలైన జార్జియా, ఆరిజోనా, పెన్సిల్వేనియాల్లో నిరసనలు, వ్యాజ్యాలు, తిరిగి లెక్కింపులతో కూడిన సుదీర్ఘ, గందరగోళ, తీవ్రమైన నాటకాన్ని మాత్రం ఆయన ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ అమెరికా ఎన్నికల చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లు ఆయన  గెలుచుకున్నాడు. కాబట్టి ఆయన అత్యున్నత గౌరవానికి పూర్తి అర్హుడు. కాకపోతే ఒక అమర్యాదకర పరాజితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఒక విషపూరిత పాత్రను ఆయన వచ్చే ఏడాది జనవరి 20న వారసత్వంగా అందుకోవాల్సి ఉంటుంది. రెండుగా చీలిపోయిన, ద్వేషంతో నిండిపోయిన, అపనమ్మకాలతో నిలబడిన సమాజాన్ని ఆయన ముందుండి నడపాల్సి ఉంటుంది. పదకొండు  విశ్వవిద్యాలయాలకు చెందిన సామాజిక శాస్త్రవేత్తలు ఎదుటి పక్షం మీద విషం చిమ్మే ఈ ధోరణి సమాజానికి తీవ్ర హానికరమని ప్రతిష్టాత్మక సైన్స్‌ పత్రికలో రాశారు. 

సులభంగా విభేదాలు రెచ్చగొట్టగలిగే అంశాలతో ఎదుటి పక్షం వారిని రాక్షసులుగా చిత్రిస్తూ, తమ పక్షం వారి అభిప్రాయాలను బలపరుస్తూ పెరిగిన  భావోద్వేగ గుర్తింపు రాజకీయాలు– అంతటా సర్వోన్నతంగా ఉండాలనుకునే శ్వేతజాతీయులను ఒకవైపు, వలస జీవులు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, ఇతర తెగల మనుషులు, లైంగిక పరమైన మైనారిటీలను మరోవైపు నిలిచేట్టు చేసి, అమెరికా నేల మీద వ్యాప్తిలో ఉన్న ఎరుపు, తెలుపు, నీలం జాతుల గాథ ప్రకారం అమెరికాను మరోసారి చీలేట్టు చేసింది.  ఇక ఇప్పుడు అమెరికా స్పష్టంగా ఉదారవాదులు, సంప్రదాయవాదులుగా, అమెరికాను తిరిగి గొప్పగా చేయాలనేవాళ్ళు, అలా చేయడం అంటే శ్వేతజాతిని సర్వోన్నతం చేయడం అని అర్థం చేసుకునేవాళ్ళుగా, నగరవాసులు, గ్రామీణులుగా, ధని కులు పేదలుగా విభజించబడి ఉంది. ఇరుపక్షాలు ఎదుటివారిని నిందించే, ఒకరి ఓటమి ఇంకొకరి గెలుపుగా మారిపోయే ఈ ఆటలో ఓటమి అనేది కలలో కూడా ఊహించలేనిది, దాని పరిణామాలు ఉనికికి సంబంధించినవి. అందుకే తాను బైడెన్‌ చేతిలో ఓడిపోతే అమెరికాను వదిలిపెట్టడమేనని ట్రంప్‌ అంటాడు. కానీ ఆయన అలాంటి పని చేయడని మనకు తెలుసు. కాకపోతే తన ఓటమి ద్వారా తన ఊహాత్మక రియాల్టీ షోకు తాను మరింత స్టార్‌ అని అనిపించుకుంటాడు. 

కానీ ఇప్పటికే ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదని బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా కోరాడు. కానీ ట్రంప్‌ మాత్రం ఇంకా లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉండగానే తాను గెలిచానని చెప్పుకోవడం, ఆయన మద్దతుదారులు లెక్కింపు కేంద్రాలను స్తంభింపచేయడంతో మునిగిపోయి బైడెన్‌  మాటలను ఎవరూ చెవికి ఎక్కించుకోలేదు. 2016లో హిల్లరీ క్లింటన్‌ కచ్చితంగా గెలుస్తుందని అంచనాలు ఉన్న సమయంలో ట్రంప్‌ గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. దాన్ని బలహీన ప్రత్యర్థి ఉండటంతో ఏదో తప్పిదారి జరిగిన విషయంగా అమెరికా వ్యవస్థ దులిపేసుకుంది. కానీ అధికారం చేపట్టి తన వ్యాఖ్యలు, నిర్ణయాలతో ట్రంప్‌ అమెరికా ఎలా ఉంటుంది అనుకుంటామో అలా ఉండకుండా అంతర్జాతీయ పరిశీలకులను నివ్వెరపోయేలా,  ఒక ఇబ్బందిగా దులిపేసుకునేలా చేశాడు. కొంతమంది అభివర్ణిస్తున్నట్టుగా ట్రంపిజం అనేది ఒక అధివాస్తవిక విరామం కాదని ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ప్రాంతీయవాద, రక్షణాత్మక, జాతి వివక్షపూరిత, స్త్రీద్వేషంతో కూడిన నేటి అమెరికాకు ఇవి ప్రతిబింబం. విదేశీయులుగా మనం కలిసే అవకాశం ఉన్న అమెరికన్లు దీన్ని ప్రజాకర్షక, అహేతుక ఎత్తుగా కొట్టిపారేయవచ్చు. కానీ సుమారు సగం మంది అమెరికన్లు ట్రంప్‌లో తమను తాము చూసుకుంటున్నారు.

బైడెన్‌ గెలుపు ద్వారా అమెరికా జీవితం పునఃప్రతిష్టితమవుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అలా ఏం జరగదు. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైఫల్యం, తెల్లవారుజామున మూడు గంటలకు అహేతుకమైన ట్వీట్లు చేయడం, తన ఆత్మస్తుతి ధోరణి– ఇవన్నీ ఉన్నప్పటికీ అమెరికన్లు ట్రంపిజంను తిరస్కరించలేదు. కాబట్టి విశ్లేషకుల అభిప్రాయం తప్పు. ట్రంప్‌ 50 శాతం ఓట్లు సాధించారు. ఈసారి బైడెన్‌ అధ్యక్షుడిగా గెలిచినా, డొనాల్డ్‌ ట్రంప్‌ దేనికోసం నిలబడ్డాడో అది ఎటూ పోదు. ఇప్పుడు అమెరికాలో చూస్తున్నదే ఇండియాలో కనబడుతోంది. పూర్తి భిన్నమైన, రాజకీయ ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పటికీ భారత్‌ కూడా సుమారు అమెరికా మాదిరిగానే దాదాపు అవే కారణాలతో చీలిపోయి ఉంది. పాలకులు రాజ్యాం గపరమైన పౌర జాతీయవాదం నుంచి తప్పుకొని హిందీ, హిందూ, హిందుస్థాన్‌ బాట పట్టి మతపరమైన జాతీయవాదాన్ని నెలకొల్పడానికి యత్నిస్తున్నారు.

అమెరికాలో జాతి, గుర్తింపు అనేవి రాజకీయ పెట్టుబడిగా మారిపోయినట్టుగానే మతం, కులం అనేవి భారత బహుళ ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ద్వేషపూరిత మెదళ్లను అతిగా మేపుతూ వారి అభిప్రాయాలను మరింత బలపరుస్తున్నాయి. చపలచిత్తం, తక్షణ ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలతో ఇరు దేశాల ప్రభుత్వాలు తడబడినట్టు అయ్యింది. పెద్దనోట్ల రద్దు, నిరుద్యోగం, కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో నిర్వహణ వైఫల్యం ఇక్కడ, తాలిబాన్లకు  లొంగిపోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమించడం, కరోనాను ఎదుర్కోవడంలో నిర్వహణ వైఫల్యం అక్కడ దీనికి ఉదాహరణలు.

ఇరు దేశాలు ప్రపంచ యవనిక మీద ఒక నైతిక ఉన్నతిని ప్రతిష్టించుకుని ఉన్నాయి. మహాత్మాగాంధీ అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం వల్ల మనమూ, అవకాశాల పుట్టినిల్లు, ప్రజాస్వామ్య మానవ హక్కుల ఛాంపియన్లుగా వాళ్లూ ప్రపంచ దేశాల దృష్టిలో ఈ ఉన్నతిని అనుభవిస్తున్నాయి.  కానీ ఇరు దేశాల్లోనూ విషపూరిత దేశీయ రాజకీయాల వల్ల ఈ నైతిక ఉన్నతికి తీవ్రంగా దెబ్బ పడింది. 2020 ఎన్నికల్లో అమెరికా దీని నుంచి గాయపడి అయినా బయటపడనుంది. అలాంటి ధోరణులే వ్యాపిస్తున్న ఇండియాకు మాత్రం ఇది ఒక హెచ్చరిక.
– శశి థరూర్, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా