ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే! 

19 Nov, 2021 01:04 IST|Sakshi

స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఒక సంక్లిష్టమైన, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన దేశ వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టారు. విదేశీ వ్యవహారాలు, దౌత్యాల విషయంలోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు.

సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, ఛాందసవాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకున్నారు. ఆ స్ఫూర్తిని చివరిదాకా కొనసాగించారు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచంలో భారత వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే! ఈ వారసత్వాన్ని స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొందించుకోవడం ఈ తరానికే కాదు... భవిష్యత్‌ తరాలకూ చాలా అవసరం.  

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 132వ జయంతిని ఈ నెల 14న ‘పాటించాం’.  ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే నెహ్రూ జయంతి ఉత్సవాలేవీ జరగలేదు. ఈ దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్‌ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ పుణ్యమే. ఈ వారసత్వాన్ని సదా స్మరించుకోవడం, స్ఫూర్తిని పెంపొం దించుకోవడం ఈ తరానికే కాదు.. భవిష్యత్తు తరాలకు కూడా చాలా అవసరం. నెహ్రూ నాయకత్వంలో లోపాలు లేవా? కచ్చితంగా ఉన్నాయి. ఆ లోటుపాట్ల తాలూకూ పరిణామాలు చాలాకాలంపాటు పీడించాయి కూడా.

కశ్మీర్‌ అంశాన్ని నెహ్రూ సక్రమంగా చేపట్టలేదని, 1962 చైనా చొరబాట్లలోనూ ఆయన వైఫల్యం ఉందని నేను తప్పు పట్టగలను. అయితే ఈ అంశాలన్నింటినీ హ్రస్వదృష్టితో చూడటం కంటే.. ఆ కాలపు సమయం, సందర్భం, పరిస్థితి వంటి అన్ని అంశాలనూ విశ్లేషించి మరీ చూడటం ముఖ్యం. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశం ఎంతటి విచిత్ర పరిస్థితుల్లో ఉండిందో మనం అర్థం చేసుకోలేం.

మత ప్రాతిపదికన దేశ విభజన, ఆ తరువాత చెలరేగిన అమానవీయ ఘర్షణలు, కొత్తగా గీసుకున్న సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో ప్రజల రాకపోకలు... 500 రాజాస్థానాలను ఒక్క ఛత్రం కిందకు తేవాల్సిన అవసరం.. వెరసి గందరగోళం! ఇదంతా సమసిపోతోందని అనుకునేలోపే జమ్మూ కశ్మీర్‌ వైపు నుంచి పాకిస్తాన్‌తో యుద్ధం ఒకటి ముంచుకొచ్చింది. ఆ తరువాతైనా పరిస్థితులు చక్కబడ్డాయా? అంటే సైద్ధాంతిక విభేదాలున్న రెండు ప్రబల శక్తుల మధ్య రణం అణు ముప్పు ఛాయల్లో కొనసాగుతూనే వచ్చింది. 

తిరుగులేని దార్శనికుడు...
ఈ సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్య్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు. నెహ్రూది జాతీయవాది మాత్రమే కాదు.. అంతర్జాతీయవాది, మానవతావాది కూడా. తన సమకాలీనులందరికంటే ఎంతో ముందుచూపు, విషయ అవగాహన ఆయన సొంతం. అణ్వస్త్ర ప్రమాదం సరిహద్దులను అప్రస్తుతంగా మార్చగలదన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. దేశాంతర, ఖండాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలే మేలని, దేశాల మధ్య బహుముఖ సహకారం అవసరమనీ నెహ్రూ ఎప్పుడో గుర్తించారు. 
అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్‌ వరల్డ్‌’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. దేశ, ప్రాంత సరిహద్దులను దాటిపోయి మరీ వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ అంతర్జాతీయ స్థాయి పాలనకు ప్రత్యామ్నాయం లేదని ఆయన వాదించేవారు. టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నెహ్రూ ఆలోచనలు ఎంతైనా ఆచరణ సాధ్యమైనవనడంలో సందేహం లేదు.

దేశాన్ని ఆధునికీకరణ బాట పట్టించడంలో నెహ్రూదే ప్రధాన పాత్ర. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు. అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు , శాస్త్ర పరిశోధనల నెట్‌ వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే. అయితే ప్రాథమిక, సెకండరీ విద్యా వ్యవస్థల్లో లోటుపాట్ల ఫలితంగా ఆధునికీకరణ వైపు మన ప్రయాణానికి ప్రతిబంధకంగా మారాయి.

అసలైన భారతీయుడు
నెహ్రూను ఎక్కువ ఆంగ్లేయుడు, తక్కువ భారతీయుడు అనుకుం టారు. అయినప్పటికీ ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’... భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం  పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. కళలు, హస్తకళల్లో భారతదేశ ఘనమైన వారసత్వం... వాటికి సంబంధించి జనాల్లో ఉన్న సౌందర్య సున్నితత్వం ఆయన్ని ముగ్ధుడిని చేయడంతో వాటి పునరుద్ధరణకు కృషి చేశారు.

భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. అదే సమయంలో జాతీయ ఐక్యత కోణంలో విభిన్న అస్తిత్వాల మధ్య ఉండాల్సిన సయోధ్య అవసరాన్ని గుర్తించారు. అందువల్లే భారతీయులు ఆదరించే విభిన్న అస్తిత్వాలను భారత రాజ్యాంగం అణిచివేయాలని చూడదు. కానీ వాటిని ప్రతి వ్యక్తికీ హక్కులు, స్వేచ్ఛ ఉండేలా భాగస్వామ్యపూరిత, సమాన పౌరసత్వంలోకి అధిగమించమని కోరుతుంది. మతపరమైన ఆచారాలు, అలవాట్లతో సంబంధాన్ని ప్రభుత్వం ఉంచుకోకూడదనే లౌకికవాద భావనకు ఇది పునాది వంటిది.

బహుళ సాంస్కృతిక, బహుళ మత ప్రాతిపదిక కలిగిన దేశం లౌకిక రాజ్యంగా తప్ప మరేవిధంగానూ ఉండదు. సమాన పౌరసత్వ సూత్రాన్ని ఎత్తిపట్టాలంటే ఇది తప్పనిసరి. సమాజ ఉపరితలంలో పాతుకుపోయి ఉన్న ఒంటెద్దుపోకడలు, మతోన్మాదుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించడంలో లౌకికవాదం ప్రాధాన్యాన్ని నెహ్రూ అర్థం చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని కలిగి వుంటూనే ఆచరించారు. లౌకిక విధానం నుంచి రాజ్యం వేరుపడితే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో మనం చూస్తూ ఉన్నాం.

హిందూ–ముస్లిం విభజనపై జాతీయ ఐక్యతను సాధించలేం. భారతీయ గతం నుంచి ఈ గుణపాఠాన్ని మర్చిపోవడం ప్రమాదహేతువు. నెహ్రూ ఒక ఆధునిక నేత. కానీ భారతీయ నాగరికతా వారసత్వంతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. తన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా రచనలో తన ప్రియమైన దేశం గురించి ఘనంగా ప్రశంసించారు. అదే సమయంలో దాని నాగరికతా గుణాలపట్ల చక్కటి అవగాహనను కూడా ప్రదర్శించారు. 

‘‘భారతదేశం తన దారిద్య్రం, అథఃపతనాలతోపాటు, మహోన్నత గుణాన్ని కలిగి ఉంది. ప్రాచీన సంప్రదాయాలకు, విపత్కర స్థితికి సంబంధించిన అధిక బరువును మోస్తూనే భారత మాత నేత్రాలు అలిసిపోయి కనబడుతున్నాయి. కణం కణంగా పోగు చేసుకున్న తన రక్తమాంసాలతో, వినూత్న ఆలోచనలతో, అద్భుతమైన స్వప్నాలతో, దివ్యమైన ఆనురక్తులతో ఒక నిసర్గసౌందర్యంతో భారత్‌ అలరారుతోంది. బయటా లోపలా దాడులతో భారత మాత శరీరం చీలికలైపోయినప్పటికీ, దాని మహోన్నతమైన ఆత్మిక సౌందర్యాన్ని మనం చూడవచ్చు.

యుగాలుగా దేశం ప్రయాణం సాగించి ఆ మార్గంలో ఎంతో విజ్ఞానాన్ని పోగు చేసుకున్న క్రమంలో ఎంతోమంది విదేశీయులను ఆహ్వానించి తన పెద్ద కుటుంబంలో కలుపుకుంది. ఈ క్రమంలో అనేక ఉజ్వలమైన క్షణాలను, మహా పతనానికి కూడా సాక్షీభూతమై నిలిచింది. అనేక అవమానాలకు గురైంది. అంతులేని విషాదాల బారినపడింది. తన సుదీర్ఘ ప్రయాణంలో మర్చిపోలేని సంస్కృతిని అంటిపెట్టుకుంటూనే, దాన్నుంచి శక్తిని కూడగట్టుకుని ఇతర భూభాగాలతో పంచుకుంది కూడా.’’

భారతదేశ ఆత్మను నిజంగా అర్థం చేసుకుని, తన జీవిత పర్యంతం దానికి సేవ చేస్తూ వచ్చిన మరో భారతీయ నేత నా ఆలోచనల్లో కూడా లేడు. ఈ రోజు మనం చూస్తున్న అల్పబుద్ధుల, నీచమైన దురభిమానం కాకుండా... ప్రజల నిజమైన జాతీయవాదాన్ని తీర్చిదిద్దిన భారతీయ విస్తృతాత్మ ఇది మాత్రమే.
– శ్యామ్‌ శరణ్, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధికార ప్రతినిధి 
 

మరిన్ని వార్తలు