అంతా ఆత్మస్తుతి... పరనింద!

31 Oct, 2022 15:14 IST|Sakshi

‘గొంగట్లో కూర్చుని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవాలనుకునే’వారిలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్‌ నాయకుల వైఖరి ఉందని పలువురు సామాన్యులు భావిస్తున్నారు. ఎందుకంటే తప్పులన్నీ తాము చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టడాన్ని రాజకీయ పరిశీలకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ అధినాయకులు పదే పదే కేంద్రాన్ని విమర్శిస్తూ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనీ, నిధులు ఇవ్వడం లేదనీ అబద్ధాలాడడం ఎంత వరకు సమంజసం? 

కేంద్రమే నిధులివ్వక పోతే రాష్ట్రంలో ఇన్ని జాతీయ రహదారులు ఎలా రూపుదిద్దుకునేవి? గ్రామ పంచాయతీలలో వివిధ అభివృద్ధి పనులకు ఫైనాన్స్‌ కమిషన్ల పేరుతో వస్తున్నవి కేంద్రం నిధులే. వీటితోనే గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కట్టించి నిధులు మళ్లించడం మీ తప్పిదం కాదా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆలోచించి డబుల్‌ బెడ్‌రూమ్‌ల పేరుతో డాంబికాలకు పోకుండా ఉండి ఉంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాలలాగా లక్షలాది కుటుంబాలకు కేంద్రం నిధులతో సొంతింటి కల నెరవేరేది కాదా? మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన’ నిధులు కేంద్రానివి. 

ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రాష్ట్ర నిధులతో జరుగుతున్న పనులేవీ అనే సందేహం రాకమానదు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షా రూ. 20 వేలకోట్ల ప్రజాధనాన్ని నీటిపాలు చేయడం మీ తప్పు కాదా? హైదరాబాద్‌ మెట్రోతోపాటు స్కైవేలు, ఫ్లైఓవర్లు, రింగ్‌ రోడ్లు అంటూ టీఆర్‌ఎస్‌వారు గొప్పగా చెప్పుకుంటున్న వాటి అభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్నవి కేంద్రం నిధులు కావా? రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలకు అనుమతులు రాకపోవడానికి కారణం కేంద్ర నిబంధనల ప్రకారం మీరు ప్రతిపాదనలు పంపక పోవడమే కదా! 

మునుగోడు ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఈ మధ్య చేనేత కార్మికులపై కపట ప్రేమ ఒలకబోస్తూ జీఎస్టీపై మంత్రి కేటీఆర్‌ ప్రధానికి లేఖ రాయడం ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రతి జీఎస్టీ మండలి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొంటున్న ప్రతినిధులు అప్పుడే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? జీఎస్టీ మండలిలో రాష్ట్రాలన్నీ కలిసి ప్రతి నిర్ణయం తీసుకుంటాయి కదా! మరి కేంద్రంపై నిందలు వేయడం ఏంటి? పై పెచ్చు జీఎస్టీ మండలి చేనేత కార్మికుల విషయంలో పన్ను పరిధిని రూ. 40 లక్షలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 20 లక్షలకు మించితే పన్ను వసూలు చేస్తూ ప్రధానికి లేఖ రాయడం ‘మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం’ లాంటిది కాదా? కేంద్రం నుంచి ప్రతి నెలా చేనేత కార్మికులకు 5 కిలోల ఉచిత రేషన్‌ బియ్యం అందుతున్నాయి. గతంలో నూలుపై ఉన్న 10 శాతం సబ్సిడీని మోదీ ప్రభుత్వం 15 శాతానికి పెంచింది. నేత కార్మికులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్లస్టర్‌ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండా అడ్డుపడుతోంది. కేంద్రానికి పేరు వస్తుందనా? దేశంలోనే తొలి చేనేత బజార్‌ స్థలం కబ్జాకు గురికాగా ఆ సమస్య పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. 

కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్‌ పథకాన్ని నిలిపివేసి నిరుపేదల నుంచి కిలో రూపాయి చొప్పున వసూలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? ఉచిత రేషన్‌ విషయంలో కేంద్రం ఇస్తున్న సబ్సిడీ ఒక్కో కిలోకి రూ. 28కి పైగా ఉంది. మరి ప్రభుత్వం వాటా ఎంత? ‘మాతా శిశు సంక్షేమ పథకం’ పేరుతో కేంద్రం నిధులిస్తే దానికి కేసీఆర్‌ కిట్‌ అంటూ ప్రచారం చేసుకోవడం మీ తప్పిదం కాదా? (క్లిక్ చేయండి: మతతత్త్వం కాదు... సామరస్యం కావాలి)

నోరెత్తితే కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతుందని అంటున్నారు. మరి పక్కనే ఉన్న కర్ణాటకలో మన కంటే 10 నుంచి 15 రూపాయలు తక్కువకు పెట్రోల్, డీజిల్‌ ఎలా లభిస్తుంది? మీకు పేదలపైన అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా విధిస్తున్న పన్నులు తగ్గిస్తే సరిపోతుంది. కానీ మీరలా చేయట్లేదు. దేశంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తుంటే అవినీతి మరకలు అంటించేందుకు విఫలయత్నం చేశారు. కేసీఆర్‌ కుటుంబంపై, పార్టీపై అవినీతి ఆరోపణలు వస్తే కేంద్ర విచారణ సంస్థలు నిజాలు నిగ్గుతేల్చే పనిచేస్తే కక్ష సాధింపు చర్యలని కేంద్రాన్నే బదనామ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనామ్‌ చేయడం ఆపి తమపై ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే చర్యలు తీసుకుంటే మంచిది. (క్లిక్ చేయండి: దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక)


- శ్యామ్‌ సుందర్‌ వరయోగి    
సీనియర్‌ జర్నలిస్ట్, బీజేపీ రాష్ట్ర నాయకులు

మరిన్ని వార్తలు