సామాజిక సమతూకానికే పెద్దపీట!

16 Apr, 2022 15:47 IST|Sakshi

ఏ ప్రభుత్వాధినేతకైనా మంత్రివర్గ కూర్పు, విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అనేది కత్తిమీద సాము వంటిది. ఎంతోమంది ఆశావహులు, అర్హులమని భావించేవారు మంత్రిపదవి అనే పల్లకీ ఒక్కసారైనా ఎక్కాలని ఆశించడం సహజం. కానీ, ముఖ్యమంత్రికి మాత్రం ఎన్నో అవరోధాలూ, పరిమితులూ ఉంటాయి. అర్హులని తెలిసీ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. సామాజిక వర్గ  ప్రాధాన్యతలు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని సహచరులను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇటీవల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీక రించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఇరవై ఐదుకు మించరాదు. కానీ ఆశావహులు అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. జగన్‌ ఎన్నుకున్న మంత్రి వర్గంలో బడుగు బలహీన వర్గాల వారికి సింహభాగం పదవులు దక్కాయి. సామజిక న్యాయం, సమతూకం పాటించడంలో జగన్‌ విజయులు అయ్యారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 70 శాతం పదవులు బలహీన వర్గాలవారికి దక్కడం స్వతంత్రం వచ్చాక ఇదే ప్రథమం! 

ఇక మంత్రివర్గ ప్రమాణస్వీకారం అయ్యాక అసంతృప్తులు బయటపడటం సహజమే. వైసీపీ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిది. వైసీపీ అన్నా, జగన్‌మోహన్‌ రెడ్డి అన్నా అడుగడుగునా విషం కక్కే పచ్చ మీడియాకు ఈ అసంతృప్తుల అలజడి విందుభోజనం లాంటిది. ఇలాంటి సంఘటనలేమీ మొదటి సారిగా జరగడం లేదు. అన్ని పార్టీల విషయంలో చాలాసార్లు జరిగినవే.

కానీ, జగన్‌ మీద బురద చల్లడానికీ, పార్టీ నాయకులను రెచ్చగొట్టడానికీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే పచ్చమీడియా ఇలాంటి సంఘటనలు చూసి పండుగ చేసుకుంటోంది. ఏ పార్టీ అయినా కష్టపడే నాయకులను గుర్తిస్తుంది. వారికి న్యాయం చెయ్యాలనే ప్రయత్నిస్తుంది. కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మందితో జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ బలం నూటా ఎనభై. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మంత్రి అయ్యారన్న మాట. ఈ మంత్రివర్గాన్ని చూసి అందరూ హేళన చేశారు. అలాంటి సంద ర్భంలో కూడా కొందరు తమకు పదవులు రాలేదని అలిగారు. 

అసంతృప్త నాయకులను బుజ్జగించడానికీ, సముదాయించడానికీ అధిష్ఠానం ప్రయత్నాలు చేయడమూ సహజమే. మొన్న మంత్రిపదవులు రాని వారిని బుజ్జగించడానికి సీఎం జగన్‌ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. అలకలు పూనిన వారిని సముదాయించారు. దాంతో రెండు రోజుల్లోనే అసంతృప్తి చల్లారింది. అయితే ఎల్లో మీడియా మాత్రం పార్టీ మీద జగన్‌కు పట్టు లేదనీ, తిరుగుబాటు తప్పదనీ ప్రచారం చేసింది. పనిలో పనిగా చంద్రబాబు కూడా మంత్రిపదవులు రాని వారికి గేలం వేస్తున్నారని వార్తలు వినిపించాయి.  (క్లిక్‌: ‘సోషల్‌ ల్యాబ్‌’ పని మొదలైంది)

ఎవరైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేని రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. అధినేత నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ప్రజల అభీష్టాన్ని, తమ నాయకుడికి జనంలో ఉన్న విశ్వాస్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యర్థులకు ఫలహారం కాకుండా పార్టీలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. అవకాశాలు ఇవాళ కాకపొతే రేపు వస్తాయి. (క్లిక్‌: సామాజిక న్యాయంలో ఓ విప్లవం!)
    

- ఇలపావులూరి మురళీ మోహనరావు
సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు