వాళ్ళిక చూడాల్సింది కిందికి కాదు... పైకి!

14 Mar, 2023 17:52 IST|Sakshi

క్రమంగా గడచిన నాలుగేళ్లలో మన రాష్ట్రంలో– ‘ఫీల్‌ గుడ్‌’ వాతావరణం కనిపిస్తున్నది. అందుకు కారణం–  రాజ్యము – ప్రజల మధ్య ఏర్పడిన దట్టమైన– ‘ఎకో సిస్టం’ అని నా ఫిబ్రవరి 11 వ్యాసంలో రాశాను. అయితే, ఎంతో విస్తృతమైన లోతైన విషయమది, దాన్ని అంత క్లుప్తంగా చెబితే చాలదు, అందుకు కొన్ని ఉదాహరణలు చెబితే అప్పుడు మరింత స్పష్టత దొరుకుతుంది.

రాష్ట్రంలో పిల్లల భద్రత గురించి ఫిబ్రవరి 22న ఓ వార్త ‘ది హిందూ’  ఆంగ్ల పత్రికలో వచ్చింది. పోలీస్, కార్మికశాఖ, విద్య, ఆరోగ్య శాఖలు, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు వారం రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించిన దాడుల్లో 5–15 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న 285 మంది పిల్లల్ని గుర్తించారు. వీరిలో 45 మంది ఇప్పటివరకు బడి ముఖం చూడలేదు! వీళ్లంతా విషాదకర స్థితిలో ఇక్కడ ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, మెకానిక్‌ షెడ్లలో బాలకార్మికులుగా పని చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అంతా అని చూసినప్పుడు– ఛత్తీస్‌ గఢ్, ఒడిశా, తెలంగాణ, అస్సాం, పశ్చిమ  బెంగాల్‌ నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలించబడ్డారు. ఇలా బాలల శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యాలకు స్థానికంగా బాలకార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల, బయట నుంచి వారిని దిగుమతి చేసుకుంటున్నారు. మరి వారు ఇక్కడ ఎందుకు అందుబాటులో లేరు అంటే... ఇక్కడ ఆ వయస్సు పిల్లలు బడుల్లో ఉంటున్నారు గనుక. 

అంగన్‌వాడీ వయస్సు తర్వాత, ‘అమ్మఒడి’ నుంచి ‘విదేశీ విద్యాదీవెన’ వరకు పుట్టిన బిడ్డ విషయంలో ఇక్కడి విద్యా వైద్య శాఖలు పూర్తిగా వారి బాధ్యతలు తీసుకుంటున్నాయి. దిగువ వర్గాల కాలనీల్లో నేరాలు తగ్గి పిల్లలు–స్త్రీలు క్షేమంగా ఉండడాన్ని– ‘ఫీల్‌ గుడ్‌’ కాలంగానే చూడాలి.

ఈ ప్రభుత్వానిది అంతా సంక్షేమంపై ‘ఫోకస్‌’ అనే మాట ఉన్నప్పటికీ, అదేమంత ‘స్మూద్‌’గా ఈ ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చేట్టుగా కూడా సాగడం లేదు. ఇప్పటికీ ఇంకా అసంతృప్తులకు కొదవలేదు! ప్రభుత్వ ప్రాధాన్యతలైన విద్య,  వైద్యం పట్ల ఎగువ మధ్యతరగతి వర్గాలకు వారి అభ్యంతరాలు వారి కున్నాయి. పోనీ వాళ్ళను వదిలిపెట్టి, ప్రయోజనాలు అందు కొంటున్న వారి సంగతి ఏమిటి? అని చూసినప్పుడు... అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఆకాంక్షల వర్గాల (యాస్పై రింగ్‌ సెక్షన్స్‌) అవసరాలకు ‘ఫుల్‌ స్టాప్‌’ అంటూ ఉండదు. ఉండాలి, అనుకోవడమూ కుదరదు. అయితే, ‘అభివృద్ధి’ ఏదీ? అంటూ ‘సంక్షేమాన్ని’ విమర్శిస్తున్నవారి దృష్టిలో పడకుండా తప్పించుకునేవీ ఉంటాయి. ఉదాహరణకు గత ప్రభుత్వంలో పెండింగ్‌ ఉన్న పారిశ్రామిక రాయితీలు రూ. 962 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఈ నాలుగేళ్లలో రూ. 1,715 కోట్లు పారి శ్రామిక రాయితీలూ, రూ. 1,114 కోట్లు విద్యుత్‌ రాయితీలూ ఈ ప్రభుత్వం సంపన్న పారిశ్రామిక వర్గాలకు చెల్లించింది.

అయితే, ఇవేవీ ‘పబ్లిసిటీ’ ఉండే అంశాలు కాదు. కనుక గత ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కరణల కాలంలో జీవన ప్రమాణాలు పెరిగి, కొత్తగా ఎగువ మధ్యతరగతి  స్థాయికి చేరిన వారు... ప్రభుత్వం నుంచి కిందికి పేదలకు ఏమి  వెళుతున్నాయి అని కాకుండా,  ఉద్యోగులుగా ఉన్న తమ పిల్లల్ని– మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) ల్లో ‘ఆంట్ర ప్రెన్యూర్లు’గా చూడ్డం అవసరం. అప్పుడు ఈ కొత్త సామాజిక వర్గాల నుంచి పదిమందికి ఉపాధి కల్పించే– ‘ఎంప్లాయర్స్‌’ తయారవుతారు. వర్ధమాన వర్గాల్లో ఇటువంటి ‘షిఫ్ట్‌’ జరిగి నప్పుడు, సంప్రదాయ – ‘పవర్‌ పాలిటిక్స్‌’ నుంచి వారు ‘ఫంక్షనల్‌ పాలిటిక్స్‌’లో ప్రవేశించి అక్కడ బలపడి విస్తరిస్తున్న కొత్త మార్కెట్లో విజేతలు అవుతారు.  ఎందుకీమాట అనడం
అంటే, ఈ రోజున ప్రభుత్వం వద్ద 48 వేల ఎకరాల భూమి పారిశ్రామిక అవసరాలకు చౌక ధరలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. అనుమతులు 12 రోజుల్లో ఇస్తున్నారు, కొత్తగా వస్తున్న పాలసీలో 21 రోజుల్లో భూమి కేటాయింపు చేస్తారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,706 కోట్లు రాయితీలుగా ఇచ్చింది.

‘సంక్షేమం’  పేరుతో చేస్తున్న వ్యయం గురించి ఇటీవల ఐఐటీ ఢిల్లీ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ జేజే థామస్‌– ‘ఇండియా నీడ్స్‌ బడ్జెట్‌ ఫర్‌ ఇట్స్‌ యంగ్‌’ శీర్షికతో ఒక ప్రముఖ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘తమ కుటుంబ జీవన ప్రమాణాలు పెరగడానికి పిల్లల విద్య కొత్త మార్గాలను తెరుస్తుందని మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ వారిని చదివిస్తున్నారు. అటువంటప్పుడు, తన యువత విద్య కోసం ఒక దేశం అప్పు చేయడం మరింత మంచిది కదా?’అంటారాయన. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత నాలుగు ఏళ్లుగా ఇక్కడ చేస్తున్నది అదే.  


-జాన్‌సన్‌ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు