ఒక్క భాషకు పెత్తనమా?

21 Apr, 2022 11:37 IST|Sakshi

దేశంలో హిందీకి పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా 1970 లలో పెద్ద ఉద్యమమే సాగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మళ్లీ తెరపైకి తేవడంతో వాతా వరణం వేడెక్కింది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని వాడాలని అమిత్‌ షా చేసిన ప్రతిపాదనపై సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా కనిపించింది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలలో హిందీని అనుసంధాన లేదా ‘అధికార భాష’గా అంగీకరించడానికి ప్రజలు సానుకూలంగా లేరు. 

డీఎంకే అధినేత దివంగత కరుణానిధి నాయకత్వంలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఉద్యమ ప్రభావం సమసి పోలేదు. నేటి అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌పై శ్రద్ధ వహించాలన్న ఆకాంక్ష తల్లిదండ్రులలోనూ వ్యక్తమవుతోంది. ఉన్నతస్థాయి చదువులు చదివినా తగిన ఉద్యోగాలు స్వదేశంలో లభించడం లేదని భావిస్తున్న యువత విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లిష్‌ అంతర్జాతీయ అనుసంధాన భాషగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాఠశాల స్థాయి నుండే ఇంగ్లిష్‌ బోధించాలనీ, తద్వారా అణగారిన తరగతుల ప్రజలకూ, యువతకూ ఉద్యోగావకాశాలు పెరుగు తాయనీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. 

గతంలో ‘త్రిభాషా సూత్రా’న్ని ప్రవేశపెట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ త్రిభాషా సూత్రంపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దేశ వ్యాప్తంగా 57 శాతం మంది హిందీని మొదటి భాషగా చదువు తున్నారు. బహుశా ఈ కారణం వల్లనే హిందీని అను సంధాన భాషను చేయాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చి ఉండవచ్చు. భిన్న సంస్కృతులూ, భాషలూ, జీవన విధానాలూ విలసిల్లుతున్న మన దేశంలోని చాలా ప్రాంతాల్లో హిందీ పట్ల వ్యతిరేకత ఉంది. కేంద్రమంత్రి హిందీని ప్రతిపాదించిన తర్వాతనే గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సైన్‌ బోర్డులన్నింటినీ గుజరాత్‌ భాషలో రాయాలని నిర్ణయించింది. అలాగే ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో 15 వేల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధనా భాషగా ఉంటుందని యోగి ప్రభుత్వం ప్రకటించిన విషయమూ గమనార్హం. ఇంగ్లిష్‌కు చైనా, తదితర దేశాలు కూడా ప్రాధాన్యమివ్వడాన్నీ గమనించవచ్చు. ఇంగ్లిష్‌ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయి. ఫలితంగా ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వృద్ధి జరుగుతుంది. (క్లిక్‌: ఆలస్యమే! అయినా అభిలషణీయమే!)

అయితే మాతృభాషలను నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషలను వదిలేస్తే ఆయా భాషలు అంతరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక భాషలు అంతరించాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హిందీని బలవంతంగా అమలు చేయాలని భావిస్తే హిందీ మాట్లాడేవారు, హిందీ మాతృభాష కాని వారి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు వ్యతిరేకించే విధానాలను అమలు చేయకపోవడమే మంచిది. (క్లిక్‌: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది)

– టి. సమత, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు