మానవీయ సమాజం కోసమే... ‘ఆద్యకళ’

1 Aug, 2021 00:28 IST|Sakshi

కళ నేటి మనిషికి విశ్రాంతే కాదు, నిన్నటి మానవుడి చరిత్ర కూడా. చరిత్ర పట్ల ఆసక్తిలేని భారతీయులకు కళల చరిత్ర గురించి ఆసక్తి లేకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ, భిన్న సమాజాలు సహజీవనం చేసే దేశంలో సమతను సాధించా లంటే భిన్నత్వాన్ని కాపాడుకోవాలి. ఆధిపత్య వర్గాల వెలి వేతకు, పీడనకు గురవుతున్న బాధిత సమూహాల సాంస్కృతిక జీవనం చరిత్ర పొడవునా ధ్వంసమైంది. రాజాస్థానాలను ఆశ్రయించి, మతం నీడలో బతికిన కళలకు నేటికీ అదే ఆదరణ దక్కుతోంది. కానీ, ఉత్పత్తి కులాల కళలు కొన్ని శతాబ్దాలు బతికి బట్టకట్టినా ఇక బతికే పరిస్థితులు లేవు. 

ఉత్పత్తిలో భాగమైన మనిషి పనిముట్లను ఎట్లా సృష్టిం చాడో అట్లనే ఉత్పత్తి సంబంధాల్లోని ప్రేమానురాగాల్ని చాటు కోవడానికి అనురాగాల పల్లవి అల్లుకున్నాడు. ఆ పల్లవికి రాగాలు పలికే నాదాలు తయారు చేసిండు. పాటతోపాటే ఆటలోకీ అడుగుపెట్టిన మనిషి తాళగతులను నేర్చాడు. చరిత్రలో మానవ సమూహాలు ఎన్ని దారులగుండా నడిచొ చ్చాయో అన్ని వాద్యాలను మోసుకుంటూ ఇక్కడికి వచ్చాయి. ఆ తాళగతులు మనిషి ఆత్మను ప్రతిబింబిస్తే, ఆ కాలపు సమూహాల చరిత్రను వాద్యాలు గుర్తుచేస్తాయి. విశ్వకర్మలు వెయ్యేళ్ల కిందనే ‘రుంజ’ను గఢగఢ మోగించినట్లు సాహిత్య చరిత్ర చెబుతోంది. నాయకపోడు ఆదివాసీల ‘మూగడోలు’, బైండ్లవారు వాయించే ‘జమిడిక’, రాజన్నలు వాయించే ‘చామల్లాలి’, డమడమ మోగే మాదిగ ‘డప్పు’, ఆఫ్రికానుంచి వలసొచ్చిన సిద్దీల ‘మర్ఫా’, కోయల డోలు, చెంచుల ‘జేగంటలు’, గొత్తికోయ మహిళల ‘గుజ్జిడి మొగ్గలు’ సంగీ తంలోని వైవిధ్యాన్నే కాదు, సామాజిక కూర్పులోని వైవిధ్యాన్ని ఎరుకజేస్తాయి.

ఈ కళలు మానవ సమాజ వికాసాన్ని చెప్పే పాఠాలు. జానపదుల కళలు అంతరించడమంటే మనిషి అంత రించిపోవడమే. దేవర కొలుపు, పెండ్లి, చావు, సమావేశం డప్పు మోగకుండా మొదలుకాలేదు. యుద్ధబేరీలు మోగించిన చరిత్ర సంగీతానిది. ఉత్పత్తి సంబంధాలు బలహీనపడిన ప్పుడు మానవ సంబంధాలు యాంత్రికమయ్యాయి. ఆ యాంత్రికతలో ఆటపాటలు తగ్గిపోయాయి. సంగీత వాయి ద్యాల అవసరమూ పోయింది. రాజాస్థానాలకు చేరి జావళీలు పాడిన కళలు ఎట్లా బతికాయో ఇప్పుడు సబ్బండ కులాల కళలు కూడా సాంస్కృతిక సారథుల పోషణలో బతుకు తున్నాయి. కానీ, అవి ఉత్పత్తి సంబంధాల్లోని ఆర్తిని వదిలేసి, పాటల పల్లకీలో ప్రభువుల్ని మోస్తున్నాయి. 

చరిత్రను కూడా ఒక పావుగా వాడుకునే చాతుర్యం ఉన్న పాలకుల పాలనలో ఉన్నాం. కాకతీయుల్ని కమ్మవారిలో కలిపే యమని కోరిన పాలకుడికి లొంగని పండితుడు వాస్తవ చరిత్రను నిలబెట్టినట్టే, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించే వారంతా జానపదుల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ‘‘నెత్తురుమండే, శక్తులు నిండే యువకుల్లారా రారండి’ అన్న పిలుపులు పోయి, మార్కుల కోసం, ర్యాంకుల కోసం వ్యక్తిత్వాలను త్యాగం చేయమంటోంది. మనం చూసున్న నేరాలన్నీ యాంత్రిక జీవనం, మార్కెట్‌ మనస్త త్వాలు పెంచిన సంకుచిత భావాల ఫలితమే.  కాలాన్ని బట్టి బతుకుదెరువుని వెదుక్కునే సంచారుల బతుకు దారితప్పింది. ఆ కళలను కాపాడ లేకున్నా వాటి చరిత్రనైనా కాపాడుకుందాం. 

పంట లాభాలు ఇవ్వకపోయినా, మరో పంటకు విత్తనాలు పండితే మళ్లీ ఎవుసం చేయాలంటాడు రైతు. ఉత్పత్తి కులాల కళాకారులను తయారు చేయకున్నా విత్తనాల్లాంటి ఆ కళల వాయిద్యాలు పరిరక్షించుకుందామని ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు అంటున్నాడు. రేపటి సేద్యం కోసం జయధీర్‌ జానపదుల వాయిద్యాలను విత్తనాల్లా పదిలం చేసిండు. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆయన సేకరిం చిన కళాఖండాలన్నిటినీ హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రదర్శనకు ఉంచింది. మన తాతలు రాగాలు పలికించిన ఊదు వాద్యాలు, కొలుపులో మోగిన డప్పులు, పెళ్లిలో పలికిన సన్నాయిలు... ఎన్నెన్నో ఇందులో కొలువుదీర్చారు.

సంగీతంతోపాటే వికసిం చిన లిపిని కూడా ఆయన పదిలం చేసే ప్రయత్నం చేసిండు. తొలి శతాబ్దాల నుంచి ఆధునిక కాలం వరకు లిపి పరిణా మాన్ని చెప్పే ఎముకలు, తోలు, తాళప్రతులు, వస్త్రాలు, దస్తావేజులను సేకరించిండు. నలభై ఏళ్లపాటు భద్రపరిచిన ఆ చారిత్రక భాండాగారాన్ని చూద్దాం రమ్మని ‘ఆద్యకళ’ ప్రదర్శ నకు ఆహ్వానిస్తున్నారు. నేడు (1 ఆగస్టు 2021న ఉదయం 11 గంటలకు) ప్రారంభమవుతున్న ఈ ప్రదర్శన కళలకు దూర మైన తరాన్ని మేల్కొలిపి, రేపటికి కొత్తదారులు వేస్తుందని ఆశిద్దాం. పదండి, జయధీర్‌ చెప్పే ప్రాచీన మానవుడి ‘తొవ్వ ముచ్చట్లు’ వింటూ కొత్తదారిలోకి నడుద్దాం. 

– నాగవర్ధన్‌ రాయల
జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు