ఒక సంకల్పం పుట్టిన రోజు

17 Feb, 2022 08:01 IST|Sakshi

సందర్భం

పధ్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహింసా మార్గంలో పోరాడిన కేసీఆర్‌ను జనం అక్కున చేర్చుకుని ముఖ్యమంత్రిని చేశారు. అహరహం తెలం గాణ అభివృద్ధి కోసం ఆయన సీఎంగా శ్రమిస్తూ ఉన్నారు. జనగామ సభలో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. మనందరం కలిసి పోరాడిన ఉద్యమ గెలుపు కథలను జనం మధ్యకు వెళ్లి విప్పారబోస్తున్నారు. ఆయన ఒక్క పిలుపునిస్తే అందరి ఇళ్లపై పోరు జెండాలు ఎగిరాయి. ఆయన ఒక్క నినాదమిస్తే ఆ«ధిపత్యం వణికిపోయింది. చెప్పిన మాటమీదనే, తాను పట్టిన పంతం మీదనే చివరిదాకా నిలిచాడు.

తను పోరాడుతూ లక్ష్య సాధనవెంట నడిచే లక్షలాది యోధుల్ని నడిపించుకుంటూ ప్రపంచీకరణ కాలంలో అస్తిత్వ ఉద్యమాలకు పురుడు పోసి అస్తిత్వ ఉద్యమ పొద్దుపొడుపు అయ్యాడు కేసీఆర్‌. స్వరాష్ట్ర ఉద్యమాల అస్తిత్వ జెండా పట్టిన వాళ్లకు, రేపు జరుగ బోయే అస్తిత్వ సంఘర్షణల ఉద్యమాలకు మార్గ దర్శిగా నిలిచాడు. రాష్ట్రం సాధించాక తిరిగి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే పాలనా పగ్గాలు పట్టి ఈ మట్టిని ఒంటికి రాసుకుని వినమ్రంగా తెలంగాణ మళ్లకు నీళ్లు పడుతున్న రైతుకూలీ కేసీఆర్‌. పురుగుల మందులు తాగి పానాలు భూమితల్లి ఒడిలోనే వదులుతున్న వేలమంది పత్తిరైతుల మరణాలను చూసి దుఃఖించి, ఆ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు కాళేశ్వరం ప్రాజెక్టునే కట్టి, మహానదినే తన రెండు చేతులతో ఎత్తి పోస్తు న్నాడు. తెలంగాణ హరితవిప్లవానికి ఒక కొత్త దారి చూపిన వ్యవసాయ పంచాంగం అతడు. తెలంగాణ వచ్చాక కూడా పత్తిచేలో పచ్చ పురుగులుంటాయని ఆయనకు తెలుసు. పంటను కాపాడటానికి ఆయన పచ్చపురుగుల్ని ఏరేస్తున్నాడు. ఈనేల అభివృద్ధికి ఈ పంటల చీడలేకుండా చేయటానికి మళ్లీ పరిశోధక విద్యార్థి అయి తపిస్తున్నాడు.

చదవండి: (దేశానికి నూతన దిశ కేసీఆర్‌)

 ‘పల్లెప్రగతి’తో పల్లెలు ఎంత పరిమళిస్తున్నాయో ఊరూరా తిరిగి చూస్తూ పసిపిల్లగానిలా పరవ శిస్తున్నాడు. ‘పట్టణప్రగతి’తో నగరాల ముఖ చిత్రా లను మార్చుతూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఏ ఊరు చూసినా పచ్చగా ఉండాలే, ఏ టౌన్‌ కెళ్లినా సోబరుగా ఉండాలే. ప్రతి ఒక్కరీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలే. మన బడి బాగుపడాలే. బస్తీ దవాఖానాలు పేదలకు వైద్యం అందించాలే. చదువులు బాగుపడాలే. అందరి బతుకులు బాగు పడాలే...  ఇదే అతడి తపన. అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు. నర్సాపూర్‌ అడవుల్లోకి పోయి మొక్కలు నాటి పర్యావరణానికి కాపలాదారునిగా కాపలా కాస్తున్నాడు. ఇంతగా ఈ నేల కోసం కృషి చేసిన అతడి కాలంలో ఉన్నాం. ఇపుడు తెలంగాణ 33 జిల్లాల సమాహారం. పాలన గడప గడపల దాకా పోవటానికి ఎంతో కృషిచేస్తున్నాడు.

‘పుట్టినరోజు పండుగే అందరికీ. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అని ఒక తెలుగు సినీ కవి ప్రశ్నించాడు. ఇవాళ కేసీఆర్‌ పుట్టినరోజు. ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకు బాగా తెలుసు. లేకపోతే కొన్ని దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎందరో అసువులు బాసినా... ఫలితం దక్కని ఉద్యమాన్ని మళ్లీ భుజానికెత్తుకుని రాష్ట్రాన్ని సాధించేవాడా! తన కలకు మెరుగులు అద్ది ఒక మహా స్వప్నంగా మార్చి తెలంగాణ ప్రజల కళ్ళ ఎదుట ఆవిష్కరించిన ధన్యుడు. 

‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నా స్వప్నం’’ ఇదే ఇదే నా జెండా, ఎజెండా... అంటూ ఒక సుదీర్ఘ ఉద్యమ యాత్ర చేశాడు కేసీఆర్‌. ఇందుకోసమే ఎన్నో బాధలు పడ్డాడు. కష్టాలను ఎదుర్కొన్నాడు. అధికా రాలు, పదవులు గడ్డిపోచతో సమానమని అనేకసార్లు నిరూపించాడు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి లక్ష్యాన్ని సాధించాడు. ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మా ణంలో అలుపెరగక పోరాడుతున్నాడు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు!


జూలూరి గౌరీశంకర్‌ 
వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌

మరిన్ని వార్తలు