అద్భుత ఆవిష్కరణకు ఘన గౌరవం

16 Nov, 2022 00:24 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతుల మీదుగా ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం’ అందుకుంటున్న ‘శాంతా బయోటెక్‌’ వరప్రసాద్‌ రెడ్డి

కరోనా మహమ్మారి కల్లోల కాలంలో ప్రపంచమంతా టీకాల కోసం ఎదురుచూపులు చూసింది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో దేశాలకు టీకాల సరఫరాదారుగా భారత్‌ నిలిచింది. అయితే, పాతికేళ్ల క్రితమే దేశ టీకాల చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించింది శాంతా బయోటెక్‌ సంస్థ. సంకల్ప బలంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హెపటైటిస్‌–బి టీకాను ఆవిష్కరించింది. అది కూడా చవకగా అందజేసింది. దాన్ని సుసాధ్యం చేసింది... ఆ సంస్థ వ్యవస్థాపకులు, దీర్ఘదర్శి, రేపటితో 75వ వసంతంలోకి అడుగిడుతున్న ‘పద్మభూషణ్‌’ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి. ఈ నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... దేశ ప్రగతిలో భాగస్వాములైన ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారం’ ఆయనకు అందించింది. 

నేడు దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపు కొంటోంది. పాతికేళ్ళ క్రితం స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ఆ శుభవేళల్లో దేశ బయోటెక్‌ రంగంలో సువర్ణాక్షరాలుగా లిఖించిన తొలి అధ్యాయం పురుడు పోసుకుంది. తొట్ట తొలిగా పూర్తి స్వదేశీ వ్యాక్సిన్‌ రూపకల్పన జరిగిన శుభ సంరంభం అది! సుమారు 30 ఏళ్ళ క్రితం దేశంలో హెప టైటిస్‌–బి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారిగా ప్రపంచాన్ని వణికిస్తోంది. జెనీవాలో జరుగుతున్న ఒక సమావేశానికి శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌ రెడ్డి హాజరయ్యారు. ఒక ప్రసంగకర్త మన దేశ సామర్థ్యంపై, మన ప్రభుత్వాల ఉదాసీనతపై, మనవారి ప్రతిభపై లోకువగా మాట్లాడారు. మనల్ని బిచ్చగాళ్ళ కింద జమకట్టారు. ఆ నిందను నిర్మూల్యం చేస్తూ అనేక దేశాలకు వ్యాక్సిన్లు పంపే మహోన్నత స్థితికి చేరుకున్నాం. హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌ స్ఫూర్తితో శాంతా బయోటెక్నిక్స్‌ 13 రకాల ఇతర అద్భుతమైన వ్యాక్సి న్లను సృష్టించే స్థాయికి చేరుకుంది. 

లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ధరలో పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సిన్‌ను అందించాలన్నది శాంతా బయోటెక్నిక్స్‌ పెట్టుకున్న నియమం. దానిని సాధించడం ఆషామాషీ కాదు. విదేశాల నుంచి సాంకేతికతను దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారం. వరప్రసాద్‌రెడ్డి నాన్నగారు కొంత పొలం అమ్మి యిచ్చిన డబ్బుకు తోడు, బంధు వులు, ఆత్మబంధువులు మరి కొంత ఇచ్చారు. అయినా అది సరిపోదు. అదిగో! అప్పుడే యూసఫ్‌ బిన్‌ అలావీ అబ్దుల్లా రూపంలో  అమృత హస్తం చేయి చాచింది. అది మాజీ ప్రధాని పీవీ నర సింహారావు చలువ. వరప్రసాద్‌ రెడ్డి పడుతున్న కష్టాలను గమనించిన పీవీ ఈ అబ్దుల్లాను పంపారు. అబ్దుల్లా ఒమన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి. హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌ అవసరం తెలిసిన వ్యక్తి. తాను పెట్టుబడి పెట్టి, వ్యక్తిగత స్థాయిలో గ్యారంటీగా ఉంటూ బ్యాంక్‌ రుణాలు తెచ్చి, ఆ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. 

నిర్మాణం చేపట్టే నాటికి సుశిక్షుతులైన శాస్త్ర వేత్తలు లేరు. నిపుణుత, సమర్థత, నిబద్ధత కలిగిన గొప్ప బృందాన్ని సమీకరించుకొని రంగంలోకి దిగింది. అనుమతులకు, అమ్మకాలకు, పంపకాలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. వ్యాక్సిన్‌ సామర్థ్యంపై విదేశీ కంపెనీ దుష్ప్రచారం చేసింది. సత్‌ సంకల్పం కాబట్టి కాలమేఘాలు తొలిగి పోయాయి. శాంతా బయోటెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హెపటైటిస్‌ ఎంతో భయంకరమైన వ్యాధి. వేగంగా  మనుషులను నిర్వీర్యులను చేస్తుంది. లివర్‌ సిరోసిస్‌ వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంత మందిని శవాలుగా మార్చింది, కొంతమందిని జీవ చ్ఛవాలు చేసింది. అందుకే అర్జెంటుగా వ్యాక్సిన్లు తయారు చేసి పుట్టిన ప్రతిబిడ్డకూ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోషించింది. అత్యవసరమే అయినప్పటికీ నాణ్యత, సమర్థతపై అన్ని పరీక్షలూ జరిగి తీరాల్సిందేనన్నది శాంతా సంస్థ పట్టుదల. అన్ని పరీక్షల్లో గెలిచి, నూటికి నూరు శాతం సంపూ ర్ణమైన అర్హత సంపాయించుకున్న తర్వాతే వ్యాక్సి న్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అలా వరప్రసాద్‌ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

ఈ ప్రయాణంలో, శాంతా సంస్థ అడుగడు గునా మానవత్వాన్ని చాటుకుంది. అది భారత్‌ నుంచి లాహోర్‌కు సుహృద్భావ యాత్రగా బస్సు వేసే చారిత్రక సందర్భం. ఆ బస్సు కంటే హెప టైటిస్‌ వ్యాక్సిన్లే మాకు ముఖ్యమని పాకిస్తాన్‌ వేడు కుంది. ఆ సందర్భంలో ప్రధానమంత్రి కార్యా లయం శాంతా బయోటెక్నిక్స్‌ను సంప్రదించింది. మానవీయ కోణంతో మిలియన్‌ వ్యాక్సిన్లను శాంతా సంస్థ ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా పాకి స్తాన్‌కు ఉచితంగా అందించి మానవత్వాన్ని చాటు కుంది. భారతీయ ఖ్యాతిని, ఆత్మను నిలబెట్టింది. యునిసెఫ్‌ విషయంలోనూ ఎంతో ఉదారాన్ని చూపించింది. యితఃపూర్వం ఒక్కొక్క వ్యాక్సిన్‌ 18 డాలర్లకు కొనుగోలు చేసే యునిసెఫ్‌కు కేవలం 23 సెంట్లకే అందజేసింది. ‘శాంతా’ చూపిన ఈ విత రణశీలత వల్ల యునిసెఫ్‌ ప్రపంచంలోని ఎన్నో పేద దేశాలకు ఉచితంగా హెపటైటిస్‌ వ్యాక్సిన్లు అందించి పుణ్యం మూట గట్టుకుంది. 
శాంతా బయోటెక్నిక్స్‌ వేసిన తొలి అడుగు అతి పెద్దది, అతి గొప్పది. అతి తక్కువ ధరకే వ్యాకిన్‌ అందించిన ప్రభావంతో మార్కెట్‌లో వ్యాక్సిన్‌ ధరలు 40వ వంతుకు పడిపోయాయి. అనేక బహుళజాతి సంస్థలు శాంతా సంస్థవైపు చూడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత బయోటెక్‌ రంగంలో ఎన్నో కంపెనీలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికి స్ఫూర్తిగా నిలిచి తొలి గవాక్షం తెరిచింది మాత్రం శాంతా బయోటెక్నిక్స్‌ అన్నది మరువ రానిది.

- మాశర్మ, వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, కాలమిస్ట్‌

జీవితం దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని, ఆ జీవన సాఫల్యాన్ని తృప్తిగా ఆస్వాదిస్తూ, తోటివారికి తోడు పడుతూ జీవిత పరీక్షలో కృతార్థులమయ్యా మని చెప్పగల ఆత్మవిశ్వాస సంపన్నులు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తులలో ఒకరు తెలుగుతేజం డాక్టర్‌ కోడూరి ఈశ్వర వరప్రసాద్‌ రెడ్డి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు శాంతమ్మ, వెంకట రమణారెడ్డి గార్లనే కాదు – అక్షర భిక్ష పెట్టిన గురువులను కూడా విస్మరించని సంస్కార వంతుడు వరప్రసాద్‌ రెడ్డి. మాతృమూర్తి పేరు తోనే ‘శాంతా బయోటెక్‌’ను నెలకొల్పారు. చాగంటి వారి వ్యాఖ్యానంతో బాపు బొమ్మలతో ‘మాతృ వందనం’ అనే పుస్తక ప్రచురణతో పాటు, రెండు దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ‘మాతృ వందనం’ కార్యక్రమం జరుపుతున్నారు. కొంత మంది లబ్ద ప్రతిష్ఠుల మాతృమూర్తులను సత్క రించడం, ఒక వేద పండితుణ్ని సన్మానించి ఆధ్యా త్మిక ప్రవచనం ఏర్పాటు చెయ్యడం, రెండు ఆసుపత్రులలో నిత్యాన్నదానాలను నిర్వహించడం మొదలైనవి ఆయన అపారమైన మాతృభక్తికి నిదర్శనాలు. ‘తల్లీ నిన్ను దలంచి’, ‘తండ్రీ నిన్ను దలంచి’, ‘తండ్రి పరమ పూజ్యుడు’, ‘అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకు జేజే’ వంటి పుస్తకాలను వెలువరించి జననీ జనకులకు ఎంతటి ఉన్నత స్థానమివ్వాలో ఆచరణాత్మకంగా సూచించారు.

సమాజ వికాసానికి విద్య గీటురాయి అని వరప్రసాద్‌ విశ్వాసం. ఆ అభిప్రాయంతోనే అనేక విద్యా సంస్థలను పోషిస్తున్నారు. తను చదువు కొన్న నేలబడి మొదలుకొని కాకినాడ ఇంజనీరింగ్‌ కళాశాల వరకు – అన్నిటికీ భవన నిర్మాణాలకు విరాళాలనిచ్చారు. తన ఉన్నతికి కారకులైన గురు వులనెందరినో సత్కరించారు. మద్రాసులోని కేసరి పాఠశాల, నటుడు మోహన్‌బాబు విద్యా నికేతన్, సరస్వతీ విద్యాలయ శాఖలు... ఇలా ఎన్నో విద్యా సంస్థలకు కోట్ల కొలది రూపాయ లను విరాళాలుగా ఇచ్చారు. 6 విద్యా సంస్థ లలో ఉత్తమ విద్యార్థు లకు ఏటేటా శాంతమ్మ గారి పేర స్వర్ణ పతకా లను బహూకరిస్తున్నారు.  అబ్దుల్‌ కలాం సూచన మేరకు 11 లక్షల మంది విద్యార్థులను తన ఉప న్యాసాలతో ఉత్తేజితుల్ని చెయ్యడం, ‘ఫోకస్‌’ సంస్థకు బాసటగా నిలిచి యువ ఉద్యోగులకు నీతి నిజాయితీల విలువను చాటడం – విద్య పట్ల ఆయన ఆసక్తికి కొన్ని ఉదాహరణలు.
వేద పాఠశాలల నిర్మాణ నిర్వహణలకు ఆర్థిక సహాయం, వేద విద్యార్థులకు ఉపకార వేతనా లివ్వడం, 100 గంటలపాటు వేదాలను రికార్డు చేయడానికి, వేద సంబంధ పుస్తకాలను ప్రచురిం చడానికి చేయూతనివ్వడం – సనాతన ఆర్ష ధర్మం పట్ల ఆయన అభిమానానికి తార్కాణాలు. అనేక దేవాలయాలకు విరాళాలివ్వడమే గాక శ్రీపురం, వేదాద్రిలలోని అన్నదానాలకు భూరి విరాళాలి వ్వడం ఆయన దానధర్మ నిరతికి సాక్ష్యాలు.

అనేక అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు నిధులివ్వడం, కేన్సర్‌ బారినపడి చివరి మజిలీకి చేరువవుతున్న అభాగ్యులకు ‘స్పర్శ’ వంటి సంస్థల ద్వారా ప్రశాంతతను చేకూర్చడం ఆయన మానవతా దృష్టికి మచ్చు తునకలు. వైద్యులకు, నర్సులకు శిక్షణనిచ్చే ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌’, కార్నియాపై పరిశోధనలకు ఊతమిచ్చిన ఎల్‌.వి. ప్రసాద్‌ కంటి ఆసుపత్రి మొదలైన వైద్య సంస్థలకు సహకారం, వికలాంగులకు బధిరాంధులకు ఉపకరణాలు సమకూర్చడం అభినందనీయం.

చిన్నతనం నుండి వరప్రసాద్‌ రెడ్డికి సంగీత సాహిత్యాలంటే మక్కువ. శ్రావ్యమైన పాటలను బాల్యం నుంచి పదిలపరచుకొనే అలవాటున్న ఆ రస పిపాసి అనేక మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను రూపొం దించారు. హాసం, శాంత–వసంత ట్రస్ట్‌ ప్రచుర ణలుగా శతాధిక గ్రంథాలను ప్రచురించారు. మరి కొన్నిటికి ఆర్థిక సహాయం చేశారు. మిత్రులు ఎంబీఎస్‌ ప్రసాద్‌ సంపాదకులుగా హాస్య సాహి త్యాలకు పెద్ద పీట వేస్తూ మూడేళ్లకు పైగా ‘హాసం’ పత్రికను నడిపారు. డా.సి. నారాయణ రెడ్డి, ముళ్లపూడి వెంకటరమణ, రావి కొండల రావు, తనికెళ్ల భరణి వంటి రచయితల రచనలతో పాటు సుమారు 50 పుస్తకాలను ప్రచురించారు. స్వయంగా ‘మనసు పలికే...’, ‘పరిణత వాణి’ వంటి పుస్తక రచనలు చేశారు.
ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుం దన్న సామెతగా ఆయన నిస్వార్థ సేవకు సర్వదా సానుకూలంగా సహకరిస్తున్న వసంత ధర్మ పత్నిగా లభించడం ఆయన అదృష్టం. ‘పద్మ భూషణ్‌’ నుంచి తాజాగా వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారం వరకు వందల పురస్కారాలు అందుకొన్న వరప్రసాద్‌ సార్థక నామధేయులు.

డా పైడిపాల, వ్యాసకర్త రచయిత, సినీ పరిశోధకుడు
(రేపు డా‘‘ వరప్రసాద్‌ రెడ్డి 75వ జన్మదినోత్సవం)

మరిన్ని వార్తలు