ఏనుగుల గుసగుసలు విందామా?

18 Mar, 2023 02:01 IST|Sakshi

ఏనుగులు తరాలుగా తమ జన్యువుల్లోకి చేరిన ప్రాచీన అరణ్య మార్గాల ఆధారంగా తిరుగుతాయి. ఈ మార్గాల్లో ఎన్నో ఇప్పుడు జనావాసాలుగా మారిపోయాయి. ఫలితంగా వాటి కదలికలకు చిక్కు ఏర్పడుతోంది. ఏటా 40– 50 ఏనుగులు కరెంట్‌ షాక్‌ కారణంగా చనిపోతున్నాయని అంచనా. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విద్యుదాఘాతానికి మూడు ఏనుగులు బలైన వారానికే ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీకి అస్కార్‌ అవార్డు రావడం గమనార్హం. భారత వారసత్వ జంతువైన ఏనుగులను కాపాడుకునేందుకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నది ఈ డాక్యుమెంటరీ ఇచ్చిన సందేశం. 2010లోనే ‘ఎలిఫెంట్‌ ఎక్స్‌పర్ట్‌ టాస్క్‌ఫోర్స్‌’ సమర్పించిన కార్యాచరణ ప్రణాళికనూ కలిసికట్టుగా అమలు చేయాలి.

జంతువులేవైనా పసితనంలో అపురూప మైన ముగ్ధత్వాన్ని కలిగి ఉంటాయి. గున్న ఏనుగులైతే మరీనూ. ఒక అనాథ గున్న ఏనుగు కథ అందరినీ భావోద్వేగంతో కదిలించడంలో ఆశ్చర్యం లేదు. ఆ కథేమిటో చూడా లంటే కార్తికీ గోంజాల్వెజ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ‘ది  ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చూడాల్సిందే. ఆస్కార్‌ అవార్డు పొందిన ఈ చిన్న డాక్యుమెంటరీ ఓ అనాథ గున్న ఏనుగుకూ, వయసు మీదపడ్డ సంరక్షక దంపతులకూ మధ్య నడిచిన భావోద్వేగాల కథ. తమిళనాడు అటవీశాఖ నిర్వహిస్తున్న ఓ ఏనుగుల క్యాంపులో ఈ కథ నడుస్తుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విద్యు దాఘాతానికి మూడు ఏనుగులు బలైన వారానికే ఈ డాక్యుమెంటరీకి అస్కార్‌ అవార్డు వచ్చింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయినది చూస్తే అందులో రెండు గున్న ఏనుగులు తల్లి, పిన్నిల దగ్గర నిలుచుని ఆ ఘటనా స్థలాన్ని వీడేందుకు అస్సలు ఇష్టపడలేదు. ఇలాంటి హృదయ విదారకమైన దృశ్యాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. పంట రక్షణ కోసం ఓ రైతు వేసుకున్న ముతక విద్యుత్తు కంచె (ఇది చట్ట వ్యతిరేకం) ఆ ఏనుగుల చావుకు కారణమైంది. సాధారణంగా ఏను గులు రాత్రుళ్లే గ్రామీణ జనావాసాలను దాటుతుంటాయి. 

ఆ డాక్యుమెంటరీలో చూపిన గున్న ఏనుగు రఘు కూడా విద్యు దాఘాతం వల్లనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బలహీనంగా ఉన్నా డన్న కారణంగా మంద వదిలేసింది. సకాలంలో తమిళనాడు అటవీ శాఖ ఆదుకోవడం రఘు చేసుకున్న అదృష్టం. ఈ అదృష్టం దక్కని ఏనుగు పిల్లలు బోలెడున్నాయి. డాక్యుమెంటరీలో చూపిన బెల్లీ, బొమ్మన్‌  దంపతులు మధుమలై అటవీ ప్రాంతంలోని తెప్పకాడు ఏను గుల క్యాంపులో పనిచేస్తున్నారు. వీరు ఏనుగులకు తర్ఫీదునిచ్చే కుట్టనాయకన్‌  తెగకు చెందినవారు. 

ప్రాణాలు తీస్తున్న కరెంటు
‘స్ట్రైప్స్‌ అండ్‌ గ్రీన్‌ ఎర్త్‌ ఫౌండేషన్‌ ’ వ్యవస్థాపకుల్లో ఒకరైన సాగ్నిక్‌ సేన్‌  గుప్తా సమాచార హక్కు చట్టం కింద తెలుసుకున్న సమాచారం ప్రకారం, 2012–13 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశం మొత్త మ్మీద 630 ఏనుగులు విద్యుదాఘాతాల కారణంగా మరణించాయి. అత్యధికంగా అసోం (120), ఒడిశా (106), తమిళనాడు (89) ఇందులో ఉన్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. కొంతమంది నిపుణుల అంచనాల ప్రకారం ఏటా కనీసం 40– 50 ఏనుగులు కరెంట్‌ షాక్‌ కారణంగా చనిపోతున్నాయి. ‘నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌’ మాజీ అధ్యక్షుడు బిశ్వజీత్‌ మొహంతి ఒడిశాలో ఏనుగుల ఊచకోతలు, విద్యుదాఘాతాలపై చాలాకాలంగా గళమెత్తుతున్నారు.  2019–22 మధ్యకాలంలోనే ఈ రాష్ట్రంలో 245 ఏనుగులు హతమై నట్లు స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయం ఇక్కడ గమనార్హం.

పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు దేశం మొత్తమ్మీద రాత్రిపూట వెలుగులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ‘నాసా’ తయారు చేసే ‘నైట్‌ టైమ్‌ లూమినాసిటీ’ మ్యాపులు చెబుతున్నాయి. 2021–22 ఎకనమిక్‌ సర్వే పదకొండవ ఛాప్టర్‌లో వెల్లడించిన ప్రకారం, రాత్రి పూట ప్రకాశం అనేది పదేళ్ల క్రితంతో పోలిస్తే 40 శాతం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఈ కృత్రిమ విద్యుత్తు వెలుగులు ఎక్కువైన కొద్దీ ప్రకృతికి జరిగే నష్టం కూడా అంతే పెరుగుతోంది. వేలాడే విద్యుత్తు తీగలు జీవజంతువులకు కలిగించే నష్టం దీనికి అదనం. ఈ అనవసర ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఇన్సులేషన్‌తో కూడిన విద్యుత్తు తీగలను వాడాలనీ, లేదా భూగర్భ కేబులింగ్‌ను ఉపయోగించాలనీ 2019లోనే ‘నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌’ సూచించింది. 

దారి తప్పిస్తున్న పరిస్థితులు
వాస్తవానికి ఏనుగులను ఒకచోట బంధించి, లేదా నియంత్రించి ఉంచడం సాధ్యం కాదు. అవి సంచారజాతికి చెందిన భారీ జీవాలు. తరాలుగా తమ జన్యువుల్లోకి చేరిన ప్రాచీన అరణ్య మార్గాల ఆధారంగా తిరుగుతూంటాయి. ఈ మార్గాల్లో ఎన్నో ఇప్పుడు జనావాసా   లుగా మారిపోయాయి. ఫలితంగా వాటి కదలికలకు చిక్కు ఏర్పడింది. ఏనుగుల్లాంటి భారీ క్షీరదాలను కాపాడుకోవాలంటే అడవుల మధ్య అనుసంధానత చాలా కీలకం. మన అభివృద్ధి పనుల కారణంగా అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటంతో సమస్యలేర్పడుతున్నాయి. గత నెలలో హరిద్వార్‌ ప్రాంతంలో ఏనుగుల మంద ఒకటి, పిల్ల ఏనుగులతో కలిసి కాంక్రీట్‌ జనారణ్యాన్ని దాటేందుకు నానా తిప్పలు పడటం ఓ వీడియోలో బంధితమైంది. 

ఆసియా ఏనుగుల సంఖ్య దేశంలో సుమారు 27–30 వేల వరకూ ఉంటుందని అంచనా. అయితే అభయారణ్యాలు, జాతీయ పార్కుల్లో కంటే ఇతర ప్రాంతాల్లోనే చాలా ఏనుగులు ఉంటాయన్నది చాలామందికి తెలియదు. ఒక అంచనా ప్రకారం మొత్తం ఏనుగుల్లో సురక్షిత ప్రాంతాల బయట ఉన్నవి 70 – 80 శాతం. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణ పెరుగుతూండటం; పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, ఒడిశా, తమిళనాడుల్లో వీటి సంరక్షణ కీలకమైన స్థితికి చేరుకోవడం ఆందోళనకరమైన అంశమే. 
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏనుగు తల ఉన్న వినా యకుడిని మనం ఇంట్లో పూజిస్తాం. కానీ అడవుల్లో నివసించే ఏనుగు లంటే మాత్రం ప్రేమ చూపం. వాతావరణ మార్పుల కారణంగా సహజసిద్ధంగా అడవుల్లో లభించే తిండి కూడా తగ్గిపోవడంతో ఇవి మనిషి పండించే పంటలకు అలవాటు పడిపోతున్నాయి. ఈ అటవీ ఏనుగుల సమస్య పరిష్కారమెలాగో అధికారులకూ అంతుపట్టడం లేదు. కొంతమంది నిపుణుల అంచనాల ప్రకారం, అటవీ ఏనుగుల జనాభా కూడా పెరుగుతోంది. వీటికి కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడం గురించిన సాధ్యాసాధ్యాలపై ఒకవైపు చర్చ నడుస్తూండగా, వాటిని వధించాలన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

కాగితాలకే పరిమితమైన సూచనలు
మనుషుల్లాగే ఏనుగులూ కుటుంబాలతో కూడి ఉంటాయి. సున్నిత మైన మనస్తత్వంతో కూడిన తెలివైన జాతి అది. మనుషులతో ఘర్షణ సందర్భంలో విద్యుదాఘాతానికి గురై తల్లిదండ్రులను కోల్పోతే ఓ గున్న ఏనుగు ఎంత మానసిక ఇబ్బందికీ, ఆవేదనకూ గురవుతుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఏనుగు పిల్లలు ప్రతికూల వాతావరణంలో పెరిగితే ఎదురయ్యే పరిణామాలను ఊహించడం కూడా కష్టమేమీ కాదు.  2010లో ఎలిఫెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ ‘గజ: సెక్యూరింగ్‌ ద ఫ్యూచర్‌ ఫర్‌ ఎలిఫెంట్స్‌ ఇన్‌  ఇండియా’ పేరుతో ఒక నివేదికను సమర్పించింది. చాలా సలహా సూచనలు చేసింది కానీ ఆసియా ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడం ఒక్కటే అమల్లోకి వచ్చింది. తాజాగా ఏనుగుల ఆవాసాలున్న దేశాల నిపుణులు ‘11వ ఆసియన్‌  ఏలిఫెంట్‌ స్పెషలిస్ట్‌ గ్రూప్‌ మెంబర్స్‌’ సమావేశాలు ఇండియాలో జరపనున్నారు. అలాగే ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో కాజీరంగా నేషనల్‌ పార్క్‌లో బ్రహ్మాండమైన ‘గజ్‌ ఉత్సవ్‌’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏనుగుల సంరక్షణకు ఇవి సరిపో తాయా? ‘ది  ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీ ఇస్తున్న సందేశం, సంకేతం ఒక్కటే. వేర్వేరు ప్రభుత్వ విభాగాల మధ్య అత్యవసరంగా సమన్వయం కుదరాలి. కలిసికట్టుగా జాతీయ వారసత్వ జంతువైన ఏనుగును కాపాడుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ నివేదికలోని సలహా సూచ నలు అమలు చేయాలి!

వ్యాసకర్త రచయిత, వైల్డ్‌లైఫ్‌ కన్సర్వేషనిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు