అంతా భ్రాంతియేనా!?

5 Sep, 2020 00:01 IST|Sakshi

అక్షర తూణీరం

దేశం కనీవినీ ఎరుగని ఆపత్కర, విపత్కర పరిస్థితిలో వుంది. చూస్తుండగా వారాలు, నెలలు గడిచి పోతున్నాయ్‌. సరైన దారి మాత్రం కనిపించడం లేదు. ఈ కొత్తరోగంపై స్పష్టమైన అవగా హన రావడం లేదు. కోవిడ్‌ నిరో« దానికి లేదా వచ్చాక తగ్గించుకో డానికి కచ్చితమైన మందులు లేవు. గడిచిన ఏడెనిమిది నెలలుగా ఎవరికి తోచిన సంగతులు వాళ్లు చెబుతున్నారు. జనం ప్రాణభయంతో ఎవరేం చెప్పినా విని అమలు చేసు ్తన్నారు. ప్రపంచ దేశాలన్నీ విడివిడిగా కలివిడిగా తమ తమ రాజకీయాలను వైరస్‌ అంచున నడిపిస్తున్నాయి. భారతదేశం టెలిస్కోప్‌లో ప్రపంచ దేశాల జననష్టాన్ని, నిస్సహాయతను చూపించి భారంగా నిట్టూర్పులు విడుస్తోంది. మన కర్మభూమిలో దీనికి కావాల్సినంత వాఙ్మయం కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. ఈ సౌలభ్యం మిగిలిన దేశాలకు లేదు.

మనం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటాం. కానీ, యిలాంటి విపత్కర సమయంలో, యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మన సామాన్య సమాజాన్ని పరిశీలిద్దాం. మార్చిలో ఏమి చెయ్యాలో తోచక రాత్రికి రాత్రి లాక్‌డౌన్‌ ప్రవేశపెట్టినపుడు జనం గందరగోళంలో పడ్డారు. వలస కూలీలు ఆకలి పొట్టలతో బతుకు జీవుడా అనుకుంటూ సొంతనేలకి కదిలారు. అదే సమయంలో కొన్ని దేశాలలో జనం నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. దొరకనివారు దోచుకున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు పప్పులు, ఉప్పులు, నూనెలతోబాటు కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు దండుకున్నారు. ఆ విషయంలో మనది సత్యంగా వేదభూమి, నిత్యంగా కర్మభూమి. ఈ జన్మ గురించి కాదు, వచ్చే జన్మలపై మనకి భయం. కానీ యీ భయం కొందరికే. వేరే ‘నిర్భయ ముఠా’ వుంది. ముందు శూన్యం, తర్వాత శూన్యం అని ప్రగాఢంగా నమ్మే ముఠా. 

మన ప్రభుత్వాలు మాటకు ముందు పారదర్శకం... పారదర్శకం అని నినాదాలు యిస్తుంటాయేగానీ చాలా విషయాలు ఇనుప తెరల లోపలే వుంటాయ్‌. ఈ కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎంత దారుణంగా ప్రవ ర్తిస్తున్నాయో గమనించాం, గమనిస్తున్నాం. యుద్ధ సమ యంలో చాలా షరతుల్ని పక్కన పెట్టిస్తారు. ఎమర్జెన్సీలో ప్రైవేట్‌ ఆస్తుల్ని జాతీయం చేసుకుంటారు. ప్రభుత్వాలకి ప్రత్యేక అధికారాలుంటాయి. దీనికి బదులుగా ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యానికి బోలెడు రాయితీలు కల్పిస్తుంది. మంచి తీరైన చోట సబ్సిడీ ధరకి భూములు యిస్తారు. ఖరీదైన వైద్య పరికరాల కొనుగోళ్లపై పన్ను రాయితీలు కల్పిస్తారు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు అందరికీ సాయపడాలన్న సదుద్దేశంతోనే కల్పిస్తారు. కానీ మొన్న నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు చేతులె త్తేశాయి. చివరకు రైలు పెట్టెల్ని సైతం పడకలుగా సిద్ధం చేశారు. ప్రైవేట్‌ ఆసుపత్రులపై బోలెడు విమర్శలు వచ్చాయి. వసూళ్ల ఫీజులపై ఆంక్షలు లేవు. బెడ్‌ దొరికితే చాలు బతికేసినట్టు అనుకున్నారు. నిలువుదోపిడీలకు సిద్ధ పడ్డారు. అందుకని సామాన్యులు ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్‌ ఆసుపత్రి ముందు పెద్ద పెద్ద అక్షరాలలో ప్రభు త్వం వారికిచ్చిన రాయితీలు ఎంతెంతో, దానికిగానూ ప్రతిఫలంగా వారిచ్చే సేవలేమిటో స్పష్టంగా చెప్పాలి.

అక్కడ స్థలాలు, ఆకాశ హార్మ్యాలు, అద్దాల గదుల వెనుక సామాన్యుడి కాసులు కూడా వున్నాయని తెలియ జెప్పండి. కార్పొరేట్‌ సంస్కృతిలో నిర్భయంగా బలిసి పోయే ప్రమాదం వుంది. ఒక దశకి వెళ్లాక కార్పొరేట్లు ప్రభుత్వంలో వాటాదార్లు అవుతాయి. ఇక దందా నడిచి పోతూ వుంటుంది. ఈ నేపథ్యంలో ప్రై.ఆసుపత్రులను ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కోవిడ్‌ ఫీజులపై నిఘా లేదు. జనం ఎంతటి అసహాయ స్థితిలో వున్నారో గమనిస్తే దుఃఖం వస్తుంది. మెడికల్‌ కాలేజీ వారిదే, నర్సింగ్‌ శిక్షణ వారిదే, మందుల షాపులు వారివే, భోజ నాల నిర్వహణ వారిదే. అన్నీ కలిసి ఒక పెద్ద ఇండస్ట్రీలా పెనవేసుకుపోయింది. ఇంకా సామాన్యులకు అంతుపట్టని బ్లడ్‌ బ్యాంకులు, హెల్త్‌ ఇన్సూరెన్సులు వేరే! ఎన్నైనా చేసు కోండి గానీ సామాన్యుణ్ణి కాస్త పట్టించుకోండి. వ్యాధిపై సరైన అవగాహన కల్పించండి. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు సరిగ్గా కోవిడ్‌ వ్యాక్సిన్‌ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావడం. ఎన్ని కల ముందు టీకా రావడం అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంటోందని ప్రపంచ మీడియా వ్యాఖ్యానించడం మరో చమత్కారం. ఈ టీకా ట్రంప్‌ విజయానికి దోహద పడుతుందని ఒక అంచనా. వేచి చూద్దాం. తర్వాత చరిత్రలో ఓ వాక్యం రాసుకుందాం.
శ్రీరమణ 
వ్యాసకర్త ప్రముఖ కథకుడు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు