జయాభి జై భవ! జయోస్తు!

24 Oct, 2020 00:40 IST|Sakshi

అక్షర తూణీరం 

గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్‌ మొదలయ్యేవి. ఒక పద్యం తప్పక అయ్యవార్లు పిల్లలకు నేర్పించేవాళ్లు. ‘ధరా సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్‌ భృత్యులై...’ అనే పద్యం చాలా ప్రసిద్ధి. పిల్లలం దరికీ నోటికి పట్టించేవారు. దసరా అంటే శరన్నవ రాత్రోత్సవాలలో పిల్లల విద్యా ప్రదర్శన, దాంతోపాటు గురు దక్షిణ స్వీకారం జరిగేది. ఈ పద్యం ఏ మహాను భావుడు రచించాడో చాలా గొప్పది. దేవుణ్ణి పొగిడి, పొగిడి ఆఖరికి ‘వర్ధిల్లు నారాయణా’ అంటూ దీవెనలు పెడతాడు. ధరా సింహాసనమై, భూమి ఆసన్నమై, ఆకాశం గొడుగై, దేవతలు సేవకులై, వేదాలు స్తోత్ర పాఠకులై, శ్రీగంగ కుమార్తె కాగా ‘నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారా యణా’ అంటూ పూర్తి అవుతుంది. అనాదిగా వస్తున్న దసరా పద్యాలలో ఇదొకటి. తర్వాత పిల్లలు జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ బడి పిల్లలు జై కొడుతూ అయ్యవారి వెంట బయలు దేరతారు.

ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ప్రతి గడపా వేయికళ్లతో ఎదురుచూసేది. ఆడ, మగ పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, మగ పిల్లలు విల్లమ్ములు, ఆడ పిల్లలు ఆడే కోతి బొమ్మలు పట్టుకుని పాటలతో, వీధుల వెంట సందడి చేసేవారు. ఆ చిన్న విల్లమ్ములు చిత్రంగా ఉండేవి. దాంతో గులాములు కొట్టడానికి వీలుండేది. ఆడ పిల్లలు కొత్త పరికిణీలు వేసుకుని కోతిని ఆడిస్తూ ఆట పట్టించేవారు. పిల్లలు ఇంటింటికీ తిరిగేవారు. జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు! పావలా అయితేను పట్టేది లేదు! అర్ధరూపాౖయెతే అసలే మాకొద్దు! అయ్యవాండ్రకు చాలు ఐదు వరహాలు! పిల్ల వాండ్రకు చాలు పప్పుబెల్లాలు! అంటూ యాగీ చేసేవారు. వీధి బడిలో ఏడాది పొడుగునా చదువు చెప్పిన వారికి ఐదు వరహాలు గురుదక్షిణ. వరహా అంటే నాలుగు రూపా యలు. ఆ రోజుల్లో అయ్యవార్లు ఎంతటి అల్ప సంతో షులు! ఇది విజయదశమి నాటి సంరంభం.

ముందు రోజు ఆయుధపూజ. అదీ మరీ పెద్ద ఉత్సవం. రైతుల దగ్గర్నించి, పల్లెల్లో పట్టణాల్లో ఉండే సమస్త చేతివృత్తుల వారు తాము నిత్యం వాడే పరిక రాలను ఆయుధాలుగా భావించి వాటికి సభక్తికంగా పూజలు చేస్తారు. దీనికి రకరకాల ఐతిహ్యాలు చెబుతారు. పాలపిట్టని చూస్తే శుభమని తెలంగాణ ప్రాంతీయులు నమ్ముతారు. వెండి బంగారం అంటూ జమ్మి ఆకులు ఇచ్చి పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణలో జానపదుల బతుకమ్మ పండుగ దసరాతో కలిసే వస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రిళ్లలో రోజుకో అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఇట్లా పదిరోజులు సాగే పెను పండుగ మరొకటి లేదు. దేశమంతా కనకదుర్గ, మహంకాళి అమ్మవారి ఉత్సవాలు రకరకాల పేర్లతో వైభవంగా జరుగు తాయి. మన దేశం అన్ని విషయాలలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా పండుగలూ పర్వాలనూ పంచాంగం చెప్పిన ప్రకారం జరుపుకుంటోంది. ఇదొక విశ్వాసం, ఇదొక నమ్మకం. ఎన్నో తరాలుగా, ఆర్ష సంప్ర దాయం అనుసరించి వస్తున్న పండుగలు పచ్చాలు భక్తిప్రపత్తులతో చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మన సంప్రదాయాన్నీ, ఆచారాన్నీ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బెజవాడ దుర్గమ్మకి సభక్తికంగా రాష్ట్ర ప్రజలపక్షాన పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ప్రజలు ఆనందించారు.

మన దేశంలో పెద్ద నదులన్నింటికీ పుష్కరాలు జరుగుతాయి. గంగానది సాక్షాత్తూ శివుడి తలమీంచి జనావళి కోసం దిగి వచ్చిందని మనం నమ్ముతాం. భగీరథుడి కృషికి దివి నుంచి భూమికి గంగ దిగి వచ్చింది. గంగ పుష్కరాలని కుంభమేళాగా వ్యవహరిస్తారు. సాధు సంతులు, సంసారులు, సామాన్యులు కుంభమేళా గంగ స్నానాలు ఆచరిస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన నాటి మన ప్రధాని నెహ్రూని, మీరు ఇలాంటి వాటిని నమ్ముతారా అని ఓ పత్రికా ప్రతినిధి అను మానంగా అడిగాడు. అందుకు జవహర్‌లాల్‌ ఏ మాత్రం తొట్రుపడకుండా– ‘కోట్లాది మంది విశ్వాసాల్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఉంటే నమ్మకం. గౌరవం అంటే నమ్మకం’ అని జవాబు ఇచ్చారు. ఎక్కువమంది విశ్వసించే వాటిని గౌరవించడం కూడా ఒక సంస్కారం. మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరు దసరా. అందుకే విజయదశమి అయింది. ఇహ నించి జాతికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవన్తు!


శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు