Sribagh Pact: వికేంద్రీకరణ శ్రీబాగ్‌ ఒప్పందంలోనే ఉంది

16 Nov, 2022 13:40 IST|Sakshi

మద్రాసు నగరంలోని స్వాతంత్య్ర సమర యోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహం పేరే ‘శ్రీ బాగ్‌.’ ఆ భవనంలో 1937 నవంబర్‌ 16న  ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం జరగింది. అదే ‘శ్రీ బాగ్‌ ఒప్పందం’గా జన వ్యవహారంలో నిలిచిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం... 

1. విశ్వవిద్యాలయం, రాజధాని, హైకోర్టు ఒకచోట కేంద్రీకృతం కాకుండా విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో అలాగే ఉంచి.. హైకోర్టు, రాజధానిలలో ఏది కావాలో కోరుకొనే అవకాశం సీమవాసులకు ఇవ్వాలి. 
2. కృష్ణ, తుంగభద్ర, పెన్నానదీ జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
3. అనంతపురంలోనూ ఆంధ్ర విశ్వ విద్యాలయ కేంద్రం ఉంచాలి. 
4. శాసన సభలో జనరల్‌ స్థానాలు జిల్లాల వారీగా సమాన నిష్పత్తిలో ఉండాలని నిర్ణయించారు.

ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్‌ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్‌ ఒప్పందం అటకెక్కింది. 

దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్‌ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్‌ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలి. కేవలం పాలనా రంగంలోనే కాక జలవికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలి. (క్లిక్ చేయండి: ఉత్తమాంధ్రగా నిలుపుతామంటే...)

– డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, అనంతపురం
(నవంబర్‌ 16 శ్రీ బాగ్‌ ఒప్పందం జరిగిన రోజు) 

మరిన్ని వార్తలు