వారిని మనమే కాపాడుకోవాలి!

18 Oct, 2021 00:06 IST|Sakshi

ఒకప్పుడు కశ్మీర్‌లో ముస్లింలు, పండిట్లు తమ సంతోషాలను, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపారు. మా బాల్యంలో పండిట్ల కుటుంబాలతో కలిసిమెలిసి జీవిస్తూ పొందిన అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. కశ్మీర్‌ సమాజ అస్తిత్వమే మారిపోయింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. ఇప్పటికీ అమాయకులైన, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? సొంత ప్రజలైన కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కుల పక్షాన కశ్మీరీ ముస్లిమ్‌లం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు అంటూ శ్రీనగర్‌ మేయర్‌ జునైద్‌ అజీమ్‌ మట్టు తన బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు.

కశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరిగిన పౌరుల హత్యలు ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని కకావికలు చేశాయి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఊహాగానాలకు, చెలరేగుతున్న పుకార్లకు అంతే లేకుండా పోయింది. ఈ ఘటనలకు వెనుక అసలు మూలం 1989లో చోటు చేసుకుందని గ్రహిస్తేనే ప్రస్తుతం జరుగుతున్న పౌరుల హత్యలపై కాస్త స్పష్టత కలుగవచ్చు. ఆనాడు కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడటంతోపాటు, కశ్మీర్‌ లోయ విడిచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ వచ్చాయి. కశ్మీర్‌ లోయ నుంచి పండిట్ల తొలి వలసకు అదే మూలం. అప్పుడు నా వయస్సు నాలుగేళ్లు మాత్రమే. నా తల్లిదండ్రులు మా పొరుగునే ఉన్న పండిట్లను కౌగలించుకుని తమ ఇళ్లను ఖాళీ చేసి వెళుతున్న వారికి కన్నీళ్లతో వీడ్కోలు పలికిన జ్ఞాపకాలు నాలో చాలానే మిగిలి ఉన్నాయి. 

మా ఇంటి పొరుగునే ఉన్న వృద్ధ దంపతులు పండిట్‌ రఘునాథ్‌ మాటో ఆయన భార్య మా బాల్య జీవితాల్లో విడదీయరాని భాగమై ఉండేవారు. వారి పిల్లలు, మనవళ్లు దేశంలోని అనేక నగరాల్లో చక్కగా స్థిరపడి సంవత్సరానికి ఒకసారి తమ పెద్దలను కలవడానికి కశ్మీర్‌ వస్తుండేవారు. ఆ సమయంలో మేమంతా ఒక పెద్ద కుటుంబంలా ఉండేవాళ్లం. వారి ఇంట్లో గంటలసేపు నేను గడిపేవాడిని. వారు మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు. రుచికరమైన స్నాక్స్‌ తినడానికి ఇచ్చేవారు. ఇక బాబూజీ అయితే తన గ్రామ్‌ఫోన్‌ని సగర్వంగా మాకు చూపేవారు. తన ఇంట్లో మేము కూర్చుని ఉండగా జ్యోతిష్య ప్రపంచం గొప్పతనం గురించి మాకు వివరించి చెప్పేవారు. ఆ ఇంట్లో చిన్న కిటికీ ఉండేది. కశ్మీరులో ఎక్కువగా పెరిగే గుల్మ వృక్షం నుంచి ఆ కిటికీ బయట పెద్దగా గాలి వీస్తుండేది.

ఒక కొత్త, కృత్రిమ, అసంపూర్ణ కశ్మీర్‌
కొన్నేళ్ల తర్వాత నేను బర్న్‌ హాల్‌ స్కూల్లో చదువుతున్నప్పుడు, ప్రతి రోజూ సాయంత్రం ట్యూషన్‌ కోసం జవహర్‌ నగర్‌ లోని పండిట్‌ దీనానాథ్‌ వలి చిన్న ఇంటికి వెళ్లేవాడిని. ప్రతి సాయంత్రం వారి ఇంట్లో గంటన్నరసేపు గడిపిన సమయంలో పిట్టకథలు, జానపద కథలను ఎక్కువగా చెబుతూ తరచుగా మాత్రమే పాఠ్యాంశాలను ఆయన చెబుతుండేవారు. నిజంగానే ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. నాకంటే పెద్దవాళ్లకు కశ్మీర్‌లో అందరూ కలిసిమెలిసి బతికిన సుసంపన్నమైన అనుభవాలు ఎక్కువగా ఉండేవి. ముస్లింలు, పండిట్లు తమ సంబరాలు, బాధలను పరస్పరం పంచుకుంటూ గడిపేవారు. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కలిసే కొంటె చేష్టలకు పాల్పడేవారు. స్థానిక సరకుల దుకాణంలో కమ్యూనిటీ పెద్దలు కూడి సాయంకాలం చర్చల్లో పాల్గొనేవారు.

మా బాల్యంలో, విద్యార్థి జీవితంలో మేం పొందిన ఆ అద్భుత జ్ఞాపకాలను 1989లో పూర్తిగా కోల్పోయాము. దాంతో కశ్మీర్‌ సమాజ అస్తిత్వమే మారిపోయింది. ఉమ్మడిగా జీవించిన చరిత్ర చెరిగిపోయి సామాజికంగా అసంపూర్ణంగా మిగిలిన, శాంతిని కోల్పోయిన ఒక కృత్రిమ కశ్మీర్‌ ఆవిర్భవించింది. కశ్మీరీ పండిట్లు మూకుమ్మడిగా వలసపోయిన ఆ మహాప్రస్థానం 1989లో సంభవించకుండా ప్రభుత్వ యంత్రాంగం, సమాజం ఎందుకు అడ్డుకోలేదని దశాబ్దాలుగా మేం దిగ్భ్రాంతి చెందుతూనే ఉన్నాము. పండిట్లను నిలుపుకోవడానికి మేం ప్రయత్నించలేదా? దానికోసం మరింతగా మేము కృషి చేసి ఉంటే బాగుండేదేమో! కశ్మీరీ పండిట్ల పక్షాన మేం గట్టిగా నిలబడి ఉంటే కశ్మీర్‌ చరిత్ర పంథా మరొకలా ఉండేదా?

మరొక సామూహిక విషాదం
ఇటీవల కొద్ది రోజులుగా పైగా కశ్మీర్‌ లోని మైనారిటీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చంపడానికి సాక్షీభూతులుగా ఉన్న మా సామూహిక భయాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మా మనస్సుల్లో, ఆప్తులను కోల్పోయిన మా ఆలోచనల్లో ప్రతిధ్వనించి ఉండాలి. కశ్మీర్‌లో నా తరం ఇలాంటి ప్రశ్నల మధ్యనే పెరుగుతూ వచ్చింది. వేలాదిమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న హింసాత్మక ఘటనలకు చరిత్ర ఉల్లేఖనాలుగా ఇలాంటి ప్రశ్నలు మాలో మెదులుతూనే ఉన్నాయి.

శ్రీనగర్‌ నడిబొడ్డున తన షాపులో కూర్చుని ఉన్న పేరొందిన కెమిస్టు మఖన్‌ లాలా బింద్రూను ఉగ్రవాదులు ఇటీవల కాల్చిచంపిన తర్వాత ఆయన ఇంటికి నేను వెళ్లాను. ఒక సామూహిక, విషాదానుభవం నన్ను ముంచెత్తింది. నిస్సహాయత్వం నన్ను ఆవహించింది. ఆయన కుటుంబం ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్నప్పుడు మేం మరొక సామూహిక విషాదం ఊబిలో చిక్కుకున్నామా అని నాకనిపించింది. కొద్ది రోజుల తర్వాత ఉగ్రవాదులు ఈద్గాలోని సంగమ్‌వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చొరబడి, ఆ స్కూల్‌ ప్రిన్సి పాల్‌ సుపీందర్‌ కౌర్, టీచర్‌ దీపక్‌ చంద్‌లను పాశవికంగా చంపేశారు. ఒకే ప్లాన్, ఒకే పద్ధతిలో జరిగిన హత్యలవి.

అదేరోజు సుపిందర్‌ కౌర్‌ ఇంటికి నేను వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించినప్పుడు, కొన్ని దశాబ్దాల క్రితం మేం అనుభవించిన బాధ, ఆగ్రహం, నిస్సహాయతలు నన్ను చుట్టుముట్టాయి. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా నా వద్ద మాటల్లేవు. మా శాంతిని, మా గతాన్ని మాకు దూరం చేస్తూ రాక్షసులు తలపెట్టిన దారుణ విషాదాలు రేపిన అవే గాయాలు మా భవిష్యత్‌ తరాలను కూడా వెంటాడనున్నట్లు తలిచి, కంపించిపోయాను.

అస్పష్ట ముసుగును తొలగించాల్సిన సమయం!
మరొక అర్థం లేని, అనాగరిక ఉగ్ర చర్యలో బిహార్‌కి చెందిన ఒక చిరు వ్యాపారిని లాల్‌ బజార్‌లో కాల్చి చంపారు. శ్రీనగర్‌లో జీవిస్తున్న వేలాదిమంది స్థానికేతర వ్యాపారులకు, కూలీలకు, కార్మికులకు ఉగ్రవాదులు చేసిన  హెచ్చరిక ఇది. ఆ వ్యాపారి చేసిన తప్పేమిటి? తన భార్యా పిల్లలను పోషించడానికి వేలమైళ్ల దూరంలో ఉంటూ వీధుల్లో చిరు వ్యాపారం చేసుకునే అతడి ప్రాణం నిలువునా తీయడాన్ని ఏ సైద్ధాంతిక సమరం సమర్థిస్తుంది? నిజంగానే శ్రీనగర్‌కి ఇది దుస్సహమైన వారం. నగరం నడిబొడ్డున ఇలా ఎలా జరుగుతుంది అని మేం ఆశ్చర్యపడుతున్నాం. ఇలాంటి దారుణాలను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవలసి ఉంది? ఇలాంటి హత్యా ఘటనలకు వ్యతిరేకంగా కశ్మీర్‌లోని మెజారిటీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ప్రతిఘటన రావాలని మేం అర్థం చేసుకోవలసి ఉంది. ఇలాంటి అనాగరిక హత్యలకు ముగింపు పలకడానికి కారణమవుతున్న సామాజిక పవిత్రత లేదా మనమే ఉండాలనే భావన పూర్తిగా నశించాలి. మన రాజకీయ అభిప్రాయాలతో, సిద్ధాంతాలతో పనిలేకుండా ఇలాంటి ఘటనల పట్ల మన ఖండన మండనలు ఎలాంటి సందిగ్ధతలూ లేని రీతిలో వెలువడాల్సి ఉంది. 

ఇలాంటి హత్యలను గుర్తు తెలియని సాయుధులు చేసినవిగా పేర్కొనడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. స్పష్టత లేని, అసందిగ్ధతతో కూడిన పరదాలే, జరుగుతున్న విషాదాలను ఇలాంటి గణాంకాలతో కప్పి పుచ్చుతుంటాయి. ఇలాంటి క్రూరహత్యలకు పాల్పడుతున్న శక్తులను ఉగ్రవాదులుగా మాత్రమే వర్ణిస్తూ స్థానిక మీడియా, సమాజం పెద్ద ఎత్తున ముందుకు రావాలని నేను విన్నవిస్తున్నాను. తమ క్రూరచర్యలను ఇంకా కొనసాగించేందుకు అమాయకులను, నిరాయుధులైన పౌరులను కాల్చిచంపడంపై విశ్వాసం ఉంచుతున్న వారు ఉగ్రవాదులు కాక ఇంకేమవుతారు? ముఫ్తీలు, అబ్దుల్లాలు అనే రెండు రాజకీయ కుటుంబాలను మాత్రమే కాపాడుతూ, మిగిలిన వారిని విసిరివేయదగిన సరకులలాగా మాత్రమే భావిస్తూ మన పోలీసులు అడ్డుకోవడానికి ప్రజలు దృఢమైన వైఖరిని చేపట్టాల్సి ఉంది.  మన మైనారిటీ కమ్యూనిటీలు (కశ్మీరీ పండిట్లు, కశ్మీరీ సిక్కులు) సురక్షిత వాతావరణంలో నివసించడానికి మనం దృఢనిర్ణయంతో లేచి నిలబడాల్సి ఉంది. తటస్థంగా ఉండటానికి, కపట వైఖరిని ప్రదర్శించడానికీ ఇది సమయం కాదు. అటో ఇటో తేల్చుకోవాలంటూ పిలుపు ఇవ్వాల్సిన సమయం ఇది. మన సొంత ప్రజల పక్షాన మనం నిలబడటంలో విఫలమైతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు.

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు