డిజిటల్‌ మీడియాకు వాక్‌ స్వేచ్ఛ వద్దా?

26 Mar, 2021 00:38 IST|Sakshi

విశ్లేషణ

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, వారి సంభాషణలను శాశ్వతంగా భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది మీడియా వాక్‌ స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సాఫ్ట్‌వేర్‌ రంగంలో వాక్‌ స్వేచ్ఛకు కూడా సంబంధించిన సమస్య. ప్రతి యూజర్‌ సందేశాన్ని ఇలా నిలవ చేయటం ద్వారా నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ వాటిలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. కానీ, రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించే తరహా నిబంధనలు విఫలమవుతాయన్నది వాస్తవం. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌ నిబంధనలు వాక్‌ స్వేచ్ఛ అనే భావనకే వ్యతిరేకంగా ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం కలుగుతోంది. సాధారణంగా మితభాషిగా ఉండే ఎడిటర్స్‌ గిల్డ్‌ సైతం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ ఈ కొత్త నియమాలు దేశంలో మీడియా స్వతంత్రతకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. సాధారణ ప్రజానీకం కోసం కోడ్‌ రచన, సంకేత నిక్షిప్త సందేశాల టెక్నాలజీ ప్రాప్యతను పరిమితం చేయడానికి 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జాతీయ ప్రభుత్వాల ట్రెండ్‌కీ కేంద్రప్రభుత్వ మధ్యస్థపు మార్గదర్శకాలకు సమాన ప్రాధాన్యత ఉంది. అమెరికా 1990ల చివరలో క్రిప్టోగ్రఫీని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంపై పరిమితి విధించడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్‌వేర్‌ రంగంలో వాక్‌ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సైఫర్‌పంక్స్‌ (సామాజిక, రాజకీయ మార్పుకోసం ప్రైవసీ పొడిగింపు టెక్నాలజీలను, క్రిప్టోగ్రఫీని విస్తృతంగా ఉపయోగించాలని ప్రబోధించే వారు) ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. 

క్రిప్టోగ్రఫిక్‌ కోడ్‌ రచనను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని అనుమతించకుండా ఆంక్షలు విధించినప్పుడు, టీ షర్ట్‌లపై ఈ కోడ్‌ను సైఫర్‌పంక్‌లు ముద్రించి సంచలనం రేకెత్తించారు.ఈరోజు మనందరం ఆధారపడిన ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌ (పంపిన సందేశాలను సంబంధిత యూజర్లు మాత్రమే చదవగలిగేలా చేసే కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) సైఫర్‌పంక్‌లు ప్రారంభించిన 50 ఏళ్ల ప్రతిఘటనా ఉద్యమ ఫలితం మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, ప్రతి యూజర్‌ గోప్యతా సంభాషణను శాశ్వత రికార్డు రూపంలో భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

కాబట్టి ప్రస్తుత సమస్య మీడియా వాక్‌ స్వేచ్ఛకు సంబంధించింది మాత్రమే కాదు. అంతకు మించి ఇది సాఫ్ట్‌వేర్‌ రంగంలో వాక్‌ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ప్రాథమిక స్థాయిలో చూస్తే కోడ్‌ను రాసి దాన్ని ప్రచురించడానికి, అభిప్రాయాలను రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. కానీ మెసేజింగ్‌ యాప్‌లు కోడ్‌ రచనను ఎలా చేయాలనే విషయమై, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు ఆదేశిస్తున్నట్లుగా కనబడుతున్నాయి.

ఇది సాంకేతిక రంగానికి వర్తించే వాక్‌ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రూపమే తప్ప మరేమీ కాదు.ఈ ప్రత్యేక సమస్య కేంద్ర బిందువు ఏదంటే సిగ్నల్‌ ప్రొటోకాల్‌. ఇది సైబర్‌ రంగంలో అభిప్రాయాలను వెలువరించే కోడ్‌ వ్యక్తీకరణ. ఇది భౌతిక రంగంలో వాక్‌ స్వేచ్ఛ పరవళ్లు తొక్కడాన్ని అనుమతిస్తుంది. దీన్ని ‘ఓపెన్‌ విస్పర్‌ సిస్టమ్స్‌’ అనే పేరు కలిగిన లాభేతర కంపెనీ వృద్ధి చేసింది. ఇతరుల కంటబడకుండా, వినకుండా యూజర్లు చేసే గోప్య సంభాషణలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదనే ప్రగాఢ విశ్వాసం ఈ కంపెనీకి ఊపిరిగా ఉంటోంది. 

మద్రాస్‌ హైకోర్టులో ఫింగర్‌ప్రింటింగ్‌ టెక్నిక్‌పై చర్చ
జంతు పరిరక్షణా కార్యకర్త ఆంథోనీ క్లెమెంట్‌ రూబిన్‌ మద్రాస్‌ హైకోర్టు ముందు దాఖలు చేసిన ప్రజావ్యాజ్య ప్రయోజన దావాతో యూజర్ల గోప్యతపై చర్చ భారత్‌లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. న్యాయస్థానంలో ఈ అంశంపై జరిగిన చర్చ.. నిక్షిప్త సందేశాలను విచ్ఛిన్నపర్చకుండానే యూజర్ల మాటల సందేశాన్ని వాట్సాప్‌ ట్రాక్‌ చేయవచ్చా అనే అంశంపైకి మళ్లింది. అప్పుడు సైతం పేరుచెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు కొందరు ప్రతి సందేశంపై  ఫింగర్‌ ప్రింటింగ్‌ (డేటాను గుర్తించి, ట్రాక్‌ చేసేందుకు నెట్‌వర్క్‌ డేటా నష్ట నివారణ సంస్థలు చేపట్టే డేటా లేదా డాక్యుమెంట్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నిక్‌) వేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా ప్రతిపాదించారు.

ప్రతి సందేశంపై ఫింగర్‌ ప్రింటింగ్‌ అమలు అసాధ్యమని వాట్సాప్‌ తోసిపుచ్చినందున ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటోకాల్‌ అవసరమే లేదని తమిళనాడు అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు కూడా.అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను ప్రకటించి ఉన్నందున ఫింగర్‌ప్రింటింగ్‌ సొల్యూషన్‌ని అమలుపర్చేందుకు అధి కార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అయితే యూజర్ల గోప్యత సందేశాలను తాను వెల్లడి చేయబోననే తప్పుడు ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొస్తోంది. ఫింగర్‌ ప్రింటింగ్‌ సొల్యూషన్‌ యూజర్ల గోప్యత సందేశాలను ఎలా బహిర్గతం చేస్తుందో అర్థం కావాలంటే ఫార్వార్డ్‌ సీక్రెసీ భావనను ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది.

ఫార్వార్డ్‌ సీక్రెసీ అంటే మీ ప్రస్తుత ఎన్‌క్రిప్షన్‌ కీని ఎవరైనా సైబర్‌ అటాకర్‌ దొంగిలించినా, మీ మునుపటి సందేశాలను ఇప్పటికీ సురక్షితంగానే ఉంచే సిగ్నల్‌ ప్రొటోకాల్‌. ఈ ఫార్వర్డ్‌ సీక్రెసీ అనేది చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. టెలికామ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని విచ్ఛిన్నపర్చడం ద్వారా మీ సందేశాలన్నింటిని అడ్డుకోవడమే కాకుండా, మీ ఫోన్‌ నుండి మీ ప్రమేయం లేకుండా బలవంతంగా సందేశాలను గుంజుకోవడానికి ఇలాంటి దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. మన ప్రత్యర్థి దేశాలు ఆత్యాధునిక సైబర్‌ ఆపరేషన్లను కలిగి ఉంటున్నప్పుడు బలహీనమైన ఎన్‌క్రిప్షన్‌ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.

మునుపటి సందేశాలు కొంత కాలం తర్వాత ఆటోమేటిక్‌గా తొలిగిపోతున్నప్పుడు ఫార్వర్ట్‌ సీక్రెసీ అనేది మరింతగా ఆచరణ సాధ్యంగా మారుతుంది. కాబట్టి మీ ఫోన్‌ని మీరు కోల్పోయినా లేక ఎవరైనా తీసుకుపోయినా సరే వాటిలోని పాత సందేశాలని ఎవరూ ఇకపై చూడలేరు. సంగ్రహించలేరు. కాబట్టి, సిగ్నల్‌ మెసెంజర్, వాట్సాప్‌ రెండింటిలో సందేశాలు మాయమవడం అనేది ఒక ప్రామాణిక ఫీచర్‌గా ఉంటుంది. అంటే ఇతరుల చెవిలో మాత్రమే మనం వినిపించే గుసగుసలు ఎలా రహస్యంగా ఉంటాయో, అవి గాల్లో ఎలా కలిసిపోతాయో ఆ రకంగా ఇకపై మొబైల్‌ సందేశాలు కనిపించకుండా పోతాయి. మీరు ఒక గ్రూప్‌లో సందేశాలను పంపించినప్పుడు, ఇతర డివైస్‌ల నుంచి సందేశాలను తొలగించే సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది.

దీనివల్ల మీ గోప్యత మరింత విస్తృతమవడమే కాకుండా స్వేచ్ఛగా మీకు మీరుగా గానీ, లేక గ్రూప్‌లో కానీ మాట్లాడవచ్చు.అభిప్రాయాలను పంచిపెడుతూ, ప్రజలను ప్రభావితం చేసేం దుకు ఒక పబ్లిక్‌ రంగాన్ని రూపొందించి ఉంచే ట్విట్టర్, ఫేస్‌బుక్‌ మాదిరి కాకుండా, మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు అనేవి వ్యక్తులు లేదా గ్రూపుల వ్యక్తిగత కమ్యూనికేషన్‌ కోసమే ప్రాథమికంగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు లేదా సంభాషణ కర్తలు నేరస్వభావంతో ఉండవచ్చు. ఒక మూసివుంచిన గదిలో నేరాలు ఎలా చేయాలో మాట్లాడుకునే భావసారూప్యత కలిగిన వ్యక్తులకు, ఇలాంటి యూజర్ల గ్రూపుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి గ్రూప్‌లలోకి చొరబడటం ద్వారా లేక ఇలాంటి గ్రూప్‌ల ఆధారాన్ని సేకరించి వారు చేస్తున్న నేరాలను పసిగట్టి దర్యాప్తు చేయడం నిఘా సంస్థల పని.

ఒక సందేశాన్ని మొట్టమొదటగా ఎవరు పంపించారో కనుగొనడానికి మెసేజింగ్‌ అప్లికేషన్లు తమ నిక్షిప్త సందేశాల టెక్నాలజీని మార్చుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రతి సందేశాన్ని, ప్రతి యూజర్‌ వివరాలకు సంబంధించిన హ్యాష్‌ విలువలను తప్పకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి సందేశాన్ని ఇలా నిలవ చేయటం అంటే నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ ఈ సందేశాలలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు.

ఇటీవలే దిశారవి అరెస్టు సందర్భంగా ఢిల్లీ కోర్టు వాక్‌ స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను కోరుకునే హక్కును కలిగి ఉంటుందని, కమ్యూనికేషన్‌లో అలాంటి భౌగోళిక అడ్డుగోడలు ఉండవని వ్యాఖ్యానించడాన్ని గుర్తుంచుకోవాలి. రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించడానికి తీసుకొచ్చే నిబంధనలు తప్పక విఫలమవుతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్‌ని ఫార్వర్డ్‌ చేయడాన్ని నియంత్రించడం ఎలా అనే అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


శ్రీనివాస్‌ కొడాలి 
వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు
డేటా, ఇంటర్నెట్‌ గవర్నెన్స్‌
(ది వైర్‌ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు