Sripada Subrahmanya Sastry: కథాకథన చక్రవర్తి

23 Apr, 2022 15:18 IST|Sakshi

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో ‘సంభాషణలు’ కథను వి(క)నిపి స్తాయి. దృశ్యమానమైన భాషాపర బంధాలు ఆయన ప్రత్యేకత. బహు గ్రంథ చదువరి.  తెలుగు సాహిత్య జగత్తులో ‘శ్రీపాద’ ఏ వర్గా నికి ‘సరిపడని’ వారు. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలినవారు విడివిడిగా తీసుకొని తమ రచనా అజెండాలుగా చేసుకున్నారు. కానీ... శ్రీపాద వాటిని విడివిడిగా చూడలేదు. వేదగిరి రాంబాబు ‘తెలుగు జాతి, భాషల పట్ల అభిమానంతో సాహిత్య సహకారంతో, విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయమూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ అంటారు. శ్రీపాద 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. 1891 ఏప్రిల్‌ 23న తూర్పు గోదావరి అనపర్తి  మండలం పొలమూరులో జన్మించారు. 1961 ఫిబ్రవరి 25న రాజమండ్రిలో మరణించారు.

తన అత్త కూతురునే వివాహం చేసుకున్నారు. ఆమె పేరు ‘సీత’. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి ‘మహాలక్ష్మి సోదెమ్మ’. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి, స్మార్తం పూర్తి చేసి, తన  పెద్దన్న దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి దగ్గరకు ఊరు విడిచి ‘వల్లూరు’ వెళ్ళారు. ‘తెనుగులో మంచి పాండిత్యం సంపాదించాలి’ అని నిశ్చయించుకొన్న శ్రీపాద పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితి విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే ‘సంస్కరణవాదం’ తెలుగు కథకు సువాసన లద్దింది. ఆయన కథల్లో శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వంటివారి ‘వాదాల’ను పాఠకులు చూస్తారు. శ్రీపాద కథల్లో వివిధ సందర్భాల్లోని సంభాషణలు గమనిస్తే ఆయన స్త్రీల విషయంలో ఎంత బలీయమైన అభి ప్రాయంతో తన రచనల్లో ఆయా పాత్రలను చిత్రించారో అర్థమవుతుంది.

శ్రీపాద రాసిన 75 చిన్న కథల్లో ప్రతీదీ సమాజ దర్పణంగానే నిలిచింది. ‘కలుపు మొక్కలు’, ‘గులాబి అత్తరు’, ‘అరికాళ్ళ క్రింద మంటలు’, ‘ఇలాంటి తవ్వాయి వస్తే’, ‘గుర్రప్పందేలు’, ‘గూడు మారిన కొత్తరికం’, ‘విమానం ఎక్కబోతూనూ’, ‘తాపి మేస్త్రీ’, ‘రామదీక్షితులు బి.ఎ.’, ‘పుల్లంపేట జరీచీర’, ‘జూనియర్‌ కాదు’, ‘అల్లుడు’, ‘రామలక్ష్మి’ ఇలా ప్రతీ కథకూ దాని గొప్పతనం దానిదే అని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనుసు, మెదడు విశాలమవుతాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి ‘తెలుగు వాళ్ళకి మాత్రమే శ్రీపాద వారి కథలు చదివే అదృష్ట ముంద’న్నారు. గొప్ప సత్యమిది. ‘వైదిక పరిభాష’, ‘ఆయుర్వేద యోగ వైద్య ముక్తావళి’ లాంటి వైద్య గ్రంథాలు; భాషకి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశారు. ‘ప్రేమపాశం’, ‘నిగళ బంధనం’, ‘రాజ రాజు’, ‘కలం పోటు’ వంటి నాటకాలు, నాటికలు రాసారు.

రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రస్మాతకంగా తీర్చిది ద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన అత్మ కథను ‘అనుభవాలూ  జ్ఞాపకాలూను’గా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికను నిర్వహించారు. ‘గిడుగు’ లాగానే భాషావాది. అనేక ‘అష్టా వధానాలు’ చేశారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. (క్లిక్: ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం)
  
‘మనసు ఫౌండేషన్‌’ వారు శ్రీపాద వారి సర్వ లభ్య రచలనూ నాలుగు సంపుటాలుగా వెలువరించి తెలుగు పాఠకలోకానికి మేలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

- భమిడిపాటి గౌరీశంకర్‌ 
వ్యాసకర్త కథా రచయిత
(ఏప్రిల్‌ 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి)

మరిన్ని వార్తలు