కొంచెం కొంచెం.. ఇప్పుడిప్పుడే..

19 Sep, 2020 02:47 IST|Sakshi

అక్షర తూణీరం 

కొంచెం కొంచెం, ఇప్పుడిప్పుడే లెక్కలు తేలుతున్నాయ్‌. క్యాపిటల్‌ అమరావతి భూకుంభకోణం వ్యవ హారంలో రమారమి నాలుగువేల ఎకరాల బినామీ ఉంటుందని ఆరో పణ. దీనిపై నిజం నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, అమరావతి పునాది బినామీ భూముల మీదే పడింద న్నది సత్యం, పునఃసత్యం. అప్పట్లో మన ప్రియతమ ముఖ్య మంత్రి నాలుగు జిల్లాలకి ఆశపెట్టి చివరకు ఆయన కట్ట పెట్టాలనుకున్నవారికి సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు. అయితే, అది నెమర్లకు మాత్రం అందడం లేదు. కథ అడ్డంగా తిరిగింది. ముప్పై వేల ఎకరాల పూలింగ్‌ ఒక చిత్రం. అసలు అంత పచ్చటి భూమి అవసరమా అంటే ఇంకా అవసరం అన్నారు. ప్రధానమంత్రి మట్టి పిడతలతో అనేక నదీ జలాలు, నదుల మట్టి వారి దీవెనలతో రంగరించి క్యాపిటల్‌ శంకుస్థాపన పవిత్రం చేశారు. ముహూర్త బలం ఉన్నట్టు లేదు. ఆ పునాది ఏ మాత్రం ఎక్కి రాకుండా గుంటపూలు పూస్తోంది. పైగా ఆ గుంటలో నిజాలు రోజుకొక్కటి పూస్తు న్నాయ్‌. వాళ్లని వీళ్లని ఆఖరికి తెల్లరేషన్‌ కార్డు వారిని, అసలు కార్డే లేని వారిని బెదిరించి స్వాములు చదరాలు చదరాలుగా భూమి కొనేశారు. ఇక క్యాపిటల్‌ వస్తే ఆ నేలలో పైకి విస్తరిం చడమేనని కలలు కన్నారు.

అసలీ వేళ క్యాపిటల్‌ ఎక్కడున్నా ఒకటే. ఏడాది కాలంలో కరోనా ప్రత్యక్షంగా బోలెడు పాఠాలు నేర్పింది. గొప్పగొప్ప ఐటీ పార్కులు, సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్యాలు ఓ మూలకి ఒదిగిపోయి కూర్చున్నాయ్‌. వర్క్‌ ఫ్రం హోం సంస్కృతి వచ్చింది. కాలుష్యాలు తగ్గాయి. ఎవరిల్లు వారి వర్క్‌ ప్లేస్‌ అయింది. పెద్ద పెద్ద షోరూములన్నీ ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయ్‌. ఎటొచ్చీ మనీట్రాన్స్‌ఫర్‌ చేస్తే చాలు ధనాధన్‌ సరుకు గుమ్మంలో ఉంటుంది. టెలీ మెడిసిన్‌ ప్రాచుర్యం పొందుతోంది. టెక్నాలజీ రోజురోజుకీ చిలవలు పలవలుగా వృద్ధి చెందుతోంది. ఈ సందర్భంలో ముప్పై వేల ఎకరాల మూడు పంటల భూమి క్యాపిటల్‌కి అవస రమా? టోక్యోలో, కియోటోలో వంద చదరపు అడుగుల్లో కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుందిట. మనవి అసలే పచ్చని వ్యవసాయ క్షేత్రాలు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకా ముందుకువెళ్లి అతి తక్కువ స్పేస్‌లో ఇమిడిపోతాయి. అన్ని అవసరాలు తీరుస్తా. నేడు మహా విశ్వం మనిషి గుప్పి ట్లోకి వచ్చేసింది. అతి త్వరలో రానున్న సాంకేతిక విప్లవం అనేక పెను మార్పులు తీసుకురానుంది.

ఆధునిక మానవుల్లారా! మనతోపాటు ఒక మట్టి గడ్డ కూడా రాదని తెలిసి నేలమీద భ్రమలు వదలండి. నిన్నగాక మొన్ననే కోవిడ్‌ నేర్పిన పాఠాలు మన కళ్లముందు కదులుతు న్నాయి. జీవితం క్షణభంగురం, బుద్బుదప్రాయం ఇత్యాది ఎన్నో ఉపమానాలు మనకు తెలుసు కానీ లక్ష్యపెట్టం. ఆఖ రికి ఆరడుగుల నేల కూడా కరువైంది కాదా?! మనది వేద భూమి, కర్మక్షేత్రం. మనది వేదాలు, ఉపనిషత్తులు పండిన నేల. ప్రపంచాన్ని జయించి విశ్వవిజేతగా పేరుపొందిన అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ భారతీయ రుషి ప్రపంచాన్ని పలక రించాలనుకున్నాడు. తన గుర్రం మీద ఒక రోజు సాంతం తెల్లారకుండానే రుష్యాశ్రమాలవైపు బయలు దేరాడు. దూరంగా ఒక ఆశ్రమం దగ్గర గుర్రందిగి మెల్లగా వినయంగా నడుచుకుంటూ కదిలాడు అలెగ్జాండర్‌. అక్కడ భారతీయ రుషి అప్పుడప్పుడే లేలేత అరుణ కిరణాలతో ఉదయిస్తున్న సూర్యునికి అభిముఖంగా తిరిగి, రకరకాల భంగిమలలో నమస్కరిస్తూ మంత్రాలతో అర్చిస్తున్నాడు. కాసేపు గమనిం చాడు. విశ్వవిజేతకి ఏమీ అర్థం కాలేదు. నాలుగు అడుగులు ముందుకు వేసి, మహాత్మా! నన్ను అలెగ్జాండర్‌ అంటారు. విశ్వవిజేతని. ఈ మహా ప్రపంచంలో నాది కానిది ఏదీ లేదు. మీ దర్శనభాగ్యం అబ్బింది. చెప్పండి. తమరికేమి కావాలో ఆజ్ఞాపించండి. మీ పాదాల వద్ద పెట్టి వెళ్తాను. సంకోచించ కండి అంటూ ప్రాధేయపడ్డాడు. రుషి ఒక్కసారి వెనక్కు తిరిగి ప్రతి నమస్కారం చేశాడు. ‘అయ్యా, ధన్యవాదాలు. ప్రస్తుతానికి నాకేమీ అవసరం లేదు. కాకపోతే చిన్న విన్నపం. మీరు కొంచెం పక్కకి తప్పుకుంటే, నాపై ఎండపొడ పడు తుంది. సూర్య భగవానుడి స్పర్శ తగులుతుంది. అదొక్కటి ప్రసాదించండి చాలు’ అన్నాడు రుషి. వేద భూమి నిర్వచనం విశ్వవిజేతకి అర్థమైంది.

తర్వాత కాలం చెల్లి అంతటి విశ్వవిజేతా గతించాడు. నన్ను అంతిమయాత్రగా తీసుకువెళ్లేటప్పుడు, నా రెండు చేతులూ బయటకు ఉంచి, ఇంతటి విజేత ఆఖరికి రిక్త హస్తాలతో వెళ్తున్నాడని సాటివారికి ఎరుకపరచండి. నా జీవితం కడసారి ఈ సందేశం జాతికి ఇవ్వాలని విన్నవిం చుకున్నాడు. చాలా చిన్నది జీవితం. చేయతగిన మంచి ఇప్పుడే చేయాలి. వేలాది ఎకరాలు వీపున పెట్టుకు వెళ్తామని ఆశించవద్దు. అది జరిగే పని కాదు.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు