అమ్మో! టీకాల వాళ్లు!

12 Sep, 2020 02:04 IST|Sakshi

రెండు తరాల క్రితం టీకాల వాళ్లంతటి బూచాళ్లు మరొకరు లేరు. గ్రామాల్లో స్కూళ్లకు వచ్చే వాళ్లు. ఖాకీ దుస్తులు ధరించే వారు. చిన్న స్పిరిట్‌ స్టౌ వెలిగించి, టీకా సూదుల్ని బాయిల్‌ చేసేవారు. టీకాలవాళ్లు ఊళ్లోకి వస్తున్నారని తెలిస్తే ఎక్కడి వాళ్లక్కడ పరుగో పరుగు. టీకా అంటే రెండు చుక్కలు పొడుస్తారు. పచ్చబొట్టులా టీకా గుర్తులు పట్టుకుం టాయ్‌. అవే వాళ్లకి గుర్తింపు చిహ్నాలుగా ఉండేవి. అవి పొంగుతాయి. రెండు మూడు రోజులు జ్వరం వస్తుంది. అంటే వ్యాక్సిన్‌ శరీరంలోకి బాగా ఎక్కినట్టు గుర్తు. ఆ రోజుల్లో వ్యాపించే అనేక అంటు వ్యాధులకు టీకా విరుగుడు.

పెద్దవాళ్లు, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇళ్లలో దాచి పెట్టేవారు. గడ్డిమేటలో దాచి ఉంచేవారు. ఆ రోజుల్లో వ్యాక్సినేషన్‌ అత్యంత నిర్బంధం. టీకా లేకుంటే అది క్రిమినల్‌ కేసు. గ్రామాధికారులు దానికి పూర్తి బాధ్యత వహించేవారు. ఎలిమెంటరీ స్కూలు రికార్డులలో వ్యాక్సిన్‌ ప్రస్తావన విధిగా ఉండేది. ఆనాడు అవిద్య, మూఢ నమ్మకాలు టీకాలపై పనిచేసేవి. వజ్రాన్ని వజ్రం తోనే కోయాలనే సిద్ధాంతం అనుసరించి వ్యాక్సిన్‌కి సంబంధించిన యాంటీబాడీస్‌ని రూపొందించారు. వాటిని మానవదేహంలోకి ఎక్కించి రోగనిరోధక శక్తిని పెంపొందించేవారు.

ఉన్నట్టుండి రైల్వేస్టేషన్‌లలో, సందళ్లలో సంతలో జాతర్లలో టీకాలవాళ్లు కనిపించేవాళ్లు. ఇదొక పెద్ద హంగామా. ఇప్పుడు కాలం మారింది. పుట్టీపుట్టగానే ఎన్నోరకాల వ్యాక్సిన్‌ పురిటిలోనే మొదలుపెడుతున్నారు. ఈ పరిణామ క్రమంలో కొందరు పిల్లలు తమ బాల్యాన్ని పోగొట్టుకున్నారు. పోలియో లాంటి వాటి బారినపడ్డారు. ఇది చరిత్ర.

ఇప్పుడు అందరూ కోవిడ్‌ టీకా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. టీకాని వాడుకలోకి తేవడం ఎంత కష్టమో ప్రజకి తెలిసి వస్తోంది. టీకా అనేది మానవ మేథకి శక్తివంతమైన పరీక్ష. టీకా ముందు మానవ శరీరంలోకి ఎక్కించినప్పుడు అది రోగ నిరోధకకారిగా పనిచేసి వ్యాధిని తేలికపరుస్తుంది. నియంత్రణ జరిగాక లోపలి యాంటీబాడీస్‌ మళ్లీ వాటి అవసరం వచ్చేదాకా నిద్రాణమై ఉంటాయ్‌. ఇంతటి గొప్ప మెకానిజమ్‌తో ఈ టీకా వ్యవస్థ రూపొందించబడుతుంది. దానికి అడ్డు దారులుండవు. ఆ కొత్త వైరస్‌ అట్టుపుట్టాలు (పుట్టు పూర్వోత్తరాలు) వాటి నైజ గుణాలు స్పష్టంగా అవ గాహన చేసుకోవాలి. అప్పుడు విరుగుడు ప్రయోగాలకి శ్రీకారం చుట్టాలి.

అన్నిటికీ ఆధునిక మానవుడు ఎన్నడో బీజాలు వేశాడు. ప్రారంభ దశ వ్యాక్సిన్‌ దాదాపు యాభై ఏళ్లనాడే వాడుకలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో రకాల టీకాలు వాడుకలోకి వచ్చాయి. ఇప్పుడీ ‘గత్తర’కి టీకా రావాలి. అందాకా అస్తవ్యస్తమైన మన వ్యవస్థ తిరిగి సద్దుమణ గదు. దాదాపు ఏడాది నించి ప్రపంచమంతా అల్లకల్లో లంగా మారింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. అయినా ఈ మహా సంక్షోభంలో ఎదురీదాలని దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

మరోపక్క రాజ్యకాంక్ష పెరుగుతోంది. సరిహద్దులు ఉద్రిక్తంతో ఉడికి పోతున్నాయ్‌. మనిషి అయినా శాంతిగా ఉండడు. మన హైందవ సంప్రదాయంలో ఉప నిషత్తులలో మహర్షులు చెప్పిన గొప్పగొప్ప నీతికథలు ఉన్నాయి. అవి మానవ నైజానికి నిలువెత్తు దర్పణాలు. 

కారడవిలో మనిషిని పులి తరుముతోంది. దిక్కు తోచక పరుగెత్తుతున్న మనిషి దారిలేక పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో అమాంతం దూకేశాడు. దారి మధ్యలో పాడుబడ్డ బావి పంచన ఒక బలమైన కలుపు మొక్క దొరికింది. బతుకు జీవుడా అని మనిషి దాన్ని పట్టుకుని వేలాడాడు. ఇంతలో బావిలో మొసలి కది లింది. నోరు తెరిచి, ఓ పక్కకి వచ్చి నోరు తెరిచింది. మనిషికి గుండెల్లో రాయి పడింది. ఇదిలా ఉండగా తను వేలాడుతున్న కలుపు మొక్కకి పట్టిన తేనెపట్టు కదిలింది. ఈగలు లేచాయి. తేనెపట్టు చెదిరింది. పాడబడ్డ బావిలో ముళ్లు తగిలాయి. తేనెపట్టు చీరుకుపోయింది. పట్టులోంచి తేనె చుక్కలు బొటబొటా కిందికి జారి పడుతున్నాయి. కిందికి చూస్తే మొసలి నోరు తెరిచి సిద్ధంగా ఉంది. ప్రాణభయంతో వేలాడుతున్న మనిషి నాలుక పూర్తిగా సాచి, జారిపడుతున్న తేనెబొట్లని ఒడిసి పట్టే పనిలో పడ్డాడు. అదీ మనిషి నైజం! ఇంత జరుగుతున్నా బురద జల్లుకోవడం మానుకోలేదు. వీటిని జయించే టీకా ఇప్పుడు మనకి కావాలి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా