జంట నగరాల కాలనీలలో కంపు!

10 Oct, 2020 00:56 IST|Sakshi

అక్షర తూణీరం

జంట నగరాలంటేనే కాలనీల మయం. ప్రపంచంలోనే అతి పెద్ద కాలనీలు ఇక్కడ ఉన్నా యని గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి పెద్ద రోడ్డు పక్కనా కొమ్మల్లా రెమ్మల్లా కాలనీలు మొలుస్తాయ్‌. ఇవన్నీ బల్దియా పాలనలోనే వర్ధిల్లుతుంటాయి. వాటి సౌలభ్యాన్నిబట్టి మేడలు, మిద్దెలు, బహుళ అంత స్తుల భవనాలతో నిండిపోతుంది. ఇక్కడకూడా పన్నులు భారీగానే పిండుకుంటారు. కానీ, అంతగా పట్టించు కోరు. కార్పొరేటర్ల పాలన, అజమాయిషీ వీటిమీదే అధి కంగా ఉంటుంది. ఇలా నగరం వేగంగా వృద్ధి చెందడం ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా మాత్రం ఉండదు. కాలనీ రూపుదిద్దుకునేటపుడే ముందుచూపు, ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒకటికి నాలుగు ప్లాట్లు కొని పడేస్తారు. ఒక దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. మిగిలిన నాలుగు స్థలాలు ఓ పక్కన పడుంటాయ్‌. కాలనీ చిక్క పడినకొద్దీ స్థలాల రేట్లు ఆకాశంవైపు చూస్తుంటాయి.

అవి మధ్య మధ్యలో ఖాళీగా ఉండి, అందరికీ ‘డంపింగ్‌ యార్డ్‌’లుగా మారతాయి. ఇవి కాలక్రమంలో భయంకర మైన అపరిశుభ్ర కేంద్రాలుగా మారతాయ్‌. ఈగలు, దోమలు, వీధికుక్కలు అక్కడే పుట్టి పెరుగుతుంటాయి. ఈ కరోనా టైంలో వాటిని నిత్యం శుభ్రం చేసేవారు లేక, శానిటేషన్‌ లేక కాలనీవాసులకు ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టాయో అందరికీ తెలుసు. సీజనల్‌ అంటువ్యాధులు ప్రబలినపుడు మాత్రం కార్పొరేషన్‌ కుంభకర్ణుడిలా ఒక్క సారి మేల్కొంటుంది. నాలుగు ఫాగింగ్‌లతో ఆవలించి, మళ్లీ నిద్రకి ఉపక్రమిస్తుంది. ఎక్కడైనా కాలనీలలో ఇసుక, కంకర దిగిన ఆనవాళ్లు కనిపిస్తే కార్పొరేటర్లు హడావుడిగా వచ్చేస్తారు. కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం ఉందా? లేదా? అంటూ ఇంటి యజమాని ప్రాణం తీస్తారు. ఇది నిత్యం మనం చూసే తంతు.

ఈ ఖాళీ ప్లాట్ల యజమానులు తెలియకుండానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులైపోతారు. అక్కడ ఏమీ కట్టరు. వాటిని అమ్మరు. వారు ఎక్కడో ఉండి తమ ప్లాట్లని పర్య వేక్షిస్తూ, ధరలు తెలుసుకుంటూ, లాభాలు లెక్కించు కుంటూ ఉంటారు. వాళ్ల ఖాళీ ప్లాట్లు ఎంత అశుభ్రంగా చెత్త నిలయంగా ఉన్నాయో వారికి తెలిసినా పట్టించు కోరు. కాలనీవాసులకి ఈ ఖాళీ స్థలాలు నానారకాల చెత్తల్ని వదిలించుకోవడానికి చేతివాటంగా అందు బాటులో ఉంటాయి. ఇదంతా కార్పొరేషన్‌ వారే బాధ్యత తీసుకుని బాగు చేస్తారని, బాగు చేయాలని అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నిత్యం రకరకాల బయో వ్యర్థాలు ఆ గుట్టల్లో పడి ఎంత అనా రోగ్యాన్ని సృష్టిస్తాయో అందరికీ తెలుసు. ఇక మధ్య మధ్య పడే వానజల్లులు మరింత అపకారం కలిగిస్తాయి. చిన్న ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్‌ వేస్తారు. అందు లోకి కావల్సినంత చెత్తపడుతుంది. ఇది మనవాళ్ల నైజం.

దీన్ని పూర్తిగా అరికట్టాలి. ఇది ఒక జంట నగరాల లోనే కాదు రెండు రాష్ట్రాల పెద్ద నగరాలన్నింటిలో ఉన్న సమస్య. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి ఏదైనా కావచ్చు ఇలాంటి భయంకరమైన అశుభ్ర దృశ్యాలతోనే ఎదురవుతాయి. కార్పొరేషన్లు ముందు వాటిపై నిఘాపెట్టాలి. ధరలొస్తాయని కొనిపడేసిన స్థలా లపై అజమాయిషీ చాలా ముఖ్యం. పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్న వారిపై పన్ను అధికం చేయండి. లేదా జప్తు చేయండి. ఫలానా సమయంలోగా నిర్మాణాలు చెయ్యండని చెప్పండి. లేదంటే ఆ స్థలాలని తీసుకుని సద్వినియోగం చెయ్యండి. మనం పదేపదే ‘విశ్వనగరం’ చేస్తామని కబుర్లు చెబితే చాలదు.

స్వచ్ఛ భారత్‌ ఉద్యమానికి ఇవి ఎంతగా అడ్డుతగిలాయో అందరికీ తెలుసు. చాలామంది స్థలాలు కొని, పడేసి ఏ దేశమో వెళ్లిపోతారు. వారికి దోమల బాధ, ఈగల బెడద, పురుగు చెదల గొడవ ఏదీ ఉండదు. ధర వచ్చినపుడు ఫోన్‌మీద అమ్మకాలు సాగిస్తారు. లేదా వాటిని సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించి మిగిలినవారికి ఇబ్బంది లేకుండా చేయ డానికి వాటి యజమానుల నించే అధిక పన్ను వసూలు చేయండి. కార్పొరేటర్లు బాధ్యత వహించాలి. జగన్‌ మోహన్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన వ్యవస్థ లాంటి దాన్ని ప్రతి వార్డులోనూ పెట్టాలి. పదవి కోసం కాకుండా, ఎంతో కొంత సేవ చేయడానికి వార్డు లీడర్లు ఉండాలి. స్వచ్ఛ భారత్‌ ఉద్యమం ఇక్కడ నించే ప్రారంభం కావాలి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు