బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందే!

13 Oct, 2021 01:20 IST|Sakshi

సందర్భం

గణాంకాలు లేకుండా ఓబీసీల అభివృద్ధి ప్రణాళికలు ఎలా సాధ్యం? స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఓబీసీల కుల గణాంకాల అవసరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. వివిధ సామాజిక వర్గాలు ఏ రంగాల్లో, ఎంత స్థాయిలో వెనుకబడి ఉన్నారు? వారి ప్రధానమైన సమస్యలేమిటి? గత కాలంలో వారి జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా? ప్రభుత్వం ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? అన్న ప్రశ్నలకు సమాధానం గణాంకాల ద్వారా వెతకడానికి సాధ్యమవుతుంది. 50 శాతం పైగా ఉన్న జనాభా విషయంలో మొదటి నుండి ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కావాలని నిర్లక్ష్యం చేయడం దారుణం.

మన దేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1872 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టిన కుల గణాంకాలలో కుల అంశం కూడా చేర్చారు. అది 1931 వరకు కొనసాగింది. 1941లో గణాంకాలు సేకరించినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంవల్ల ఆ ప్రక్రియలను మధ్యలోనే నిలిపివేశారు. 1951 నుంచి భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గణాంకాలు తప్ప ఓబీసీలు కుల గణాంకాలు చేపట్టడం కావాలనే మానివేసింది. మొదటి ఓబీసీ కమిషన్‌ 1953 (కాకా కలేల్కర్‌), రెండవ కమిషన్‌ (మండల్‌) 1979, తప్పనిసరిగా కుల గణాంకాలు చేపట్టాలని సిఫారసు చేశాయి. మండల్‌ కమిషన్‌ ఓబీసీల రిజర్వేషన్లను నిర్ధారించటానికి 1931 కుల గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన అన్ని బీసీ కమిషన్లు కులగణాంకాలు చేపట్టాలని పదేపదే చెబుతూనే ఉన్నాయి.

సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కూడా శాస్త్రీయమైన గణాంకాలు లేకుండా ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం ఎలా ఇయ్యాలి అన్న విషయంలో నిర్ణయం తీసుకోవడం అహేతుకమని చేప్తూనే ఉన్నాయి. 2010 సంవత్సరం పార్లమెంట్‌లో దాదాపు అన్ని పార్టీలు ఈ విషయంలో పట్టుపట్టగా యూపీఏ ప్రభుత్వం మొదటగా అంగీ కరించి, ఆ తర్వాత మాటమార్చి 2011లో సామాజిక ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ) చేపట్టటానికి ప్రభుత్వశాఖల ద్వారా దేశవ్యాప్త గణాంకాలను చేపట్టింది. అయితే అందులో తప్పులు దొర్లాయని గణాంకాల వివరాలు బయటపెట్టలేదు.

ఆ తర్వాత 2014లో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గణాంకాల వివరాలను బయట పెడతామని వాగ్దానం చేసి, జరిగిన తప్పులు సవరించలేని స్థాయిలో ఉన్నాయని, వాటిని అక్కడితో ఆపేసింది. కేవలం 20 శాతం కూడా లేని కులాలు 80 శాతం పైగా దేశ వనరులను, ప్రభుత్వ వ్యవస్థలను, పరిశ్రమలను, వ్యాపారాన్ని, ఉద్యోగాలను, ఇంకా అధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు, 50 శాతం పైగా ఉన్న వేలాది కులాలు కింది స్థాయిలో కనీస అభివృద్ధికి నోచుకోకుండా అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైనట్లు బయటపడింది. అందువల్ల ఆ సమాచారాన్ని తొక్కిపెట్టించి ఉంచడం జరిగింది.

మళ్ళీ ఇప్పుడు 2021 సెన్సెస్‌లో కుల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణాంకాల అవసరం గురించి దాదాపు అన్ని పార్టీలవారు ప్రస్తావించి, సమాచారం లేకుండా కొత్త కులాలను చేర్చడానికి, అభివృద్ధి చెందిన కులాలను జాబితాల నుండి తొలగించటానికి ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. సమాచారం లేకుండానే కులాలను వర్గీకరిస్తే భవిష్యత్తు పరిణామాలు అసంబద్ధంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి 2021 సెన్సెస్‌లో భాగంగా కుల గణాంకాలను చేపట్టాల్సిందే.
వ్యాసకర్త ప్రధాన కార్యదర్శి

సుదమల్ల వెంకటస్వామి 
తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా
మొబైల్‌ : 93470 15154

మరిన్ని వార్తలు