రైతు బంద్‌

10 Dec, 2020 00:57 IST|Sakshi

గోధుమ ధుమధుమ లాడుతూ–
కేంద్ర దుశ్శాసన పర్వాలు
ధూళిలో కలవాలని శపిస్తుంది.
వరి గొలుసులు తెంపుకున్న వడ్లు
ఒడ్లు– వరాలు తెంచుకుని– ఢిల్లీ 
సరిహద్దుల్లో నాలుగు దిక్కులే మాకు
షెడ్లు అంటున్నాయ్‌

పత్తి– పాలకుల ప్రవృత్తి చూళ్లేక
శ్వేత రక్తం వాంతి చేసుకుంటుంది

కంది– చలికి దగ్గుతూ కళ్లెలు– కళ్లెలుగా 
ఖాండ్రించి ఉమ్ముతుంది.
మిరప– మిరియం కలిసి
కారాలు నూరుతున్నై

బియ్యం– పప్పు, ఉప్పు వంటి
వంటింటి దినుసులు
రోడ్లమీద కడుపు మండి
కుత కుత ఉడికిపోతున్నై
అధికార భవన భోజన పదార్థాలు
పాలకుల పులినోట్లోకి వెళ్ళడం
జన్మ జన్మల పాపంగా
విలపిస్తున్నై
పవర్లో ఉన్న నేతల్ని
చుట్టుకొనివున్న సూట్లు  కుర్తాలు 
ధోతులూ  పంచెలు చీరలు
అనకొండల్ని చుట్టుకున్నట్టు
అనునిమిషం
చిరచిరలాడుతూ
ఛీత్కరించుకుంటున్నాయి 
ఏడు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత 
ఉగ్రత కొని తెచ్చుకోలేక
తన్నుతాను అసహ్యించుకుంటుంది

కురుస్తున్న మంచు 
నేను నేలకు రాలిపోయేవేళ
ఎందుకొచ్చారు బిడ్డలారా అంటూ
పశ్చాత్తాపంతో కరిగి కన్నీటి చిమ్మై
తప్పు మన్నించమని
రైతుల పాదాల్ని ముద్దుపెడుతుంది

రోడ్లమీద కొచ్చిన రైతులకోసం
ప్రాణంలేని ట్రాక్టర్లు
ఇళ్ళుగా మారి రైతుల్ని
కడుపులో దాచుకుంటున్నై
ఏలెటోని మీద నేల
ఎత్తి ఏడు దోసిళ్ళ మన్నుపోస్తుంది

ఎగ్గు సిగ్గులేని ఏలికలు
పట్టపగ్గాల్లేని పాలకులు
చర్చలమీద చర్చలకు రమ్మంటూ 
‘రమ్మి’ ఆట ఆడుకుంటున్నారు

మీరు పెట్టే బిచ్చపుకూడు తినమని రైతులు
తమ చద్దులు తామే తింటున్నా కూడా
లజ్జా– మానం– శరం లేని అధికారం
రైతులు కోరిన కార్పొ‘రేట్‌’ చట్టాలు 
రద్దుచేయడం లేదు

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకం కదా 
గుద్దే నైజం – అందుకే
ఢిల్లీలో రైతుల అడుగుల ధ్వని
లండన్‌లో రాస్తారోకో చేస్తుంది
ఈ రోజు దేశం
ఆకాశపు టంచుల్లో నిలుచున్న
ధిక్కార పతాక సన్నివేశం


వ్యాసకర్త
డాక్టర్‌ సుద్దాల అశోక్‌ తేజ
కవి, సినీ గేయ రచయిత,  జాతీయ అవార్డు గ్రహీత

>
మరిన్ని వార్తలు