వలస జీవుల సంక్షోభ పరిష్కారం ఎలా? 

21 May, 2021 01:06 IST|Sakshi

దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస జీవుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు.


బాల్యంలో, మా హౌసింగ్‌ సొసైటీ తోటలో ఆడుకుంటున్నప్పుడు, మా కాలనీలో పనిమనుషులు, సేవకులు తమ తమ గ్రామాల గురించిన జ్ఞాపకాలను పంచుకునేవారు. కొంకణ్‌ లేదా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల గ్రామాల్లోని మామిడి తోటలు, ఏపుగా పెరిగిన వరి పొలాలు, విశాలమైన గృహాల గురించి వారు రమ్యంగా వర్ణిస్తూ పోయేవారు. పెరిగి పెద్దవుతున్నప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన శ్రామికులను కలిసే అవకాశం తటస్థించినప్పుడు తమ గ్రామాల్లోని ఒకప్పుడు తాము నివసించిన ఇళ్ల గురించి వారు చెప్పేవారు. వారి జ్ఞాపకాలు విన్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన వచ్చేది. కొంకణ్‌ లేదా కేరళ లేదా హిమాచల్‌ ప్రదేశ్‌ అద్భుతమైన పర్వతప్రాంతాలు, లేక ఉత్తర బెంగాల్‌కి చెందిన సుందరమైన గ్రామాల నుంచి ప్రజలు వలస వచ్చి, అకుపచ్చదనం కానీ, చోటు కానీ, కనీస గౌరవం కానీ ఉండని బాంబే మురికివాడల్లో ఎందుకు కనాకష్టంగా బతుకుతున్నారు అనే ప్రశ్న నాలో రగిలేది.

కరోనా తొలివేవ్‌ ఉధృతమైన 2020 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో, 2021 ఏప్రిల్‌ నుంచి సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కాలంలో వలస కార్మికులు భారీ ఎత్తున తమ తమ ఊళ్లకు వెళ్లిపోవడం చూసినప్పుడు జాతీయ రాజధాని సరిహద్దుల్లో భారత రైతులు కొనసాగిస్తున్న నిలకడైన పోరాటంతో వలస కార్మికుల జీవితం ముడిపడి ఉందనిపించక మానదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, వాటిపై అవిరామంగా పోరాడుతుండటం పూర్తిగా చట్టబద్ధమైనదేననిపిస్తుంది. రైతులు ఈ మూడు చట్టాల వెనుక ఉన్న తర్కాన్ని, అంతరార్థాన్ని, అంతర్జాతీయ కార్పొరేట్‌ పెట్టుబడితో ఈ చట్టాల అనుసంధానాన్ని చక్కగా అర్థం చేసుకున్నారని బోధపడుతుంది.

భారతీయ అసంఘటిత శ్రామికులు
భారత శ్రామిక శక్తిలో 90 శాతం వరకు అసంఘటిత రంగంలో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వీరిలో 75 శాతం వరకు వలస శ్రామికులే. ఇంతవరకు సంఘటిత రంగంలో ఉన్న కొద్ది శాతం శ్రామికులు కూడా ఇప్పుడు శరవేగంగా అసంఘటి రంగం కోరల్లోకి వెళ్లిపోతున్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ అసంఘటిత రంగంలోని శ్రామికుల హక్కులు, భద్రత, గౌరవాన్ని పణంగా పెట్టి మరీ దేశంలో పారిశ్రామికీకరణ తొలి దశ నిర్మితమైందని నగరాల్లోని శ్రామికులను చూస్తే అర్థమవుతుంది. అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో శ్రామికులకు ఏమాత్రం భద్రత ఉండదు. ఈ రంగంలోని శ్రామికులు రోజుకు 12 గంటలపాటు నెలపొడవునా పనిచేయాల్సి ఉంటుంది. లేదా కొన్ని రోజులు మాత్రమే పని దొరుకుతుంది. ఏరోజైనా పనిలోకి రాకుండా ఉండే స్వేచ్ఛ శ్రామికులకు ఉంటుంది కానీ అలాంటివారికి ఆరోజు తిండి దొరికే అవకాశం వట్టిమాటే. ఇంత భయంకర వాస్తవం కొట్టొచ్చినట్లు కనబడుతుండగా దేశ పాలనా పగ్గాలు చేపట్టిన వారు 2020 మార్చి నెలలో కేవలం 4 గంటల సమయం మాత్రమే ఇచ్చి దేశ రవాణా వ్యవస్థను సంపూర్ణంగా నిలిపివేస్తూ కఠినాతికఠినమైన లాక్‌ డౌన్‌ను అంత నిరంకుశంగా ఎలా విధించగలిగారన్నది ప్రశ్నగానే మిగులుతుంది.

భారతీయ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయరంగ వాటా 1950 లలో 55.3 శాతంగా ఉండగా, 2000 నాటికి అది 21.8 శాతానికి పడిపోయిందన్నది వాస్తవం. కానీ వ్యవసాయంపై ఆధారపడిన జనాభా, ఇతర కార్యకలాపాలు ఆ స్థాయిలో తగ్గిపోలేదు. 1993–94లో వ్యవసాయంపై ఆధారపడిన వారి జనాభా 62.8 శాతం కాగా, 2015 నాటికి 47 శాతానికి పడిపోయింది. జీడీపీ, ఉపాధి రెండింటి రీత్యా చూస్తే వ్యవసాయం స్తంభనకు గురైందని, ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాన్ని దాటుకుని, పరిశ్రమలు, సేవారంగాలకు తరలిపోతోందనడానికి ఇది కారణం కావచ్చు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉందని, ఈ రంగంలో పనిచేస్తున్నవారు కోలుకోలేనంతగా దెబ్బ తింటున్నారనడంలో సందేహమే లేదు. ఈ సంక్షోభమే ప్రత్యేకించి 1990ల నుంచి ఆయా ప్రభుత్వాల రాజకీయ ప్రాధమ్యాలను, విధానాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ప్రభుత్వ విధానాల్లో, బడ్జెట్లలో వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం వ్యవస్థాగతంగానే కొనసాగుతూ వచ్చిందని సులభం గానే బోధపడుతుంది.

ఆహార ఉత్పత్తుల ధరలు కాస్త పెరిగితే చాలు దేశంలో కొంపలంటుకు పోయినట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వాటి ధరలను తగ్గిస్తూ రావడం దశాబ్దాలుగా పాలనా నిర్ణేతలకు, పరిశ్రమ దారులకు అలవాటైపోయింది. అదే సమయంలో వ్యవసాయానికి తప్పనిసరైన ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లు, డీసెల్, విద్యుత్‌ వంటి పారి శ్రామిక ఉపకరణాల ధరలు కొండెక్కుతున్నాయి. వ్యవసాయం ప్రాధాన్యతను కోల్పోయిందని సామెత చెబుతున్నా 86 శాతం భూమికి ప్రాధాన్యం వహిస్తున్న సన్నకారు రైతులు తాము వ్యవసాయ భూమికి దూరం కావడం లేదని భావిస్తూ వస్తున్నారు. చివరి క్షణంలో మాత్రమే వారు పొలాలను వదిలి నగరాల బాట పడుతున్నారు. భూమికి రైతు కట్టుబడటం అత్యంత ఉద్వేగాల కారణంగానే జరుగుతోందని తరచుగా చెబుతుంటారు. అందుకే రైతు కుటుంబాలు తరాలుగా సేద్యానికి కట్టుబడి ఉంటారు. అయితే వ్యవసాయాన్ని, భూమిని రైతు ఎందుకు వదిలిపెట్టలేడు అనే అంశాన్ని ప్రస్తుత కిసాన్‌ అందోళన్‌ చక్కగా విడమర్చి చెప్పింది. ఎందుకంటే భూమి ఒక ఉత్పత్తి సాధనం. ఇది ఇతర వనరులను సృష్టించిపెట్టే వనరు. పైగా ఇది సజీవ వనరు. నిరంతరం జీవితాలను సృష్టిస్తుంటుంది. పైగా గత ఏడు దశాబ్దాల కాలంలో సాగు భూమికి దూరమైన కోట్లాదిమంది అనుభవాలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మనుగడ కోసం తమ భూమిని అటవీ వనరులను దూరం చేసుకుని వలస వెళ్లినవారు అక్కడ బతకడానికి వనరులు, ఉపాధి లేక అల్లాడుతూ వస్తున్నారు. డబ్బు భూమికి ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదనే అనుభవం డ్యాములు, గనులు, జాతీయ రహదారుల కారణంగా తమ భూములు కోల్పోయి నగరాల బాట పట్టిన లక్షలాది మంది రైతుల వ్యధలు కళ్లారా చూస్తూ ఇప్పటికీ కొద్దిగా భూమిని కలిగి ఉన్న రైతులు భూమికి దూరం కావడమనే ఆలోచననే మదిలోకి రానివ్వడం లేదు.

అందుకే కిసాన్‌ ఆందోళన్‌లో పాల్గొంటున్న రైతులు ఒకే విషయం చెబుతూ వస్తున్నారు. మేం ఈ భూమికి యజమానులం, రైతులం. మాకు మేమే బాస్‌లం. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలు అమలైనట్లయితే కొద్ది సంవత్సరాల్లోనే మేం సేవకులుగా, కార్పొరేట్‌ బాస్‌ల పనిమనుషులుగా మారకతప్పదు. మరొకరి భూమిపై మేం పనిచేసి బతకాలనుకోవడం లేదు. దేశంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, అది అమలవుతున్న తీరు ప్రాథమికంగా తప్పుమార్గంలో వెళుతోందని గత సంవత్సరం వలస కార్మికుల అనుభవం తెలిపింది. కష్టించి పనిచేసేవారికి అందుకే పేదలుగా మారుతున్న వారికి అనుగుణంగా మన విధానాలు లేవు. ఒకరకంగా చెప్పాలంటే కష్టజీవులను మనం బైపాస్‌ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణమవుతున్న నూతన భారతదేశంలో ఇలాంటివారికి చోటు లేదు. 2016–17 నాటికి దేశంలో పది కోట్లమంది వలస కార్మికులున్నారని అంచనా వీరిలో ఎస్సీ, ఎస్టీలకు చెందినవారే ఎక్కువ. 1989 నుంచి అమల్లోకి వచ్చిన అంతర్రాష్ట్ర వలసల చట్టం వలసకార్మికులకు కాస్తంత ఉపశమనం కలిగించినప్పటికీ గత కొన్నేళ్లుగా ఇది పనికిరాకుండా పోయింది. 

భారత్‌లో వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్య కొత్తదేమీ కాదు. అలాగని అపరిచితమైనదీ కాదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వ విధానాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. వలస కార్మికుల సమస్యను అర్థం చేసుకోవాలంటే విస్తృత స్థాయి దృక్పథం మనకు అవసరమవుతుంది. ఒక రెగ్యులేటరీ చట్రం, సమస్యలను సత్వరంగా పరిష్కరించే యంత్రాంగం లేనిదే వలస కార్మికుల సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడం సాధ్యం కాదు. 
సుజాతా గొటోస్కర్‌
శ్రమ, జెండర్, సంస్థాగత ప్రక్రియలపై పరిశోధకురాలు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు