వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!

15 Nov, 2022 13:16 IST|Sakshi

విశ్లేషణ

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్‌ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్‌ 2022 నవంబర్‌ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్‌ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్, జస్టిస్‌ రవీంద్రభట్‌లు ఈడబ్ల్యూఎస్‌ కోటాను విభేదించగా... జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా ఎం త్రివేది సమర్థించారు.  

మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం  కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్‌ యు.యు. లలిత్‌ కుమార్‌ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్‌ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్‌ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు.

103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్‌ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం,  బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్‌ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! 

ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్‌ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా   ప్రస్తుత ఈడబ్ల్యూఎస్‌లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం.

ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్‌ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 26ను తొలగిస్తూ జీవో నంబర్‌ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్‌) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్‌ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. 

ఇటీవలే జరిగిన కానిస్టేబుల్‌ నియామకాల ప్రక్రియలో ‘రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్‌ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్‌ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్‌ (ఓసీ)లకు తక్కువ కటాఫ్‌ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్‌ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్‌ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. 

అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?)

- బైరి వెంకటేశం 
రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ

మరిన్ని వార్తలు