తెలంగాణకు వరం సురవరం

28 Mar, 2021 09:07 IST|Sakshi

నేడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి

నిజాం నిరంకుశ పాలనలోని తెలంగాణలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు  సురవరం ప్రతాపరెడ్డి. చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉర్దూ భాషను మతానికి అంట గట్టి, ఆ మతపు ఆయుధంతో ఒక జాతి సంస్కృతిని సాంతం అవమానించడానికి, కాలరాయడానికి ప్రయత్నించాడు. 

‘తెలంగీ–బేఢంగీ’, ‘తెలుగు వికారభాష’ అనే నినాదం ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రచారంలోకి వచ్చింది. అందువల్ల విద్యార్థులు తెలుగులో చేర డానికి జంకేవారు. అదీగాక బి.ఎ. వరకు ఉర్దూలో చదివిన వారికి తెలుగు ఎలా వంటపడుతుంది? తెలుగు ప్రభుత్వం గుర్తించని భాష. అందులో డిగ్రీ పొంది ప్రయోజనం శూన్యం. రాజభాష ఉర్దూ. శాసనాలు ఉర్దూ. ఆఫీసుల్లో వ్యవహార భాష ఉర్దూ. కోర్టు భాష ఉర్దూ. జరీదా అనగా గెజిటెడ్‌ భాష ఉర్దూ. నాణేల మీద భాష ఉర్దూ. దుకాణాలు, వగైరా బోర్డులన్నీ ఉర్దూ. ఎవరైనా తెలుగు మాట్లాడినట్లు వినిపిస్తే ‘తెలంగీ–బేఢంగి’ అని వెక్కిరింపు. తెలుగు మూడో తరగతిలో మొదలవు తుంది. 7వ తరగతి వరకు సాగుతుంది. 8వ తర గతి నుంచి ఆప్షనల్‌ (ఐచ్ఛికం). పాఠశాలలు, కళా శాలలు అన్నీ సర్కారువే. అవి ఏర్పరచడానికి ప్రమాణాలు ప్రతీ సూచీకి ఒక ఇంటర్మీడియెట్‌ కాలేజీ, రాజ్యంలో నాలుగు అంటే నాలుగే ఇంటర్‌ కాలేజీలు. ప్రతి జిల్లాకు ఒక పౌఖాన్వా అంటే హైస్కూల్, ప్రతి తాలూకాకు వస్తాన్వా. తహతన్వా అంటే మిడిల్‌ స్కూల్‌. గ్రామ ప్రాముఖ్యతను బట్టి వీధి బడులను ఫర్మానా ద్వారా నిషేధించారు. అందువల్ల పంతుళ్లు తమ ఇళ్లల్లోనే తెలుగు చెప్పేవారు.

ఇలాంటి నేపథ్యంలో తెలుగు భాషా ప్రచారా నికి, తెలంగాణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు ప్రజలను జాగృతం చేయడానికి సురవరం ప్రతాప రెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించారు. దీని  స్థాప నలో రాజబహదూర్‌ వెంకటరామారెడ్డి సహాయం తీసుకున్నారు. సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసా లతో తెలుగు భాషాభిమానులను చైతన్యవంతు లను చేశారు. నిరంకుశ పాలనను విమర్శిస్తూ నిర్భ యంగా ఎన్నో వ్యాసాలు రాశారు. జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజలను ఎలా పీడిస్తున్నారో నిక్క చ్చిగా తెలియజెప్పారు. 

అంతేకాదు, ప్రతీ గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలను మరింత జాగరూకులను చేయవచ్చని భావించి, గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నుండి ఎన్నో అవ రోధాలు ఎదుర్కోవాల్సి వచ్చినా లెక్క చేయక గ్రంథాలయాల ఏర్పాటును ఒక ఉద్యమంగా కొనసాగించారు.)) గ్రంథాలయాల ఏర్పాటుతో ప్రజా విప్లవం ఊపందుకోగలదన్న భావనతో నైజాం సర్కార్‌ కొత్తగా గ్రంథాలయాల ఏర్పాటును నిషేధించింది. అంతేకాదు, తెలుగువారు సభలు, సమావేశాల ఏర్పాటును ముందుగా అనుమతి లేకుండా చేపట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది. 1942 మే 26న తెలంగాణలో ఆంధ్ర మహాసభల వ్యాప్తికి గ్రంథాలయ మహాసభలను ఆలంపూర్, సూర్యాపేట, జనగాం తదితర ప్రాంతాల్లో సుర వరం ఘనంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ రచ యితల సంఘం, లక్ష్మణరాయ పరిశోధన మండలి వంటి పలు సంస్థలు స్థాపించడంలో ఆయన పాత్ర ముఖ్యమైనది.

బ్రిటిష్‌ ఆంధ్రులు నిజాం ఆంధ్రులను తమ సోదరులని గానీ, తమతో సములనిగానీ గుర్తిం చలేదు. బ్రిటిష్‌ ఆంధ్ర నాయకులెవరూ తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. ‘తెలంగాణలో కూడా కవులున్నారా?’ అని ప్రశ్నించినాడు ఒక కవి శేఖ రుడు. సురవరం దానిని సవాలుగా తీసుకున్నారు. 354 మంది తెలంగాణ కవుల కవితలను కూర్చి గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక ప్రచురించారు. నైజాం పాలనలో అణగారిపోయిన తెలుగువారి ఘనతను చాటిచెప్పిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్‌ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు.
ఆ మహానీయుని ఆశయాలకు పునరంకితం కావడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి.
-కొలనుపాక కుమారస్వామి
ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్, వరంగల్‌
మొబైల్‌ : 99637 20669

మరిన్ని వార్తలు