ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!

28 Apr, 2022 00:51 IST|Sakshi
సతీమణి వసుమతికి నారాయణ నివాళి

కామ్రేడ్‌ వసుమతి హఠాత్తుగా మరణించిన వార్త మమ్మల్నందర్నీ నిర్ఘాంతపరిచింది. తిరుపతి వెళ్లక ముందు బహుశా, రెండు రోజుల ముందు... నారాయణ, వసుమతి, పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చారు. సాయంకాలం చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. దాదాపు సంవత్సర కాలం నుండి వసుమతి అమెరికాలో స్పన్నీ దగ్గర ఉండడంతో చాలా రోజుల తర్వాత కలిశామని సంతోషించాం. తిరుపతికి వెళ్ళిన తర్వాత గుండె నొప్పి రావడంతో పరీక్ష చేసి స్టెంట్‌ వేశారని తెలిసింది. ఇంత లోనే దుర్వార్త!

నారాయణ గుంటూరులో ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కాలేజీలో చదువుతూ, స్టాలిన్‌ బాబు ద్వారా ఏఐఎస్‌ఎఫ్‌ లోకి తెనాలి విద్యార్థి రాజకీయ పాఠశాల ద్వారా వచ్చారు. వచ్చిన కొద్ది కాలంలోనే మిలిటెంట్‌ నాయకుడిగా రూపొంది అనేక పోరాటాలు నిర్వహించారు. రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా శక్తివంతమైన విద్యార్థి ఉద్యమం నిర్వహించారు. తర్వాత పార్టీ నిర్ణయం మేరకు సొంత జిల్లాలోని తిరుపతికి వెళ్లి ఎస్వీ యూనివర్సి టీలో బలమైన విద్యార్థి ఫెడరేషన్‌ నిర్మించారు. ఆ దశలో మహిళా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదువుతున్న వసుమతితో పరిచయం ప్రేమగా మారింది. వివాహం తిరుపతిలోనే! మంత్రాలు, పెళ్లి భోజనాలూ లేని అతి సాధారణమైన పెళ్లి అది.

వివాహం అనంతరం వారు ఎస్‌ఎస్‌ ఆఫీస్‌లోనే కాపురం పెట్టారు. అదొక సత్రం. అయినా సర్దుకు పోయింది వసుమతి. ఆమె మొదట్లో చాలా మితభాషి. ఒకవైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మరోవైపు తరచుగా ఇంటికి వచ్చే బంధువులు, పార్టీ కార్యకర్తలకు అతిధి సత్కారాలు చేస్తూ సంతోషంగా బాధ్యతలు మోసింది. బ్యాంకు ఉద్యోగుల సంఘంలో చురుకుగా పని చేస్తూ ఇతర వర్కింగ్‌ ఉమెన్‌ సంఘాల నిర్మాణంలో కూడా పాల్గొంది. ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఆమె ఉద్యోగం చేయడం ద్వారా నారాయణకు ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు లేకుండా పార్టీ కార్యక్రమాలు నిరంతరం సాగించేందుకు సహాయపడింది.

 నారాయణ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కు కుటుంబంతో సహా వచ్చారు. అప్పటికి నా భార్య విజయలక్ష్మి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తూ ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. మా పెద్దబ్బాయి చదువుకోసం స్టేట్స్‌లో ఉన్నాడు. నారాయణ–వసుమతి కుటుంబాన్ని మాతోపాటు ఉండమని ఆహ్వానిస్తే అంగీకరించారు. కొద్ది నెలలు మేమందరం కలిసే ఉన్నాం. అప్పటికి స్పన్నీ, దీరూ కాలేజీలో చదువుతున్నారు. ఆ రకంగా మా బంధం సన్నిహిత కుటుంబ బంధం! వసుమతి కూడా హైదరా బాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. హైదరాబాద్‌లో నారాయ ణతోపాటు పార్టీ సీఆర్‌ పౌండేషన్‌ తదితర కార్యక్రమాల్లో పాల్గొంది.

    టీవీ99 ప్రారంభించిన తర్వాత వసుమతి చాలా బాధ్యతలు తీసుకుంది. అనేక రకాల సమస్యలు వచ్చాయి. చాలా ఓపికగా ఆమె బాధ్యతలు మోసింది. టీవీ99 అమ్మేసిన తర్వాత కూడా ఆమె సంవత్సరాల తరబడి సమస్యలు ఓపికగా ఎదుర్కొన్నది. నారాయణ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీకి మకాం మార్చిన తర్వాత వసుమతి కూడా ఢిల్లీ వచ్చింది. ‘అజయ్‌ భవన్‌’లోనే ఒకగదిలో ఉండేవారు. ఏఐటీయూసీ ఆఫీస్‌ నుండి తరచుగా విజయలక్ష్మి వచ్చేది. అందరం కలిసి భోజనం చేసే వాళ్ళం. ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు! ఇంటా బయటా అన్నిరకాల బాధ్య తలూ అవలీలగా మోసిన మంచి కమ్యూనిస్టు వసుమతి. ఆమెకు మా దంపతుల జోహార్లు!

వ్యాసకర్త: సురవరం సుధాకర్‌ రెడ్డి
భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి

మరిన్ని వార్తలు