జీవితకాల మధుర‘యాత్ర’

6 Nov, 2020 08:23 IST|Sakshi

సందర్భం

ఈ రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని ఓ మేలి మలుపు తిప్పిన ప్రజా సంకల్పయాత్ర వంటి ఓ చారిత్రక ఘట్టంలో మేమూ భాగస్వాములమైనందుకు గర్వంగా భావి స్తాను. నిరాశ, నిçస్పృహలు అలముకున్న ప్రజలకు ‘నేనున్నాను’ అని ధైర్యం చెబుతూ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ఆ అడుగులు ఈ రాష్ట్ర అభివృద్ధికి పడిన గొప్ప ముందడుగు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను చేసిన పాదయాత్ర గురించి చెబుతూ ఆనాడు తన కాళ్లలో దిగిన ముళ్లు ఇప్పటికీ గుర్తుకు వస్తాయన్నారు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికిగానీ ఆయనతో కలసి పాదయాత్రలో పాల్గొన్న మాకుగానీ మేము పడిన కష్టాలు.. కాళ్ల బొబ్బలు.. జలుబులు, జ్వరాలు, వర్షాలు ఏవీ గుర్తుకు రావు.

చివరికి  అప్పటి టీడీపీ ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తనపై చేయించిన హత్యాయత్నం కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గుర్తుకు రాదు. ఆ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు, వారి సమస్యలు, ఆవేదన గుర్తుకు వస్తాయి. అంతటి బాధల్లోనూ ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం... తమ బాధలు తీర్చడానికి రాజన్న కొడుకు వచ్చాడని వాళ్ల మొహాల్లో కనిపించిన నమ్మకం గుర్తుకు వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు విడిచిపెట్టారు. ప్రజలకు హామీ ఇచ్చినట్టుగా కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఆ యాత్ర ఎన్నో గొప్ప అనుభవాలు, జ్ఞాపకాలు మిగిల్చింది. అసలు కష్టం అన్నది ఏమిటో తెలియకుండా పెరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మేము మొదట్లో కంగారుపడ్డాం. ఆయన పాదయాత్రకు ఏర్పాట్లు ఎలా చేయాలా అని తర్జనభర్జనపడ్డాం. మేము పది మందిమి ఓ జట్టుగా ఉండి పాదయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించాం. పగటి పూట అంతా పాదయాత్ర చేసే నాయకుడు రాత్రి వేళ అయినాసరే కాస్త హాయిగా విశ్రాంతి తీసుకునేలా చూడాలన్నది మా ఉద్దేశం. కానీ పాదయాత్రలో అన్ని చోట్ల విశ్రాంతికి సరైన ప్రదేశాలు దొరికేవి కావు. ఊరి చివర పొలాల్లో, కొన్ని సార్లు అయితే శ్మశానాల సమీపంలో కూడా రాత్రి విడిది ఏర్పాటు చేయాల్సి వచ్చేది. కానీ అవేవీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకునే వారు కాదు.

విడిది ఏర్పాట్లు ఎలా ఉన్నా ఆయనకు పట్టేది కాదు. ఆ రోజు ఎంతమంది ప్రజలను కలిశాను.. వారు చెప్పిన సమస్యలు ఏమిటి.. ఇంకా తనను ఎవరైనా కలవలేక పోతున్నారా... ఇంకా మారుమూల పల్లెలకు వెళ్లాలి... ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూడాలి.. అందుకోసం పాదయాత్రలో ఏమైనా మార్పులు చేయాలా అని మాతో చర్చించేవారు. కానీ తన వసతుల గురించి ఒక్కరోజు కూడా ఆయన మాట్లాడలేదు. పగటి పూట మొత్తం ఏమీ తినకుండా... అంటే టిఫిన్, భోజనం లేకుండానే ఆయన పాదయాత్ర చేసేవారు. మధ్యాహ్నం కొన్ని పండ్లు తినేవారు. రాత్రి వేళల్లోనే భోజనం చేసేవారు. అందుకనే ఆయన చిత్తశుద్ధి, దృఢ సంకల్పాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించి అధికారాన్ని అప్పగించారు. ప్రజల విశ్వాసాన్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 17 నెలలుగా ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అంతటి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటి పాదయాత్రలో మొదటి నుంచీ చివరి వరకూ పాల్గొనడం.. ఆ పాదయాత్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరించడం ఓ గొప్ప అనుభూతి. జీవితకాలం పాటు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. పాదయాత్రకు ముందు జగనన్న సైనికులుగా ఉండేవాళ్లం. ఆయన్ను చూసిన తర్వాత జనం సేవకులుగా మారిపోయాం.

తలశిల రఘురాం
వ్యాసకర్త ఏపీ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, పాదయాత్రకు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు

మరిన్ని వార్తలు