గురు శిష్యులు ఒకే రోజు...

20 May, 2022 12:24 IST|Sakshi

భారత స్వాతంత్య్ర సమరంలో నిరుపమాన పోరాటాలు చేసిన యోధులు బిపిన్‌ చంద్ర పాల్, టంగుటూరి ప్రకాశం పంతులు గురుశిష్యులలాంటివారు. వారిరువురూ మే 20వ తేదీనే అసువులు బాయడం కాకతాళీయమే!

1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని వినోదరాయ పాలెంలో జన్మించిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. బారిస్టర్‌ కోర్సు చదవడం కోసం 1907లో ఇంగ్లండ్‌ వెళ్లారు. ఇండియా వచ్చి న్యాయవాదిగా మంచి పేరూ, డబ్బూ సంపాదించారు. ఆ కాలంలో బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలకు యువత స్వాతంత్య్ర సమరంలో దూకుతుండేవారు.  ప్రకాశం పంతులు పాల్‌ ఉపన్యాసాలు విని... వేల రూపాయల ఆదాయం ఇచ్చే న్యాయ వాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టారు. కొన్ని రోజులు ‘స్వరాజ్య’ పత్రిక నడిపారు. గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. 

1921 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఉపఖండంలో అనేక ప్రాంతాలు సందర్శించారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు మరణిస్తే పోలీసు వాళ్ళు అక్కడికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రకాశం పంతులు అది చూసి చలించి పోలీసు వలయాలను ఛేదించుకొని అమర వీరుని దగ్గరికి వెళ్తూ చొక్కా గుండీలు తీసి తెల్లోడి తుపాకీ గుండుకు తన గుండెను చూపించి ఇక్కడ కాల్చమని సవాల్‌ విసిరారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన రాష్ట్ర ప్రజలు ‘ఆంధ్రకేసరి’ బిరుదునిచ్చారు.స్వాతంత్య్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953–1954 మధ్య పని చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటిస్తూ... వడదెబ్బకు గురై హైదరాబాదులో హాస్పిటల్‌లో చేరి 1957 మే 20న తుది శ్వాస విడిచారు.

జాతీయోద్యమంలో ప్రసిద్ధ ‘లాల్, బాల్, పాల్‌’ త్రయంలో బిపిన్‌ చంద్రపాల్‌ ఒకరు. అస్సాంలోని టీ తోటల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్‌ చంద్రపాల్‌ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. ‘వందేమాతరం’ ఉద్యమంలో భాగంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నంలో ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలు, కృషి ఫలితంగానే స్థాపితమైంది. భారత అతివాద ఉద్యమకారుల్లో గ్రగామిగా ప్రసిద్ధి చెందిన బిపిన్‌ చంద్రపాల్‌ 1932 మే 20న మరణించారు. ప్రకాశం పంతులు, బిపిన్‌ చంద్రపాల్‌ల పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం.

– కొమ్మాల సంధ్య, హన్మకొండ
(మే 20న టంగుటూరి ప్రకాశం పంతులు, బిపిన్‌ చంద్రపాల్‌ల వర్ధంతి)

మరిన్ని వార్తలు