సంపాదకుల సంపాదకుడు.. తాపీ ధర్మారావు

8 May, 2021 12:36 IST|Sakshi

సందర్భం

‘‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’’ ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే. తాపీ ధర్మారావును కొందరు జనవాణి, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికల సంపాదకుడుగా గుర్తుంచుకుంటే–మరికొందరు ఎన్నో విజయవంతమైన తెలుగు చలనచిత్రాల స్క్రీన్‌ ప్లే, సంభాషణల రచయితగా స్మరించుకుంటారు. కొంతమంది  కొత్తపాళీ, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వంటి విభిన్నమైన రచనల కర్తగా ప్రస్తుతిస్తుండగా – ఇంకొంతమంది రచయితల సంఘాలకు వారు చేసిన సేవలను కొనియాడుతారు. 

కానీ వారు చేసిన సేవ ప్రధానంగా ఏమిటో విద్వాన్‌ విశ్వం, ఆరుద్ర వంటివారు చాలా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు దినపత్రికల్లో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసిగా విద్వాన్‌ విశ్వం ‘మాణిక్యవీణ’లో ధర్మారావును శ్లాఘించారు. మన తెలుగు సినిమాల్లో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష అని ఆరుద్ర ‘వనిత’ మాసపత్రికలో తాపీవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విశదం చేశారు. 1887 సెప్టెంబరు 19న  పుట్టిన తాపీ ధర్మారావు 1973 మే 8న కన్నుమూశారు. గిడుగు రామమూర్తి ఆయనకు పర్లాకిమిడిలో పాఠం చెప్పిన గురువు. ఆయన విజయనగరంలో చదువుకునే కాలంలో గురజాడ అప్పారావు ఉన్నారు.

ధర్మారావు ఆసక్తి చూపిన అంశాల జాబితాగానీ, తిరిగిన ఊళ్ళ సంఖ్య గానీ, చేసిన ఉద్యోగాల చిట్టాగానీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది!  శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం, పర్లాకిమిడి, చీకటి సంస్థానం, విశాఖపట్నం, మదరాసు,  చుండి, ఊర్కాడు, దక్షిణ వల్లూరు, మందసా, చల్లపల్లి, విజ యవాడ – ఇలా చాలా ఊళ్ళలో ఆయన పనిచేశారు. ఉపాధ్యాయుడు, సర్వేయరు, సంరక్షకుడు, అంతరంగిక కార్యదర్శి, మేనేజర్, రిక్రూటింగ్‌ ఆఫీసర్‌ – ఇలా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల సమయంలో వేట, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం, ఫొటోగ్రఫీ, టెన్నిస్‌ వంటివి నేర్చుకున్నారు.  కుస్తీలు, నాటకాలు, మ్యూజిక్‌ గురించి చెప్పనక్కరలేదు. కనుకనే వారికి జీవితమంటే ఏమిటో తెలుసు.  జనం భాష ఏమిటో బాగా తెలుసు!

గూడవల్లి రామబ్రహ్మంగారి తోడ్పాటుతో దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు– అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. అంతేకాదు ఆయనతో కలసి ‘మాలపిల్ల’తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చలనచిత్రాల తొలిదశలో ప్రవేశించిన ధర్మారావు ఒకవైపు సంభాషణలలో వ్యావహారిక భాషను, మరోవైపు హేతుబద్ధతను రంగరించారు. అప్పట్లో తెలుగు సినిమారంగంలో స్క్రీన్‌ ప్లే పరంగా ‘తాపీ స్కూలు’ అని ప్రత్యేకంగా పిలిచేవారట. పత్రికలలో అగ్రస్థానంలో ఉంటూనే సినిమాల్లో పనిచేశారు. ఏక కాలంలో మేధావుల, పండితుల వేదిక అయిన పత్రికారంగంలోనూ;  పామరుల, సామాన్యుల రంజకమైన సినిమాల్లోనూ రాణించడం చిన్న విషయం కానేకాదు. వారికి ఆ మాధ్యమాల మర్మాలే కాదు, వాటి ప్రభావాలు కూడా బాగా తెలిసి వుండాలి!

ధర్మారావు సంభాషణలు రాసిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వారి దగ్గర ఉపసంపాదకులుగా పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు మొదలైన వారు తర్వాతి కాలంలో ప్రముఖ సంపాదకులుగా రాణిం చారు.  తాపీ ధర్మారావు సంపాదకుల సంపాదకుడు, ఆయనను చూసి నేర్చుకున్నానని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనడం గమనించాలి. తన పత్రికాభాషకు స్ఫూర్తి వేమన అని ప్రకటించిన ప్రజాస్వామిక స్ఫూర్తిమూర్తి తాపీ ధర్మారావు. 

-డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
మొబైల్‌ : 94407 32392
(నేడు తాపీ ధర్మారావు వర్ధంతి సందర్భంగా) 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు