అధ్యాపకులే కేంద్రంగా విద్యాభివృద్ధి

7 Sep, 2021 01:20 IST|Sakshi

సందర్భం

విద్యాబుద్ధులు నేర్పించాలనేది మన ప్రాచీన కాలం నుండి వస్తున్న సంస్కృతి. విద్యాబుద్థులు నేర్పిం చాలి, నేర్చుకోవాలి అనేవి మన సాంఘిక అవసరంగా గుర్తించారు. నాడు గురుకుల వ్యవస్థ చాలా ప్రాచుర్యంలో వుండేది. విద్యతోపాటు బుద్ధి నేర్పించే విధివిధానాలుండేవి. కానీ నేటి విద్యావిధానంలో బుద్ధి నేర్పించే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాలక్రమేణా గురుకుల వ్యవస్థ అంతరించి, ఉపాధ్యాయ పాఠశాల వ్యవస్థ ఏర్పడింది. నాటి గురువులు విద్యనూ బుద్ధినీ సమానమైన రీతిలో అభ్యాసం చేయించేవారు. కానీ నేడు విద్యార్జనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే సాంఘిక విలువలు పతనావస్థ స్థితికి చేరుతున్నాయని గుర్తించవచ్చు. ప్రస్తుత మన విద్యా విధానంలో విలువలతో కూడిన అధ్యయనం చేయించే ప్రణాళికలు చాలా తక్కువ. పోటీతత్వాన్ని పెంచే దిశగా ప్రయాణం చేస్తుండటంతో ఇప్పుడు విలువలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.

నూతన విద్యావిధానంలోని సూచనలు బహుళ ప్రయోజనకారిగా ఉన్నాయని చెప్పవచ్చును. స్కూల్‌ విద్యా విధానాన్ని మూడు దశలుగా విభజించారు. ఇది విజయవంతం కావాలంటే శాస్త్రీయ పద్ధతిలో దశలవారీ శిక్షణ పొందిన అధ్యాపకులను ఏరికోరి నియమించాలి. విజ్ఞానవంతులైన, క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు మన విద్యా విధాన భవిష్యత్తుకు మూలస్తంభాలు. నూతన విద్యావిధానంలో విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రణాళికాబద్ధమైన సూచన చేశారు కానీ, బుద్ధిమంతులను చేసే ప్రక్రియకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చు. విద్యార్థి పోగు చేసుకునే సమాచార సంచయనాన్నే సంపదగా మార్చే ప్రయత్నం జరుగుతోంది కానీ దాన్ని నాలెడ్జ్‌ బ్యాంక్‌గా మార్చే ప్రయత్నం తక్కువగా జరుగుతున్నది.

మనదేశంలో విద్యావిధానాన్ని పాఠశాల విద్యాభ్యాసం, కళాశాల విద్యాభ్యాసం, పరిశోధన అధ్యయన విధానం అనే మూడు దశలుగా విభజించారు. పాఠశాల విద్యాభ్యాస విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పాఠశాల విద్యావిధానంలో ముఖ్యంగా మేధావులైన అధ్యాపకుల సూచనల ఆధారంగా ప్రణాళికలు తయారు చేయటంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మన రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేయబోతున్న సందర్భంలో అధ్యాపకులకు దశలవారీ ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతోవుంది. దీనివల్ల మనదేశ మూల సంపద వేగవంతంగా పెరుగుతుంది.

అన్ని దశల్లోనూ అధ్యాపకులకు శిక్షణ, అభివృద్ధి ప్రణాళికలు శాస్త్రీయంగా వుండేలా సూచిస్తేనే వివిధ దశలలో విద్యాభ్యాసం విభజనకు అర్థం వుంటుంది. వివిధ దశలలో బోధనా ప్రక్రియకు అధ్యాపకులకు ఎటువంటి శిక్షణ, అభివృద్ధి  ప్రయత్నాలు చేయవలసి ఉంటుందనేది నూతన విద్యావిధానంలో విపులంగా లేదు. అవసరానికనుగుణంగా విద్య అధ్యయనం జరుగుతుంది. ఈనాటి విద్య ఉత్పత్తి ఎలా చేయాలి? చేసిన విద్యా ఉత్పత్తిని మార్కెట్‌లో ఎలా అమ్ముకోవాలి? అనేదే ప్రధానాంశంగా వుంది. అంతేకాకుండా సేవా రంగం వైపు ఆలోచనలు, వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు నేటి విద్యా అధ్యయనంలో ప్రధానమయ్యాయి. ఇటువంటి సందర్భాల్లో విద్యావికాసానికి చోటు లేదు. వికాసవంతమైన జీవితానికి తోడ్పడే విద్యావిధానం రానురాను తగ్గుముఖం పట్టింది. 

విజ్ఞాన సంపద వైపు ప్రస్తుత సమాజం పయనిస్తున్నది. విజ్ఞానసంపదే నికరమైన సంపద. ఈ సంపద దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. విజ్ఞాన సంపద ఎలా సంపాదించాలి అనేదే ముఖ్యమైన అంశం. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత విజ్ఞానభరితమైన జీవితాన్ని మానవుడు గడుపుతున్నాడని గమనించవచ్చు. ఆర్థికాభివృద్ధి చెందిన వర్గాలే విజ్ఞానసంపద భరితమైన సుఖజీవనం సాగిస్తున్నారు. నూతన విద్యావిధానంలో ‘బోధనా విధానం అధ్యయన ప్రక్రియ అన్వేషణాత్మకంగాను, అనుభవ పూర్వకంగాను ప్రభావవంతంగా ఉండాలని’ సూచించారు. బోధనా వృత్తిని స్వీకరించేవారిలో మనోప్రవృత్తిని గమనించి అవకాశం కల్పించాలి. ఆ వృత్తిని స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి శిక్షణ అవసరమనేది నిర్ణయించాలి. 

అధ్యాపక వృత్తి ఒక విలక్షణమైన ప్రవృత్తి. ఒక వితరణ గుణం కలిగిన వృత్తిగా పరిగణించి అధ్యాపకుల జీవన విధానముండాలి. నూతన జాతీయ విద్యావిధానంలో అధ్యాపకులు అనుభవపూర్వకంగా విద్యను నేర్పాలని సూచించారు. ఎటువంటి అనుభవాలు ఉండాలి? అనే సూచనలు చేయలేదు. అధ్యాపకులు అన్వేషణాత్మక ప్రాతిపదికగా విద్యాబోధన చేయాలని సూచించారు. అధ్యాపకులను అన్వేషణాత్మక పరమైన భావనలు ఉండే వారిని ఎలా ఎంపిక చేయాలో ఇందులో సూచించలేదు. అనుభవపూర్వకంగాను, ప్రభావవంతమైన విద్యను అందించాలని సూచించారు. అనుభవమే లేకపోతే అనుభవపూర్వకమైన విద్యను ఎలా అందించగలరన్నది ప్రశ్న. అలాగే ప్రభావితం చేయగల అధ్యాపకులను ఎన్నిక చేయటం చాలా క్లిష్టమైన ప్రక్రియ.

నూతన విద్యా విధానం సఫలీకృతం కావాలంటే వివిధ దశలవారీ నైపుణ్యమున్న అధ్యాపకులను నియమించాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాదశలో డ్రిల్‌ టీచర్‌ లాంటివారు, తల్లిపిల్లి వంటి సంస్కారంగల బాధ్యతతో ప్రవర్తించే వారై వుండాలి. అదేవిధంగా మాధ్యమిక, పై చదువులకు ఉత్తేజపరిచే శక్తిగల ఉపాధ్యాయులను నియమించాలి. ఈ ప్రక్రియ చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అలాగే ఉత్తేజపరిచే అధ్యాపకులు, అనుభవసంపన్నులైన ఉపాధ్యాయులు ఉన్నత విద్యకు చాలా ముఖ్యం. అధ్యాపకుడిని ఆచార్యుడు అని కూడా అంటారు. అంటే ఆచరించి చెప్పువాడు అని అర్థం. అధ్యాపకులుగా ఉన్నవారంతా ఆచార్యులుగా మారితే విద్యాభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది. 
అధ్యాపకులందరూ డ్రిల్‌ టీచర్‌ గుణాన్ని కలిగి ఉండాలి.

ఎందుకంటే తాను చూపించి, నేర్పించేవాడు డ్రిల్‌ టీచర్‌. అదేవిధంగా అనుభవాన్ని ప్రదర్శించి నేర్పించగలిగేవారే నిజమైన అధ్యాపకుడు. అంతేకాకుండా గురి చూపేవాడు గురువు. అధ్యాపకులు తమ విద్యార్థులను బహుముఖ అభివృద్ధి, వారిసచ్ఛీలతా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. పద్ధతి ప్రకారం విద్యను నేర్పే వ్యక్తి ఉపాధ్యాయుడు. సహజ సిద్ధంగా విద్యను అధ్యయనం చేయించే వ్యక్తి అధ్యాపకుడు. ఉపాధ్యాయున్ని అధ్యాపకుడుగా మార్చగలిగితే ఆ దేశ యువతకు ఒక వరం. అదే విధంగా అధ్యాపకున్ని గురువు స్థానానికి చేర్చగలిగితే అది దేశానికి శాశ్వతమైన సంపద. పైన సూచించిన మార్పులను ఆహ్వానించి, ప్రోత్సహించి, గౌరవించి అధ్యాపక బృందాన్ని ఏర్పర్చుకుంటే మన దేశ ప్రగతి సుస్థిరమవుతుంది.

-ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి
వ్యాసకర్త పూర్వ ఉపకులపతి,
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ‘ 94408 88066

మరిన్ని వార్తలు