తెలంగాణ వ్యవసాయ శాఖకు ప్రణాళిక ఉన్నట్లేనా?

5 May, 2022 13:34 IST|Sakshi

ప్రణాళికా బద్ధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే రాష్ట్రాన్ని ఆగ్రగామిగా నిలబెడు తున్నామని, 2014 జూన్‌ నుండి ముఖ్యమంత్రి సహా తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ విధానాన్నే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమూ అమలు చేస్తోంది. జూన్, జూలైల్లో ‘ఆక్షన్‌ ప్లాన్‌ తయారు చేయడం, వ్యవసాయ రుణ ప్రణాళిక తయారు చేయడం’ కొనసాగుతున్నది. ఈ ప్రణాళికలను అవసరాలను బట్టి కాకుండా గత సంవత్సరంపై కొద్దో గోప్పో పెంచి తయారు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, రుణాలు తదితర అంశాలపై సరైన అవగాహన లేదు. అధికారులకు ఉన్న అవగాహన మేరకు ఆక్షన్‌ ప్లాన్‌లో నమోదు చేస్తారు. ఏ ఫసల్‌ అనగా... వానాకాలం, యాసంగిలలో పంటలు ఎంత పండాలన్న అంశం కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉజ్జాయింపుగా అంకెలు వేస్తున్నారు. లక్ష్యాలను నిర్ణయించినప్పుడు దేని ఆధారంగా లక్ష్యాలు నిర్ణయించారో కూడా తెలియదు. ప్రణాళిక లేకుండా వ్యవసాయాన్ని కొనసాగించడంతో రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్యల నివారణ ప్రభుత్వ లక్ష్యంలో ఒక భాగంగా లేదు. రాష్ట్ర వ్యవసాయరంగానికి శాస్త్రీయ ప్రణాళికను చేర్చి, అందుకు అనుగుణంగా కార్యక్రమాల నిర్వహణ కొన సాగాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు 2021–22 వానాకాలం రాష్ట్ర ప్రభుత్వ ఆక్షన్‌ ప్లాన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 140,12,444 ఎకరాలు లక్ష్యంగా ప్రకటించారు. కానీ వాస్తవంగా సాగైంది 129,68,933 ఎకరాలు మాత్రమే. అనగా 10,43,513 ఎకరాలు తక్కువ సాగైంది. లక్ష్యంలో ఇంత పెద్ద మొత్తం తగ్గింపు చేయవచ్చా? అలాగే 2021–22 యాసంగిలో లక్ష్యం 68,16,720 ఎకరాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంగా సాగైంది 54,41,985 ఎకరాలు మాత్రమే. అనగా 13,74,735 ఎకరాలు తక్కువ సాగైంది. యాసంగిలో వరి పెట్టకూడదని ముఖ్యమంత్రితో సహా పెద్ద ఎత్తున విస్తృతమైన ప్రచారం చేశారు. అయినా ప్రణాళికలో  52,80,350 ఎకరాలు వరి పంట సాగు లక్ష్యంగా ప్రకటించారు. (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?)

పై గణాంకాలను చూస్తే... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళిక ఉందా? లేక నామకహః అధికారులు రాసిన ఆక్షన్‌ ప్లాన్‌ను మంత్రులు అంగీకరిస్తున్నారా అన్న అను మానం వస్తుంది. వ్యవసాయ సంబంధిత మంత్రులకు (వ్యవసాయశాఖ, సివిల్‌ సప్లై శాఖ, మార్కెటింగ్‌ శాఖ, ప్రకృతి వైపరీత్యాల శాఖ, వ్యవసాయ రుణ శాఖ) సమన్వయం లేక ఎవరికి తోచిన విధంగా వారు విధానాన్ని రూపొందించు కుంటున్నారు. ఏ పంటలు పండించాలో తెలియక రైతులు గందరగోళానికి గురై మార్కెట్‌లో ఏ విత్తనాలు అందు బాటులో ఉంటే ఆ విత్తనాలు వేస్తున్నారు. ఈ ఏడాది కేంద్రం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయనంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరవనని పంతం పట్టింది. దీంతో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచిందనుకోండీ!

గత 7 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల రూ. 38 వేల కోట్లు నష్టపోగా రూ. 3,500 కోట్లు మాత్రమే సహాయం చేశారు. అసలు ప్రణాళికలో ఏనాడూ ప్రకృతి వైపరీత్యాల గురించి చర్చించక పోవడం శోచనీయం. రాష్ట్ర ప్రణాళికను రూపొందించే క్రమంలో  ఈ దిగువ చర్యలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. భూసార పరీక్షలు నిర్వహించాలి. భూసారాన్ని బట్టి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో పెట్టాలి. వ్యవసాయ రుణాలను అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ శాఖను గ్రామాలలో రైతులకు అనుకూలంగా ఉంచాలి. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాలు చెల్లించాలి. మార్కెట్‌లో రైతులకు అందుబాటులో కమిటీలు పని చేయాలి. కనీస మద్దతు ధరలు అమలు జరపాలి. ఈ చర్యలను అమలు చేస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో అవసరం కన్నా తక్కువ పండుతున్న పంటలను పండించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి. (క్లిక్: వ్యాపారులకో నీతి... రైతులకో నీతి)

- సారంపల్లి మల్లారెడ్డి 
వ్యవసాయ రంగ నిపుణులు

మరిన్ని వార్తలు