Telangana: అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి

28 Jan, 2023 10:10 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకి సీనియర్, జూనియర్‌ లిస్టుల పేరుతో ఉపాధ్యా యులను కేటాయించింది.

మొత్తం లక్ష 5 వేల మందిలో 25 వేల మంది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి బదిలీ అయ్యారు. మిగతా 80 వేల మంది పని చేసే చోటే మళ్ళీ పోస్టింగ్‌ పోందినారు. ఇప్పుడు అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి. నచ్చిన చోట ఖాళీ ఉంటే వెళ్ళే వెసులు బాటు ఇవ్వాలి. కొందరి లబ్ధి కోసం 317 జీవో అమలు చేసి మళ్ళీ ఇప్పడు వేరే జిల్లాలకి బదిలీ అయిన టీచర్లకు 2 సంవత్సరాల సర్వీస్‌ రూల్‌ ఉండాలనడం అర్థం లేని నిబంధన. 

ఇక 80 వేల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ కావడం జరుగుతోంది. కానీ టెట్‌ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, కొత్తగా డీఎడ్, బీఎడ్‌ పూర్తి చేసిన బ్యాచులవారూ మరో టెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. 

పదోన్నతులు, బదిలీల ప్రక్రియ  పూర్తి చేసిన తర్వాత ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్‌ పంపినారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరు కుంటున్నారు.

– రావుల రామ్మోహన్‌ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు

మరిన్ని వార్తలు