ఇది ఎన్నికల శంఖారావమే!

1 Jul, 2022 11:55 IST|Sakshi

ఇప్పుడు దేశంలో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయ శక్తి లేదు. అక్కడక్కడా కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ వాటికి పరిమితులున్నాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీ హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. బహుశా ఇక్కడి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం పూరించే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలకూ రాజకీయ వ్యూహాలు ఇక్కడే రూపుదిద్దుకోనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి బలమున్న తెలంగాణను కైవసం చేసుకోవడమే తక్షణ లక్ష్యమని జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జూలై 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ నున్నాయి. ఇక్కడే భవిష్యత్‌ రాజకీయ వ్యూహాలు పదునుదేల నున్నాయి. అలాగే రాబోయే రెండేళ్ల పాటు పార్టీ అనుసరించవలసిన రాజకీయ ఎత్తుగడలు రూపొందుతాయి. 2024 ఎన్నికల శంఖాన్ని  ఒక విధంగా హైదరాబాద్‌ నుండే పూరించనుంది. 2019 ఎన్నికలలో నరేంద్ర మోదీ తిరుగులేని ప్రజా తీర్పుతో మరోసారి అధికారం చేపట్టిన తర్వాత... మొదటిసారిగా బీజేపీ కార్యవర్గం పూర్తి స్థాయిలో ఇక్కడ సమావేశమవుతోంది.

గతంలో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యవర్గ సమావేశాల తర్వాత, రెండు దశాబ్దాలకు మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సమావేశాలు జరగ బోతున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, తన పరిధిని దేశంలో విస్తృతంగా పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఇప్పడు పార్టీ అధి కారంలో లేని రాష్ట్రాలు, ఇప్పటివరకు గెలుపొందని లోక్‌సభ నియో జకవర్గాలపై దృష్టి సారిస్తున్నది.

బీజేపీ తదుపరి మజిలీ ప్రధానంగా తెలంగాణ అని ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వం పలు సందర్భాలలో స్పష్టం చేసింది. దక్షిణాదిన కర్ణాటక తర్వాత బీజేపీ అధికారంలోకి రాగల అవకాశాలు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. ఆ దిశలో నేరుగా కేంద్ర నాయకత్వ పర్యవేక్షణలో తెలంగాణలో పార్టీ ప్రజలలోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేస్తున్నది.

ఒక విధంగా, ఇప్పటి వరకు మరే రాష్ట్రంలో చేయని మహత్తర ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేస్తున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు మూడు రోజుల పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరినీ ఒకొక్క నియోజకవర్గం చొప్పున మొత్తం 119 నియోజక వర్గాలకు పంపింది. వారు అక్కడనే మకాం వేసి, స్థానిక పార్టీ శ్రేణులతో కలిసిపోయి వచ్చే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఏమేరకు చేరుతున్నాయో తెలుసుకొని, వారికి వాటి గురించి చెప్పడంతో పాటు క్షేత్రస్థాయిలో కేసీఆర్‌ పాలనా వైఫల్యాల ప్రభావాన్నీ అధ్యయనం చేస్తారు. అలాగే బీజేపీ పార్టీ సంస్థాగత పరిస్థితులు, నెలకొన్న రాజ కీయ వాతావరణాన్ని పరిశీలిస్తారు. ఒక్కో నాయకుడూ తాము పరి శీలించిన నియోజకవర్గంలో గెలుపొందడానికి పార్టీ పరంగా తీసుకో వలసిన చర్యల గురించి నాయకత్వానికి నివేదిక ఇస్తారు.

ఒక విధంగా తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా సిద్ధపడే విధంగా ఇప్పటినుండే కార్యాచరణకు ఉపక్రమిస్తు న్నట్లు దీన్ని భావించవచ్చు. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఈ ఏడాది ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్‌లలో కూడా బీజేపీ గెలుపొందే విధంగా కార్యప్రణాళికలను ఇప్ప టికే సిద్ధం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికలకన్నా ముందే జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలను సహితం బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. గత ఎన్నికలలో బీజేపీ రెండో స్థానంలో ఉన్న 144 లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిం చడం ఇప్పటికే ప్రారంభించింది. వచ్చే 25 ఏళ్ళ పాటు భారతదేశ అభివృద్ధి లక్ష్యాలను ఏర్పరచుకొని, స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లకు చేరుకొనే సమయానికి  భారత్‌ను ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిపేం దుకు అవసరమైన సాధన సంపత్తులను సిద్ధం చేయడంలో మోదీ ప్రభుత్వం తలమునకలై ఉంది. ఈ చారిత్రక పరిస్థితిలో బీజేపీ శ్రేణులు చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్య వర్గ సమావేశాలు మార్గదర్శనం చేయనున్నాయి.

నేడు దేశంలో రాజకీయంగా బీజేపీకి జాతీయ స్థాయిలో పోటీ అన్నది లేదు. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలీయంగా ఉన్నా వాటికి చాలా పరిమితులు ఉన్నాయి. తాజాగా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తమకు కంచుకోటల వంటి రెండు నియోజకవర్గాలలో ప్రాంతీయ పార్టీలు ఓటమి చెందడమే అందుకు ప్రబల తార్కాణం.

రాజకీయ అవసరాల కోసం, సైద్ధాంతికంగా పొందికలు లేకుండా ఏర్పడే కూటములు నిలదొక్కుకోలేవని మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి బీజేపీ ఎంపిక చేయడం దేశంలో అణగారిన వర్గాల సాధికారత పట్ల పార్టీకి గల చిత్తశుద్ధిని వెల్లడి చేస్తుంది. ఆధునికతకూ, అభివృద్ధికీ దూరంగా ఉంటున్న దేశంలోని 12 కోట్ల మంది గిరిజన ప్రజల సాధికారత  పట్ల మొదటిసారి దేశం దృష్టి సారించేట్లు చేయగలిగింది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని సంపన్న దేశాలు సహితం ఆర్థికంగా కుదేలై, కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా భారత్‌ మాత్రమే సత్వరం కోలుకోగలుగుతున్నది. తిరిగి అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. శాస్త్ర, సాంకేతిక, రక్షణ రంగాలలో భారత్‌ సాధించిన అభివృద్ధిని నేడు అగ్రరాజ్యాలు సహితం గుర్తించ డమే కాకుండా, భారత్‌తో కలసి పనిచేయడం కోసం ఉత్సాహం చూపుతున్నాయి.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, ప్రపంచానికే మార్గదర్శకంగా నిల బడింది. సమర్ధవంతమైన చర్యల ద్వారా మహమ్మారిని కట్టడి చేయ డంతో పాటు, టీకాలను భారీ సంఖ్యలో అందుబాటులోకి తీసుకు వచ్చి, కేవలం మన ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచ ప్రజలకు అందుబాటులో ఉంచింది. టీకా కార్యక్రమం కారణంగా భారత్‌లో 42 లక్షల కరోనా సంబంధిత మరణాలను నివారించినట్లు అయ్యిందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేయడం గమనార్హం.

అగ్నిపథ్‌ ద్వారా రక్షణ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠ పరుస్తున్నాయి. ఆయుధాలకు విదేశాలపై ఆధారపడుతూ వస్తున్న మన రక్షణ రంగం ఇప్పుడు స్వదేశంలోనే వాటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉండటం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయాణిస్తున్నాం. ప్రభుత్వం కేవలం ఉద్యో గాలు కల్పించే వ్యవస్థగా మిగలకుండా, దేశంలో ఉద్యోగ అవకా శాలను ముమ్మరంగా పెంపొందించే సంధాన కర్తగా ఉండాలనే మోదీ ప్రభుత్వ విధానం విశేషమైన ఫలితాలు ఇస్తోంది. స్టార్టప్‌లలో మనం సాధిస్తున్న విశేష పురోగతి, రికార్డు స్థాయిలో ఎగుమతులు జరుగుతూ ఉండటం అందుకు తార్కాణం. అత్యాధునిక డ్రోన్‌లను కేవలం రక్షణ రంగానికి పరిమితం చేయకుండా వ్యవసాయం, వైద్యం వంటి రంగా లకు సహితం విస్తరింపజేస్తూ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి జరుగుతున్నది.

ఉక్రెయిన్‌ యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను సంక్షో భంలోకి నెట్టినా స్వతంత్రమైన విదేశాంగ విధానం ద్వారా, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో స్థిరంగా నిలబడటం ద్వారా భారత నాయకత్వం అనూహ్యమైన చొరవను ప్రదర్శించింది.

2024లో జరిగే ఎన్నికలు కేవలం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు కాబోవు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ప్రపంచంలో అగ్రదేశంగా ఎలా నిల వాలో నిర్ణయించేవి కూడా. అందుకనే హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అందుకు అవసరమైన భూమికను, కార్యప్రణాళికను రూపొందించనున్నాయి. ఓ విధంగా దేశ గమనాన్ని నిర్దేశించడంలో ఈ సమావేశాలు కీలకం కాబోతున్నాయి.

- బండి సంజయ్‌కుమార్‌
వ్యాసకర్త బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కరీంనగర్‌ ఎంపీ

మరిన్ని వార్తలు