పోరాట చరిత్రను గుర్తించాలి

17 Sep, 2021 14:24 IST|Sakshi

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల నుండి ఆగస్టు 15, 1947న దేశానికంతటికి స్వాతంత్య్రం లభించినా, తెలంగాణ నవాబు హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. ఆనాడు తెలంగాణలోని కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాల నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండా ఎగురవేయడంతో నిజాం పోలీసులు వారిపై కేసులు పెట్టారు. 1947 సెప్టెంబర్‌ 11న నిజాంను గద్దె దించాలని, సాయుధులై గెరిల్లా పోరాటాలు చేయాలని సీపీఐ, ఆంధ్ర మహాసభ, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో తరతరాలుగా వెట్టి చేసిన చేతులు బందూకులు పట్టాయి. ఊరూరు ఒక విప్లవ కేంద్రమయ్యింది. 

హైదరాబాద్‌ అంటే 16 జిల్లాల పరగణ. ఇప్పుడున్న మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలుగా ఇవి వున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు 17 సెప్టెంబర్‌ 1948ని స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాయి. కానీ కాంగ్రెస్‌ గానీ, తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీలు గానీ తెలంగాణ విలీన దినం నిర్వహించడానికి నిరాకరించాయి. కానీ తెలంగాణ పోరాటంలో ఉనికి లేని బీజేపీవాళ్లు విమోచన దినం అధికారికంగా జరపాలని అంటున్నారు. అగ్రనాయకుడు అమిత్‌ షాను తెచ్చి జెండాలను ఎగురవేసే ముందు ఆనాటి సాయుధ పోరాట చరిత్రను గుర్తించి, చిరస్మరణీయం చేయాలి. సాయుధ పోరాటాన్ని హిందు, ముస్లిముల తగాదాగా చిత్రీకరించి మత రాజకీయాలు చేయ పూనుకోవడం తగనిది. అనేక మంది ముస్లింలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

గతంలో బీజేపీ నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రను వక్రీకరించేందుకు చాలా ప్రయ త్నించింది. రజాకార్లు, కమ్యూనిస్టులు చేతులు కలిపి భారత యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారంది. ప్రజలు నమ్మకపోవడంతో కొత్తగా నిర్మల్‌లో వెయ్యి ఊడల మర్రిచెట్టుకు నిజాం పాలకులు వెయ్యి మందిని ఉరి తీశారనీ, అక్కడ సెప్టెంబర్‌ 17 విమోచనోత్సవాలు చేస్తున్నామనీ ప్రకటించారు. నిజానికి ఇది 1948 సెప్టెంబర్‌ 17తో సంబంధం లేని అంశం. అలనాడు రాంజీ గోండు బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా 1860లో చేసిన వీరోచిత తిరుగుబాటుతో నిర్మల్‌ వెయ్యి ఊడల మర్రికి సంబంధం ఉన్నది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియిద్దీన్, చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య త్యాగాల వలన భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమైందని, వారు లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్‌లాగా వుండేదని చిలుక పలుకులు పలికిన కేసీఆర్‌ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ చేస్తూ విలీన దినంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు. సెప్టెంబర్‌ 17ను అధికరంగా గుర్తిస్తే ప్రజలలో ఒక చర్చ జరుగుతంది. గతం లేనిది వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్‌ వుండదని రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది. సాయుధ పోరాట త్యాగాల చరిత్ర లేకుండా తెలంగాణ లేదని గ్రహించుకోవాలి. 

-చాడ వెంకటరెడ్డి
వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

మరిన్ని వార్తలు