Paddy Procurement Row: వరి... ఉరి కాకుండా ఆపలేమా?

22 Apr, 2022 11:51 IST|Sakshi

కొంతకాలంగా తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న వరి పండించే రైతన్నలకు ప్రత్యామ్నాయం చూపవలసి ఉంది. వరి పండించవద్దని చెప్పడం సరైంది కాదు. వరి కొనుగోలు సమస్య ముఖ్యంగా యాసంగి పంటకు వస్తుంది. కారణం – యాసంగిలో వడ్ల మిల్లింగ్‌లో ఎక్కువ నూకల శాతం ఉండడమే. నూక శాతాన్ని తగ్గించుకోవడానికి మిల్లర్లు బాయిల్డ్‌ రైస్‌ వైపు మొగ్గు చూపడం వలన కేంద్రం కొనుగోలుకు విముఖంగా ఉంది. రైస్‌కు ఉన్న డిమాండ్‌ బాయిల్డ్‌ రైస్‌కు లేకపోవడం, బాయిల్డ్‌ రైస్‌ వినియోగం దేశంలో తగ్గుతుండడం కేంద్ర ప్రభుత్వ నిరాసక్తతకు ఊతమిస్తున్నాయి. 

ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబబు కాదు. రైతుల క్షోభను అర్థం చేసుకుని ఇరు ప్రభుత్వాలూ సానుభూతితో పరిష్కారం కోసం కృషి చేస్తే రైతుల మన్ననలను పొందగలరు. 

సమస్యకు మూలకారణమైన నూకలు, బాయిల్డ్‌ రైస్‌ వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే, రైతులకు మంచి ధరను అందించవచ్చు. వీటిని వినియోగించి ‘ఇథనాల్‌’ తయారీకి మంచి అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఇంధనం కొరత, అధిక ఇంధన ధరలకు ఒక పరిష్కారం కూడా అవుతుంది. పెట్రోల్‌ కొరత, దాని ఇతర ఉత్పత్తుల ధరల పెరుగుదల వలన, ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. బ్లెండెడ్‌ పెట్రోల్‌ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!)

అన్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌పై లీటరుకు రెండు రూపాయల అదనపు ఎక్సైజ్‌ సుంకం ఉండడం వలన, బ్లెండెడ్‌ పెట్రోల్‌ వినియోగించడానికి ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంది. ఇథనాల్‌ ఉపయోగిస్తే రైతులకు మేలుతో పాటు, దేశానికి పెట్రోలియం దిగుమతుల భారం తగ్గుతుంది. దేశంలో ‘ఇథనాల్‌’ కొరతను కూడా అధిగమించవచ్చు.  కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా, వరి ఉత్పత్తులతో ఇథనాల్‌ తయారీకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశం మెండుగా ఉందనీ, తయారీకి ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామనీ చెప్పడం కూడా గమనార్హం. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం)

ఇథనాల్‌ను రైస్‌ తయారీలో కూడా మితంగా ఉపయోగిస్తారు. నూకలను, బాయిల్డ్‌ రైస్‌ను పిండిగా మార్చి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్, రైస్‌ బిస్కెట్లు, నిల్వ ఆహార పదార్థాల తయారీలో కూడా బియ్యపు పిండిని వాడుతారు. ఇవే కాకుండా ఇంకా మెరుగైన వినియోగానికి మార్గాలను పరిశోధనల ద్వారా అన్వేషించి ఉపయోగించడం ద్వారా వరి రైతులకు ఊరటనివ్వడమే కాకుండా పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థికం పరిపుష్టమౌతుంది. 

– ఏఎల్‌ఎన్‌ రెడ్డి, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు