బడుగుల ఆత్మగౌరవ మార్గం ఇదేనా?

17 Aug, 2021 00:11 IST|Sakshi

మొన్న వివేక్, నిన్న స్వామిదాసు, నేడు ఈటల రాజేందర్‌ పదమూడేళ్లు నిరంతర పోరాటం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పార్టీ టీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో వుండి ఉంటే బీజేపీ తెలంగాణను ఇచ్చిఉండేది కాదన్నది వాస్తవం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై బీజేపీ చూపుతున్న సవతితల్లి ప్రేమ లేదా ప్రేమరాహిత్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విభజన హామీలను కూడా ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన నిధులనివ్వడంలోనూ వేధిస్తూ బీజేపీ ఫెడరల్‌ స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా తెలంగాణ లోలా సబ్బండ వర్ణాలను పట్టించుకొని పాలన సాగిస్తున్న వైనముందేమో ఈ నాయకులే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్యం ఈ ఏడేళ్ళలో చేపట్టిన పథకాలు, సంక్షేమ చర్యలు తెలంగాణలోని ప్రతి గడపనూ ఏదో విధంగా తాకుతున్న నగ్నసత్యం వీరికి తెలియంది కాదు. అయినా సరే టీఆర్‌ఎస్‌ పార్టీలో తమ ఆత్మగౌరవం పోయిందని, తమకు ప్రాముఖ్యత లేదని చిలకపలుకులు పలికే వీరు బీజేపీలో పొందుతున్న ఆత్మగౌరవం ప్రాముఖ్యత ఏంటో చెబితే బాగుం టుంది.

మార్గనిర్దేశకులైన  మేధావులు తమ మాటలకు, రాతలకు జవాబుదారీ కలిగివుండాలి. రాజకీయ  విషయాల గురించి మాట్లాడినప్పుడు, స్టేట్‌మెంట్లు ఇచ్చినప్పుడు, చర్యలు చేసినప్పుడు తమ రాష్ట్రానికి లేదా దేశానికి ఏ పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తోందో, ఏం చేయగలదో అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, మానవ కేంద్రక పాలననిచ్చే పార్టీ విషయంలో క్లారిటీ లేని మేధావులే ఎక్కువ ఉన్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో గందరగోళ పరి స్థితులేర్పడి ఈ నేలను రాజకీయ ప్రయోగశాలగా మార్చుతున్నారు. ఐఏఎస్‌ పదవి వదిలిపెట్టి పార్టీ స్థాపించి మూడు సార్లు ఢిల్లీ సీఎంగా గెలిచాడు అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇతనికి ఏ రాజకీయ దృక్పథమూ లేదు.

అవినీతి రహితపాలనే ఎజెండా. ప్రజల కనీసావసరాలైన విద్యుత్తు, నీరు, ప్రభుత్వ పాఠశాలలు, ఉత్తమ వైద్యం, మంచి రోడ్లు, మురికివాడలు లేకుండా చూడటం, అధికార్లంతా ప్రజలకు అవసరాల్లో అందుబాటులో ఉండటం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తానే రాజు, తానే మంత్రిగా, అన్నీ నిర్వహిస్తూ వస్తున్నాడు. జయప్రకాష్‌ నారాయణ అనే మరో ఐఏఎస్‌ అధికారి పదవి వదలి రాజకీయ పార్టీ స్థాపించాడు. నీతి గల రాజకీయాలు నడపడం ఆశయంగా పెట్టుకున్నారు. అతికష్టంగా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా ఏ దృక్పథంలేని పార్టీగా మిగిలిపోయి పార్టీ దాదాపు అంతర్ధానమైంది. మరో ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చెయ్యబోయి విఫలమయ్యాడు. ఆకునూరి మురళి ఐఏఎస్‌ అధికారి. రాజకీయాభిప్రాయమున్నా, ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఉత్తమ సలహాలిచ్చి మెప్పుపొందాడు. 

కాన్షీరాంగారు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాదు గాని విద్యాధికుడైన సైంటిస్ట్‌. నిరుపేద కుటుంబంనుంచి వచ్చిన దళితుడు. దళిత బహుజన రాజకీయాల కోసం ఉద్యోగం వదిలి, బ్రహ్మచారిగానే ఉండి తనను తాను ప్రజల కోసం అంకితం చేసుకున్నవాడు. కాలినడకన, సైకిల్‌పై దేశమంతా తిరిగి బహుజన రాజకీయాలను వ్యాప్తి చేసినవాడు. బీఎస్పీ పార్టీ స్థాపించి దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీని మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన సిద్ధాంతకర్త. ఒంటిచేత్తో పార్టీని దేశ వ్యాప్తం చేసి, బహుజన రాజకీయాలను దేశవ్యాప్తం చేసి అందుకోసమే జీవించి, మరణించినవాడు. కాన్షీరాం తర్వాత మాయావతి బీఎస్పీ అధినేత్రి అయినా కాన్షీరాం స్థాయిలో పార్టీని విస్తృతం చెయ్యలేకపోవడం వల్ల ఆ పార్టీ ఉత్తరప్రదేశ్‌కే పరిమితమైంది.   

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ దళిత మేధావి, దళిత ఆర్తి ఉన్నవాడు. చాలామంది దళితులు, బీసీలు, పేదవారి లాగే ఆతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నోకష్టనష్టాలకోర్చి, చదువునే ప్రేమించి, కఠోర పరిశ్రమచేసి తన జీవిత లక్షమైన ఐపీఎస్‌ సాధించాడు. పోలీసాఫీసరుగా ఉన్నతోన్నత స్థానాలకెదిగాడు. పదహారు సంవత్సరాలు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశాడు. ప్రభుత్వ ఉత్తర్వులను సవినయంగా పాటించి, వీలైనంత వరకు ప్రజలతో సఖ్యంగా ఉండి అటు ప్రభుత్వ మన్ననలు, ఇటు ప్రజలమెప్పు పొందాడు. దళితులకు, పేదలకు మంచి చదువును ఇవ్వడం ఆయన తాత్విక స్వప్నం. 

పోలీసు అధికారిగా ఉంటే తన పేదల చదువుకల నెరవేరదని గురుకుల సంక్షేమ పాఠశాలల సెక్రటరీగా చేరాడు. రెండేండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు రెన్యువల్‌ పొంది మొత్తం తొమ్మిదేళ్ళు ఆ పదవిలో పనిచేశాడు. గురుకుల సంక్షేమ విద్యాలయాల కార్యదర్శిగా ఆయనచేసిన అమూల్యమైన సేవలకు తృప్తిపడేకావచ్చు లేదా ప్రవీణ్‌ కుమార్‌ కోర్కె పైనే కావచ్చు కేసీఆర్‌ అతన్ని తొమ్మిదేండ్లు ఆ పదవిలో ఉంచాడు.

సమర్థుడైన అధికారి అయితే ప్రభుత్వనిబంధనలను అతిక్రమించకుండానే ప్రజలకుపయోగపడే అద్భుతమైన పనులు చేయవచ్చని ఈ 9 సంవత్సరాల కాలం నిరూపించింది. ఈ కాలంలో 900 పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు, 7 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ, సైనిక్‌ స్కూల్, లా కాలేజ్, కోడింగ్‌ స్కూల్‌ తెలంగాణలో నాణ్యమైన విద్యనందించాయి. పేద దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్‌ విద్యా స్వప్నం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాశాలలో చదువుకునే అవకాశం, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యే అవకాశం ఈ విద్యాలయాలవల్ల లభించింది.

ప్రభుత్వం మంచి విద్యాలయాలు స్థాపించి వేల కోట్ల డబ్బులివ్వడం, పేద అణగారిన జాతుల విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రవీణ్‌కుమార్‌ ఆశయ సిద్ధివల్ల ఈ ఫలితాలు వచ్చాయి. ఈ విజయంలో ప్రభుత్వంగా కేసీఆర్, అధికారిగా ప్రవీణ్‌కుమార్‌ భాగస్వాములే. ఈ స్వల్పకాలంలో ఇన్ని విద్యాలయాలు, రెండున్నర లక్షలమందికి పైగా నాణ్యమైన విద్య, ఆత్మగౌరవం, బడుగుల్లో ఆత్మగౌరవం కలిగిస్తే.. ఇంకో ఆరేళ్ల పూర్తి కాలంలో మరెన్ని విజయాలు లభించేవో ప్రవీణ్‌ కుమార్‌ ఆలోచించాలి. ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంవల్ల, అదీ జాతీయపార్టీలో చేరడంవల్ల పరమపద సోపాన రాజకీయ చదరంగంలో
ఈ తొమ్మిదేళ్లలో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు, లభించిన రాజకీయ సహకారం భవిష్యత్తులో లభిస్తాయా అన్నది కోటి డాలర్ల ప్రశ్న.


డా‘‘ కాలువ మల్లయ్య 
వ్యాసకర్త కథా రచయిత మొబైల్‌ : 91829 18567

మరిన్ని వార్తలు